ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో సీబీఐసీ చేసిన కృషిని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. ఇటీవల కాలంలో పెరిగిన రెవిన్యూ వసూళ్లు ఇప్పుడు “కొత్త నియమం/ స్థితి” గా మారిందని ఆమె అన్నారు.
Posted On:
01 JUL 2021 7:28PM by PIB Hyderabad
దేశంలో జిఎస్ టి ప్రవేశపెట్టిన నాలుగో వార్షికోత్సవం-జిఎస్ టి డే, 2021-ని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు (సిబిఐసి), దేశంలోని సిబిఐసి క్షేత్ర స్థాయి కార్యాలయాలన్నింటిలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిబిఐసి జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా వర్చువల్ విధానంలో నిర్వహించింది. సిబిఐసి ఫీల్డ్ అధికారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎనిమిది నెలల కాలంలో పెరిగిన జిఎస్ టి ఆదాయాలు ఆత్మనిర్భర్ భారత్ కు వెన్నెముకగా నిలిచాయి. ఈ ఏడాది పన్ను చెల్లింపుదారులపై నిబంధనల భారం తగ్గించడం ద్వారా వారికి సహాయంగా నిలిచేందుకు కోవిడ్-19 ఉపశమన ప్యాకేజిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని జోనల్ కార్యాలయాల్లో 31 మంది అధికారులకు, ఒక అధికారికి మరణానంతరం జిఎస్ టి డే కమెండేషన్ సర్టిఫికెట్లను అందచేశారు.
అసాధారణంగా సంభవించిన కోవిడ్-19 మహమ్మారి రెండు దశల ప్రభావం వల్ల ఎదురైన పరిస్థితులు సహా మనం ఎన్నో సవాళ్లను దీటుగా అధిగమించి కొత్త పన్ను వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడం అధిక సంతృప్తిని కలిగించే అంశమని కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ జిఎస్ టి దినోత్సవం, 2021 సందర్భంగా పంపిన సందేశంలో అన్నారు. వరుసగా గత ఎనిమిది నెలలుగా జిఎస్ టి వసూళ్లు రూ.లక్ష కోట్లకు పైబడి వస్తున్నాయంటూ 2021 ఏప్రిల్ నెలలో రూ.1.41 లక్షల కోట్ల కొత్త రికార్డు నమోదు కావడం ఆనందకరమైన అంశమని ఆర్థికమంత్రి తెలిపారు. గత కొద్ది నెలలుగా ఆదాయం వసూళ్లలో వృద్ధి ఇప్పుడు కొత్త నియమంగా మారిందని ఆమె పేర్కొన్నారు.
జిఎస్ టి అమలులోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతి నిర్మాణానికి తమ వాటా అందించిన 54 వేల మందికి పైబడిన జిఎస్ టి చెల్లింపుదారులను గుర్తించడంలో సిబిఐసి కృషిని శ్రీమతి సీతారామన్ ప్రశంసించారు. ప్రస్తుత మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో రెండు కోవిడ్-19 ప్యాకేజిల రూపంలో లేటు ఫీజు మాఫీ, వడ్డీరేటు తగ్గింపు, గడువుల సడలింపు, పన్ను చెల్లింపుదారులకు నగదు లభ్యత కల్పించడం కోసం సత్వర రిఫండ్ డ్రైవ్ నిర్వహణ వంటి చర్యలు తీసుకున్నట్టు ఆమె చెప్పారు. కోవిడ్-19 చికిత్సలు, వ్యాధి నిరోధం కోసం ఉపయోగించే వ్యాక్సిన్లు, కీలక ఔషధాలు, ఉత్పత్తులు/ సేవలపై జిఎస్ టి రేట్లు తగ్గించినట్టు ఆమె తెలిపారు.
మహమ్మారి నేపథ్యంలో 189 మంది అధికారులు మరణించడం పట్ల ఆర్థికమంత్రి సానుభూతి ప్రకటిస్తూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారికి నివాళిగా “శ్రద్ధాంజలి” పేరిట ఒక పుస్తకం ప్రచురించడం కోసం సిబిఐసి తీసుకున్న చొరవను ఆర్థికమంత్రి ప్రశంసించారు. జిఎస్ టి నిర్వహణ వ్యవస్థకు అసాధారణమైన వాటా అందించి “ప్రశంసా పత్రాలు” పొందిన అవార్డు గ్రహీతలందరినీ శ్రీమతి సీతారామన్ అభినందించారు.
జిఎస్ టి చట్టాలు నిలకడగా మెరుగుపరిచేందుకు సహాయపడిన వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ప్రత్యేకించి ఎంఎస్ఎంఇలకు ఆర్థిక శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తన సందేశంలో ధన్యవాదాలు తెలిపారు. వారందించిన నిరంతర మద్దతు, అభిప్రాయాల కారణంగానే గత నాలుగు సంవత్సరాల కాలంలో జిఎస్ టి చట్టాలు, విధి విధానాలు, వ్యవస్థలు నిలకడగా మెరుగు పరచగలిగామన్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా జిఎస్ టి కుటుంబాన్ని విడిచి పరలోకాలకు తరలిపోయిన పలువురు విలువైన అధికారుల మృతికి సానుభూతి తెలియచేశారు. అంకిత భావం, కఠిన శ్రమ, జాతికి సేవలందించాలన్న స్ఫూర్తి ప్రదర్శించి ప్రశంసా పత్రాలు పొందిన అధికారులందరినీ శ్రీ ఠాకూర్ అభినందించారు.
జిఎస్ టి ఒక నిరంత ప్రక్రియగా ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్ శ్రీ బిబెక్ దేబ్ రాయ్ అభివర్ణిస్తూ గడిచిపోయిన ప్రతీ ఒక్క రోజూ ఆ వ్యవస్థకు మరింతగా మెరుగులు దిద్దుతూనే ఉన్నామన్నారు. జిఎస్ టి అంతకు ముందు అమలులో ఉన్న ఎన్నో చట్టాల ను తగ్గించి లిటిగేషన్ల సంఖ్య అదుపులోకి తెచ్చింది. అంతర్ రాష్ట్ర పరిమితులు కూడా తొలగిపోయాయి. భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పంపిన వీడియో సందేశాలను ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించారు.
కరోనా మహమ్మారి కాలంలో పన్ను చెల్లింపుదారులకు సౌకర్యాల కల్పన, భౌతిక సంప్రదింపులను టెక్నాలజీ సహాయంతో తగ్గించిన సిబిఐసి అధికారుల కృషిని సిబిఐసి చైర్మన్ శ్రీ ఎం.అజిత్ కుమార్ కొనియాడారు. కరోనా మహమ్మారి అనంతరం బలమైన పునరుజ్జీవం సాధించి వి-షేప్ రికవరీకి దోహదపడిన పన్ను చెల్లింపుదారులను ఆయన ప్రశంసించారు. 54 వేల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు జాతికి అందించిన సేవలను గుర్తించిన సిబిఐసి కృషి ప్రశంసనీయం, జిఎస్ టికి వారందించిన మద్దతు మరువరానిదనేందుకు ఇదే నిదర్శనం. జిఎస్ టి ప్రక్రియలో భాగంగా కొన్ని సంవత్సరాలుగా చేసిన ఆటోమేషన్ ను సిబిఐసి సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని అధికారులకు నొక్కి చెప్పారు. జిఎస్ టి సభ్యుడు శ్రీ వివేక్ జోహ్రి వసూళ్లు పెంచడానికి క్షేత్రస్థాయి అధికారులు ఉపయోగించుకున్న డిజిఏఆర్ఎం నివేదికలను, ఎంఐఎస్ లను ప్రశంసించారు.
(Release ID: 1732145)
Visitor Counter : 186