నీతి ఆయోగ్

స్థూలకాయం నిరోధానికి సత్వర చర్యలు!


నీతీ ఆయోగ్ ఆధ్వర్యంలో జాతీయ సమ్మేళనం

Posted On: 25 JUN 2021 12:32PM by PIB Hyderabad

మాతృసంబంధంగా సంక్రమించే స్థూలకాయం, కిశోరప్రాయంలో పరిణమించే స్థూలకాయం, బాల్యంలో వచ్చే స్థూలకాయం వంటి రుగ్మతలను నిరోధించే అంశంపై ఒక జాతీయ సమ్మేళనాన్ని నీతీ ఆయోగ్ నిర్వహించింది. నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ ఈ సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్) డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత సహాధ్యక్షతలో ఈ కార్యక్రమం జరిగింది. 


   నీతీ ఆయోగ్.లో ఆరోగ్య, పౌష్టికాహార  విభాగం అధనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, స్థూలకాయం అనేది “గుట్టు చప్పుడుకాకుండా వ్యాపించే అంటువ్యాధి” లాంటిదని అన్నారు. క్రమంగా పెరుగుతున్న స్థూలకాయం సమస్యలను, తగ్గించుకునేందుకు అనుసరించే పద్ధతులను గురించి ప్రపంచ స్థాయి నిపుణులు, ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రిత్వ శాఖల, జాతీయ పరశోధనా సంస్థల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో వివరించారు. తమ వద్దనున్న రుజువులను ప్రదర్శించారు. 


   యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) పౌష్టికాహార విభాగం అధిపతి అర్జన్ డె వఖ్త్ మాట్లాడుతూ, మితిమీరిన పౌష్టికాహారం కారణంగా భారతదేశంపై పెరుగుతున్న ఆర్థిక భారానికి సంబంధించి సాక్ష్యాధారాలను సమర్ఫించారు.  ఆర్థిక ప్రగతి అధ్యయన సంస్థ (ఐ.ఇ.జి.)కి చెందిన ప్రొఫెసర్ విలియమ్ జో ఈ సమ్మేళనంలో పాల్గొంటూ, భారతదేశంలోని కొన్ని భౌగోళిక ప్రాంతాల్లో కొత్తగా ఆవిర్భవిస్తున్న స్థూలకాయం సమస్యలపై విలువైన సమాచారాన్ని తెలియజేశారు.


   ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం (డబ్ల్యు.ఎఫ్.పి.) ఆరోగ్య, పౌష్టికాహార విభాగం, ప్రోగ్రాం ఆఫీసర్ షారీఖ్ యూనుస్ మాట్లాడుతూ, స్థూలకాయం సమస్యను నిరోధించేందుకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. ఆహారం ప్రాతిపదన విభిన్నమైన సామాజిక భద్రతా వ్యవస్థలను రూపొందించాలని ఆయన సూచించారు. భారతీయ ప్రజారోగ్య ఫౌండేషన్ ఆరోగ్య ప్రోత్సాహక విభాగం డైరెక్టర్ మోనికా అరోరా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.) పౌష్టికాహార విభాగం జాతీయ ప్రొఫెషనల్ ఆఫీసర్ రచితా గుప్తా ఈ సమ్మేళనంలో పాల్గొంటూ,..స్థూలకాయం సమస్యకు దారితీసే మార్కెటింగ్ వ్యూహాలు భారతీయ టెలివిజన్ చానళ్లలో ప్రసారమవుతున్న అంశాన్ని ప్రస్తావించారు. డేకిన్ విశ్వవిద్యాలయం ఫ్రొఫెసర్ అయిన కాథరీన్ బాక్ హోలర్, వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ విధాన వ్యవహారాల డైరెక్టర్ లాబ్ స్టెయిన్ మాట్లాడుతూ, స్థూలకాయం ఉన్నవారిని అనారోగ్యంతో బాధపడే ప్రజలుగా ఎలా పరిగణిస్తారో వివరించారు. జంక్ ఫుడ్ మార్కెటింగ్ కారణంగానే స్థూలకాయం చికిత్స వ్యయం పెరుగుతోందని వారన్నారు. 


  కేంద్ర ఆయుష్ (AYUSH) మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, యువజన వ్యవహారాల కార్యదర్శులు ఈ సమ్మేళనంలో మాట్లాడుతూ,..  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించవలసిన అంశంపై తమ సూచనలను సమర్పించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ,.. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు కూడా ఈ సమ్మేళనంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్లలో మార్పులను ప్రవేశపెట్టడం, అందుకు సానుకూల విధానాన్ని తీసుకురావడం గురించి వారు తెలియజెప్పారు. యునిసెఫ్ ప్రతినిధి యాస్మిన్ హాఖ్ కూడా ఇదే అభిప్రాయాన్ని సమర్థిస్తూ ప్రసంగించారు. 


   స్థూలకాయం సమస్యను ప్రాధాన్యాతా ప్రాతిపదికన, పరిష్కరించ వలసిన అవసరం ఉందని సమ్మేళనంలో పాల్గొన్న వారందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. మెరుగైన ప్రజా సమాచార వ్యవస్థకు మరింత మద్దతు ఇవ్వడం, శారీరక శ్రమతో కూడిన కార్యకలాపాలను ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని సూచించారు. స్థూలకాయం సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, ప్రజా సంఘాలు సంపూర్ణ స్థాయిలో కృషి చేయాల్సి ఉందన్నారు. ప్యాకేజీ లేబెలింగ్.పై నియంత్రణకు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు, శారీరక శ్రమతో కూడిన కార్యకలాపాలకు, ఆరోగ్యకరమైన జీవన శైలికి ప్రోత్సాహం అందించడం అవసరమని, అందుకు సంబంధించిన ఆర్థిక చర్యలతో కూడన వ్యూహాలను సత్వరం రూపొందించుకోవాలని వారు సూచించారు.  


  సమ్మేళనం ముగింపు సందర్భంగా నీతీ ఆయోగ్ ఆరోగ్య, పౌష్టికాహార వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ,..కిశోరప్రాయంలోని వారిలో కార్యకలాపాలను, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చేందుకు వివిధ రంగాలతో కలసి బహుముఖంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


(Release ID: 1730336) Visitor Counter : 199