ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఉగ్రవాదుల దుశ్చర్యలను తిప్పికొట్టగలిగే వ్యూహాత్మక పరిష్కారాల మీద దృష్టి కేంద్రీకరించండి


ఐఐటీ పరిశోధకులకు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన

డ్రోన్ల సాయంతో తాజాగా జరుగుతున్న ఉగ్రవాదుల పన్నాగాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి

ఐఐటీ మద్రాసులో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించిన తొలి నిర్మాణం సందర్శన

విద్యాలయాలు, పరిశ్రమల మధ్య సమన్వయంతో మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని సూచన

విద్యాభ్యాసం తరగతిగదులతోపాటు ప్రయోగాత్మక విధానాలను ప్రోత్సహించేదిగా ఉండాలన్న ఉపరాష్ట్రపతి

దేశంలో ఉన్న గృహనిర్మాణ సమస్యల పరిష్కారంలో సాంకేతికత ఓ మైలురాయిగా మారాలి

జాతీయ ప్రయోజనాలు, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సృజనాత్మకతకు పెద్దపీట వేయాలని సూచన

Posted On: 30 JUN 2021 1:26PM by PIB Hyderabad

భారతదేశ ప్రయోజనాలను, లక్ష్యాలను దెబ్బతీసేలా ఉగ్రవాదులు పన్నుతున్న కుట్రలను భగ్నం చేసేందుకు అవసరమైన సాంకేతికతను వృద్ధి చేయడంలో ఐఐటీల వంటి పరిశోధనా సంస్థలు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
ఐఐటీ మద్రాసు ప్రాంగణంలో తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించిన నిర్మాణాన్ని ఉపరాష్ట్రపతి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలికాలంలో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు కుట్రలు పన్నుతున్న ఘటనలను ప్రస్తావించారు. విశ్వమానవాళికి ఉగ్రవాదం ప్రధానమైన శత్రువుగా మారిందన్న ఆయన, మిలటరీ రాడార్లు కూడా పసిగట్టలేని పద్ధతులను వినియోగిస్తున్న ఉగ్రవాదులకు దీటైన సమాధానం ఇవ్వాలన్నారు. ఐఐటీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పరిశోధన సంస్థలు సైతం ఈ దిశగా కృషిచేయాల్సిన తక్షణావసరం ఉందన్నారు.

ఐఐటీ మద్రాసు, త్వస్త మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ సంస్థ సంయుక్తంగా భారతదేశంలోనే తొలి త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించిన ఇంటిని పరిశీలించిన ఉపరాష్ట్రపతి ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న వారందరినీ అభినందించారు.

విద్యాలయాలు, పరిశ్రమలు పరస్పర సమన్వయంతో కృషిచేస్తే భారతదేశంలో మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చన్న ఉపరాష్ట్రపతి,  ఈ దిశగా కృషిచేస్తే భారతదేశంలో సాంకేతికత వృద్ధి చెందడంతోపాటు పరిశ్రమల రంగం ఎదుర్కొంటున్న నిపుణులైన మానవవనరుల కొరత కూడా తీరుతుందని పేర్కొన్నారు. వాణిజ్యపరమైన లక్ష్యాలను భారతదేశం చేరుకోవడం కూడా చాలా సులభతరం అవుతుందని తెలిపారు.

సాంకేతికత సామాన్యుడికి కూడా అందుబాటులోకి వచ్చేలా విస్తృతమైన కృషి జరగాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించిన ఉపరాష్ట్రపతి, ‘సాంకేతికత అనేది ఓ నిరూపితమైన భావనగా (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) మాత్రమే ఉండకుండా.. సామాన్యుల జీవితాలను మరింత సరళీకృతం చేసేందుకు ఉపయోగపడినపుడే ఆ ప్రయోగానికి, ఆ సాంకేతికతకు సార్థకత చేకూరినట్లువుతుంది’ అని తెలిపారు.

గృహనిర్మాణ రంగంలో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తుందన్న ఉపరాష్ట్రపతి, త్రీడీ ప్రింటింగ్, రొబోటిక్స్ వంటివి నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రయోజనాలు సామాన్యుడికి అందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలు, పరిశోధనలు జరగాలని.. వీటి ద్వారా భారతదేశంలో సొంతింటి కలకు నోచుకోని ఎంతో మందికి ఇళ్లను అందించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాలు మరింత వేగంగా అమలు కావడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

ఐఐటీ వంటి ఉన్నతవిద్యాసంస్థలు.. రానున్న సాంకేతిక విప్లవాలకు అనుగుణంగా పరిశోధనలు చేయడం ద్వారా సరికొత్త అవకాశాలకు అనుగుణంగా దేశాన్ని సిద్ధం చేసేందుకు చొరవతీసుకోవాలన్న ఉపరాష్ట్రపతి, తరగతి గదుల్లో విద్యతోపాటు ప్రయోగాత్మకమైన అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో రానున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో యువతను సన్నద్ధం చేసేందుకు వీలవుతుందన్నారు. అలాంటప్పుడే యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించడంకంటే.. తామే పదిమందికి ఉపాధి కల్పించే స్థితికి చేరుకుంటారన్నారు.

జాతీయ ప్రయోజనాలను, ప్రాంతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. సాంకేతిక అభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు నడిపించడంలో ఐఐటీల వంటి ఉన్నతవిద్యా సంస్థలు కృషిచేయాలని సూచించిన ఉపరాష్ట్రపతి, సమాజానికి అవసరమైన అంశాల్లో పరిశోధలను విస్తృతం చేయాలన్నారు. ఇలాంటి విషయాల్లో ప్రయోగాలకు ప్రోత్సాహకరంగా నిలుస్తున్న ఐఐటీ మద్రాసును ఆయన అభినందించారు. త్వస్త మ్యానుఫాక్చరింగ్ సొల్యూషన్ సంస్థను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వ్యవసాయం, తయారీ, రవాణా, నిర్మాణ రంగానికి అవసరమైన వివిధ సాంకేతికతలను వృద్ధి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు రెవెన్యూ మంత్రి శ్రీ ఎస్.రామచంద్రన్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ రామమూర్తి, వివిధ విభాగాల అధిపతులు, త్వస్త మ్యానుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



(Release ID: 1731480) Visitor Counter : 197