సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సమాచార, ప్రసారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ అపూర్వ చంద్ర

Posted On: 23 AUG 2021 6:00PM by PIB Hyderabad

ఐఏఎస్‌ అధికారి శ్రీ అపూర్వ చంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ అధికారి.  దిల్లీ ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు.

    సెప్టెంబర్ 2020లో పార్లమెంట్ ఆమోదించిన కార్మిక నియమావళిని త్వరగా అమలు చేసే బాధ్యతతో, శ్రీ అపూర్వ చంద్ర 01.10.2020 నుంచి కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన మార్గదర్శకత్వంలో అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపుల తర్వాత మొత్తం నాలుగు కార్మిక నియమావళుల కోసం నియమాలను రూపొందించారు. 
రూ.23,000 కోట్ల బడ్జెట్‌తో, సంఘటిత రంగంలో 78.5 లక్షల మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 'ఆత్మనిర్భర్‌ భారత్ రోజ్‌గార్ యోజన' ప్రారంభిమైంది.

    శ్రీ అపూర్వ చంద్ర 01.12.2017 నుంచి రక్షణ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్ జనరల్‌ (సేకరణలు)గా కూడా సేవలు అందించారు. సేకరణల ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా సాయుధ దళాలను బలోపేతం చేసే బాధ్యతతో ఆయన విధులు నిర్వర్తించారు. ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ, బహుళ విధుల హెలికాప్టర్లు, అస్సాల్ట్ రైఫిళ్లు, నౌకాదళ నౌకలు, టి-90 ట్యాంకులు వంటి అనేక ప్రధాన ఒప్పందాలపై శ్రీ చంద్ర హయాంలో సంతకాలు జరిగాయి. కొత్త 'రక్షణ సముపార్జన విధానం' రూపొందించేందుకు ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహించారు.
 
    మహారాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి (పరిశ్రమలు)గా 2013-2017 మధ్య పని చేశారు. ఈ కాలంలో ఎఫ్‌డీఐలు, ఇతర పెట్టుబడులను ఆకర్షించడంలో మహారాష్ట్ర దేశంలోనే ముందుంది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి ఎలక్ట్రానిక్ విధానం, రిటైల్ విధానం, ఏక గవాక్ష విధానం వంటి కొత్త పాలసీలను తీసుకురావడంలో శ్రీ చంద్ర కీలక పాత్ర పోషించారు. దిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డీఎంఐసీ) కింద, మొట్టమొదటి 'స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్' శ్రీ చంద్ర హయాంలోనే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ప్రారంభమైంది.
 
    కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో ఏడు సంవత్సరాలకు పైగా శ్రీ చంద్ర సేవలు అందించారు. పరిశ్రమలకు ఇంధన సరఫరాలు, లాజిస్టిక్స్, రవాణా, ఇంధన ఉత్పత్తుల నిల్వ, పంపిణీ మొదలైన అంశాలకు సంబంధించిన విధానాల రూపకల్పనలో కీలకంగా పాల్గొన్నారు. పరిశ్రమలకు గ్యాస్. మహారత్న పీఎస్‌యూ అయిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌సీ లిమిటెడ్ బోర్డుల్లో డైరెక్టర్‌గానూ ఉన్నారు.

 

***
 


(Release ID: 1748394) Visitor Counter : 220