సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఏటా ఆగస్టు 14న ‘భయానక విభజన సంస్మరణ దినం’: ప్రధాని ప్రకటన

మన ప్రజల పోరాటాలు.. త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 14ను
‘భయానక విభజన సంస్మరణ దినం’గా పాటిద్దాం: ప్రధానమంత్రి;

సామాజిక విభజన, విద్వేషమనే విష భావనలను నిర్మూలించి ఐకమత్య
స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, మానవ సాధికారతను మరింత
బలోపేతం చేయాల్సిన అవసరాన్ని #PartitionHorrorsRemembranceDay
మనకు సదా గుర్తుచేస్తూనే ఉండాలని ఆకాంక్షిద్దాం: ప్రధానమంత్రి;

విభజన వేదనను ఎన్నటికీ మరువలేం: ప్రధానమంత్రి

Posted On: 14 AUG 2021 3:06PM by PIB Hyderabad

దేశ విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి, మూలాల నుంచి చెల్లాచెదరైన వారికి ఘన నివాళిగా ఏటా ఆగస్టు 14ను వారి త్యాగాల సంస్మరణ దినంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజును ‘సంస్మరణ దినం’గా ప్రకటించడం వల్ల ఆనాడు విభజన ఫలితంగా ప్రజలు ఎన్నెన్ని బాధలు పడ్డారో, ఎంత వేదనకు గురయ్యారో ప్రస్తుత, రాబోయే తరాల భారతీయులందరికీ గుర్తుచేసినట్లు కాగలదు. ఆ మేరకు ప్రభుత్వం ఏటా ఆగస్టు 14ను “భయానక విభజన సంస్కరణ దినం”గా ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా పలు సందేశాల్లో దృఢమైన ప్రకటన చేశారు.

ఈ సందేశాల్లో ఆయనేమన్నారంటే-

   “విభజన వేదనను ఎన్నటికీ మరువలేం. ఈ కల్లోలంలో మన లక్షలాది సోదరీసోదరులు చెల్లాచెదరయ్యారు. మతిలేని హింసాద్వేషాలకు అనేకమంది నిలువునా బలైపోయారు. ఆనాటి మన ప్రజల పోరాటాలు, త్యాగాలకు గుర్తుగా ఆగస్టు 14ను మనం ‘భయానక విభజన సంస్మరణ దినం’గా పాటిద్దాం. ఈ మేరకు సామాజిక విభజన, విద్వేషమనే విష భావనలను నిర్మూలించి ఐకమత్య స్ఫూర్తిని, సామాజిక సామరస్యాన్ని, మానవ సాధికారతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని #PartitionHorrorsRemembranceDay మనకు సదా గుర్తుచేస్తూనే ఉండాలని ఆకాంక్షిద్దాం.”

   భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందింది. ఆ మేరకు ఏటా ఆగస్టు 15న మనం స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. ఏ దేశానికైనా ఇది సంతోషకరమైన, గర్వించదగిన సందర్భం; కానీ, స్వాతంత్ర్యం సిద్ధించిందన్న సంతోషంతోపాటు విభజన సంబంధిత సంతాపం కూడా మనం అనుభవించక తప్పలేదు. సరికొత్త స్వతంత్ర భారత ఆవిర్భావంతోపాటు విభజన సంబంధిత హింస వెంటాడిన ఫలితంగా లక్షలాది భారతీయుల గుండెల్లో గాయాలు ఎన్నటికీ చెరగని మచ్చలుగా మిగిలిపోయాయి. మానవాళి చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా భారీ వలసలు చోటుచేసుకోగా దాదాపు 2 కోట్లమందిపై దుష్ప్రభావం పడింది. లక్షలాది కుటుంబాలు తమ పూర్వికుల గ్రామాలు/పట్టణాలు/ నగరాలను, ఇళ్లూవాకిళ్లతోపాటు సర్వస్వాన్నీ వదిలి శరణార్థులుగా కొత్త జీవితాన్ని ఎదుర్కొనాల్సిన దురవస్థ దాపురించింది.

   ఈ నేపథ్యంలో 2021 ఆగస్టు 14-15 తేదీల మధ్య అర్ధరాత్రి దేశం మొత్తం 75వ స్వాతంత్ర్య వేడుకకు సిద్ధమవుతుండగా, విభజన నాటి వేదన, హింసా జ్ఞాపకాలు జాతి గుండె లోతుల్లో సలుపుతూనే ఉంటాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందటానికి భారత్‌ ముందడుగు వేస్తున్నప్పటికీ, విభజనవల్ల దేశం అనుభవించిన క్లేశాన్ని మనమెన్నటికీ మరువలేం. అందుకే ఒకవైపు స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటూ మరోవైపు ఆ ముందు రోజునాటి విభజన హింసాకాండలో ప్రాణత్యాగం చేసిన భరతమాత ప్రియ పుత్రులు, పుత్రికలకు ఈ కృతజ్ఞతాపూర్వక జాతి నివాళి అర్పిస్తోంది.


(Release ID: 1745966) Visitor Counter : 387