రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

'విజయ్‌ దివస్‌' సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకస్థూపం (ఎన్‌డబ్ల్యూఎం) వద్ద అమర సైనికులకు నివాళులు అర్పించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌

Posted On: 26 JUL 2021 12:45PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు

* రక్షణ మంత్రి ఎన్‌డబ్ల్యూఎం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు
* అమర సైనికుల శౌర్యం, త్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది
* రక్షణ శాఖ సహాయ మంత్రి, సైనిక, వైమానిక దళాధిపతులు, రక్షణ శాఖ కార్యదర్శి & సీఐఎస్‌సీ కూడా నివాళులర్పించారు

    22వ కార్గిల్ 'విజయ్ దివస్' సందర్భంగా, అమరులైన వీర సైనికులకు దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకస్థూపం వద్ద రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులు అర్పించారు. 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం లేదా ఆపరేషన్‌ విజయ్‌లో పాల్గొని, తమ ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశానికి విజయాన్ని అందించి అమరులైన వీర సైనికులకు, వారి అత్యున్నత త్యాగం పట్ల గౌరవం ప్రకటిస్తూ, రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.


 

 


    ఎన్‌డబ్ల్యూఎం వద్ద సందర్శకుల పుస్తకంలో రాసిన తన సందేశంలో, కార్గిల్ యుద్ధంలో మన సైనికులు ప్రదర్శించిన శౌర్యాన్ని రక్షణ మంత్రి గుర్తుచేసుకున్నారు. వీర సైనికులు చేసిన ఆత్మార్పణను దేశం ఎన్నటికీ మరచిపోదని పేర్కొన్నారు. దేశం వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, వారి ఆదర్శాలను అనుసరిస్తుందని రాశారు. 

    వీరులైన మన సైనికులు చేసిన అత్యున్నత త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని రక్షణ మంత్రి ట్వీట్‌ చేశారు.

    సైనికుల సాహసం, త్యాగానికి వందనం సమర్పిస్తూ, శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్ ట్విట్టర్‌లో ఒక దృశ్య సందేశాన్ని కూడా పంచుకున్నారు.


 
    రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్‌ భట్‌, వైమానిక దళాధిపతి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భదౌరియా, సైనికాధిపతి జనరల్ ఎంఎం నరవణె, రక్షణ శాఖ కార్యదర్శి 
డా.అజయ్‌ కుమార్‌, చీఫ్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ టు ది చైర్మన్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ (సీఐఎస్‌సీ), వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌ కూడా అమర వీరులకు నివాళులు అర్పించారు. రక్షణ శాఖ సీనియర్ సివిల్, మిలిటరీ అధికారులు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు.


 
    కార్గిల్ యుద్ధ సమయంలో; వైమానిక దళం సాయంతో భారత వీర సైనికులు చెలరేగి పోయారు. దుర్భేద్య పర్వత ప్రాంతాలను, ప్రతికూల వాతావరణాన్ని అధిగమించి, వ్యూహాత్మక పర్వత శిఖరాలపైకి చేరుకుని, శత్రువుపై గెలిచారు. ఈ విజయానికి గుర్తుగా, దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సంఘటనలలో అమరులైన సైనికులను మననం చేసుకుంటూ దేశం ఏటా 'విజయ్‌ దివస్‌' జరుపుకుంటోంది.

 

***
 


(Release ID: 1739030) Visitor Counter : 454