ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భాషా పరిరక్షణతోనే సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోగలం - ఉపరాష్ట్రపతి


భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతం అవుతాయి

తెలుగు భాషా పరిరక్షణకు పంచ సూత్రాలు

ఆదర్శవంతమైన జీవనానికి సంస్కృతి తోడ్పడుతుంది

ప్రవాస భారతీయులు సాంస్కృతిక వారధులు

ఖండాంతరాలు దాటి మన సంస్కృతిని కాపాడుకుంటున్న ప్రవాస భారతీయులకు అభినందనలు

భారతీయ సంస్కృతి సనాతన ధర్మంగా పరిఢవిల్లింది

ప్రకృతిని కాపాడుకోవడం, నలుగురికీ సాయం చేయడం భారతీయ సంస్కృతి

ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకోవాలి, జీవన విధానంలో భాగం చేసుకోవాలి

పీఠాధిపతులు ప్రజల్లోకి వెళ్ళి ఆధ్యాత్మికతను, ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయాలి

శ్రీ సాంస్కృతిక కళాసారధి – సింగపూర్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి ప్రసంగం

Posted On: 03 JUL 2021 2:27PM by PIB Hyderabad

భాషను కాపాడుకుంటేనే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోగలమని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్దేశం చేశారు. భాషా పరిరక్షణ కోసం ఐదు సూత్రాలను సైతం ఆయన సూచించారు. శ్రీ సాంస్కృతిక కళాసారధి – సింగపూర్ సంస్థ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమంలో అంతర్జాలం ద్వారా ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

భారతీయ సంస్కృతిని ఖండాంతరాలకు మోసుకువెళ్ళి అక్కడ మన అచారాలు కట్టుబాట్లు పాటిస్తూ, సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియజేస్తున్న ప్రవాస భారతీయుల్ని సాంస్కృతిక వారధులుగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, వారంతా ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా మార్చేశారని, వారి పాత్రను చూసి మాతృభూమి గర్విస్తోందని తెలిపారు. ఈ సాంస్కృతిక భావన మానవాళి పురోగతికి దోహదం చేస్తుందని ఆకాంక్షించారు.

ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, భావోద్వేగ అంశాలు ఆ సమాజపు సంస్కృతి అవుతుందన్న యునెస్కో నిర్వచనాన్ని గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, కళలు, జీవన విధానాలు, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు సైతం ఈ సంస్కృతిలో భాగాలే అని తెలిపారు. అనేక ప్రత్యేకతల కారణంగా భారతీయ సంస్కృతి సనాతన ధర్మంగా పరిఢవిల్లిందన్న ఆయన, పశువులు, చెట్లు, నదులను పూజించే భారతీయు సంప్రదాయం ప్రకృతి పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. పేదలకు సాయం చేయడానికి భారతీయులు ధర్మంగా భావించారన్న ఉపరాష్ట్రపతి, మన జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళు అందరూ కలిసి మెలసి జీవించడానికి సాయపడ్డాయని, ఇవన్నీ మన సంస్కృతి గొప్పతనాన్ని కళ్ళకు కడతాయని పేర్కొన్నారు. 

భారతదేశం అనేక భాషలు, సంస్కృతుల నిలయమన్న ఉపరాష్ట్రపతి, భిన్నత్వంలో ఏకత్వం మనందరినీ కలిపి ఉంచిందని, మనిషి మారినా సంస్కృతిని మరచిపోలేదని, మనిషి ఆదర్శవంతంగా జీవించడానికి సంస్కృతి దోహదం చేస్తుందని తెలిపారు. ఖండంతరాలు దాటినా నేటికీ మన సంస్కృతిని కాపాడుకుంటున్న ప్రవాస భారతీయులకు అభినందనలు తెలిపారు.

భాష, సంస్కృతులకు అవినాభావ సంబంధం ఉందన్న ఉపరాష్ట్రపతి, భాష మన సంస్కృతికి జీవనాడి అని, ఉన్నతమైన సంస్కృతి, ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుందని తెలిపారు. భాషా వైవిధ్యం నాగరికతకు గొప్ప పునాది అన్న ఆయన భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తివంతమౌతాయని తెలిపారు. ప్రతి నాగరికతా తన గొప్పతనాన్ని భాష ద్వారా వ్యక్తం చేసిందన్న ఆయన, మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు. వ్యాపార సంబంధాలు భాష లేకుండా పెంపొందలేవని పేర్కొన్నారు.

కాలగమనంలోసరిహద్దులు మారినా, మాతృభాషలు మాత్రం మారలేదన్న ఉపరాష్ట్రపతి,  మన ప్రజాసంగీతం, నాట్యం, ఆచారాలు, పండుగలు, సంప్రదాయ విజ్ఞానం, వృత్తుల వారసత్వం లాంటి వాటిని సంరక్షించుకోవడం మాతృభాషను కాపాడుకోవడం ద్వారానే వీలవుతుందని తెలిపారు. మాతృభాష అంటే తెలుగు భాష గురించి మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. మాతృభాషలో చదివితే ఎదగలేమనే అపోహ ప్రజల్లో ఉందని, భారతదేశ రాష్ట్రపతి మొదలుకుని ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇలా అందరూ మాతృభాషలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగిన వారే అనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.

మాతృభాషను కాపాడుకునే దిశగా  పంచ సూత్రాలను ఉపరాష్ట్రపతి ప్రతిపాదించారు. ప్రాథమిక విద్య మాతృభాషలో అందేలా చూడడం, పరిపాలనా భాషగా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడం, న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించడం, క్రమంగా సాంకేతిక విద్యలో మాతృభాషల వినియోగం పెరగడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. మాతృభాష మాత్రమే నేర్చుకోవాలన్నది తన అభిమాతం కాదన్న ఆయన, మన భాష సంస్కృతులను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, ఇతరుల భాష సంస్కృతులను గౌరవించడం కూడా అంతే ముఖ్యమన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఓ భాష అంతరించిపోతోందని ఐక్యరాజ్యసమితి నివేదికలను ఉటంకించిన ఉపరాష్ట్రపతి, అందులో 196 భాషలు భారతదేశానివే ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో భాషను, సంస్కృతిని కాపాడుకోవాలని, ఇందు కోసం దేశవిదేశాల్లో ఉన్న భారతీయులంతా సంఘటితమై ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రారంభంలో ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందించిన కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామికి ఉపరాష్ట్రపతి ప్రణామాలు అర్పించారు. పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రజల్లోకి వెళ్ళి వారి ఒత్తిళ్ళను తొలగించేందుకు ఆధ్యాత్మికతను, సంస్కృతిని, ధర్మాన్ని వ్యాప్తి చేయాలని, అన్ని వర్గాల ప్రజలను తమ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ మాధవ్, మాజీ ఎంపీ శ్రీ మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్, వివిధ దేశాలకు చెందిన భాషాభిమానులు, భాషావేత్తలు తదితరులు  పాల్గొన్నారు.(Release ID: 1732515) Visitor Counter : 551