ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఎడారీకరణ.. భూసార క్షీణత.. కరువు’లపై ఐక్యరాజ్య సమితి ఉన్నతస్థాయి చర్చల సందర్భంగా ప్రధానమంత్రి కీలకోపన్యాసం
భారత్‌లో గడచిన 10 ఏళ్లలో 3 మిలియన్ హెక్టార్ల అదనపు అటవీకరణ; దేశ వైశాల్యంలో దాదాపు నాలుగోవంతు వరకూ పెరిగిన అడవుల విస్తీర్ణం: ప్రధానమంత్రి;
భూసార క్షీణత తటస్థీకరణపై జాతీయ లక్ష్యానికి చేరువగా భారత్: ప్రధానమంత్రి;
2030 నాటికి భూసారం క్షీణించిన 26 మిలియన్ హెక్టార్ల భూమి
పునరుద్ధరణ.. తద్వారా 2.5-3 బిలియన్ టన్నుల బొగ్గుపులుసు
వాయువుకు సమానమైన ఉద్గారాల శోషణ లక్ష్యం సాధనకు కృషి;
భూసార క్షీణత సమస్యల పరిష్కారంలో శాస్త్రీయ విధానాలను
ప్రోత్సహించేందుకు భారతదేశంలో నైపుణ్య కేంద్రం ఏర్పాటు;
భవిష్యత్తరాలకు ఆరోగ్యకర భూగోళాన్ని అందించడం
మనందరి పవిత్ర కర్తవ్యం: ప్రధానమంత్రి
Posted On:
14 JUN 2021 8:21PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా “ఎడారీకరణ.. భూసార క్షీణత.. కరువు”లపై ఐక్యరాజ్య సమితి ఉన్నతస్థాయి చర్చల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలకోపన్యాసం చేశారు. “ఎడారీకరణ నివారణపై ఐక్యరాజ్య సమితి భాగస్వాముల సమాఖ్య 14వ సదస్సు” (యూఎన్‌సీసీడీ) అధ్యక్షుడి హోదాలో ప్రధానమంత్రి ఈ చర్చల ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు. అన్నిరకాల ప్రాణుల, జీవనోపాధులకు ఆలంబనగా నిలిచే ప్రాథమిక పునాది భూమేనని ఈ సందర్భంగా శ్రీ మోదీ స్పష్టం చేశారు. తదనుగుణంగా భూమితోపాటు సహజ వనరులపై అత్యంత తీవ్ర ఒత్తిడిని సాధ్యమైనంత వరకూ తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. “మనపై గురుతర బాధ్యత ఉందన్నది సుస్పష్టం. అయినా, మన కర్తవ్యాన్ని నెరవేర్చగలం.. మనమంతా కలసికట్టుగా ముందడుగు వేయగలం” అని ప్రధానమంత్రి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
భూసార క్షీణత సమస్య పరిష్కారం దిశగా భారత్ చేపట్టిన చర్యల గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. భూసార క్షీణత సమస్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రముఖంగా ప్రస్తావించడంలో భారత్ ఎంతో చొరవ చూపిందని ఆయన చెప్పారు. ఆ మేరకు భూమి లభ్యత సహా సారథ్యం మెరుగుకు 2019నాటి ఢిల్లీ తీర్మానం పిలుపునిచ్చిందని గుర్తుచేశారు. తదనుగుణ లింగ-ప్రాధాన్య పరివర్తనాత్మక పథకాల రూపకల్పన అవసరాన్ని నొక్కిచెప్పారు. భారత్‌లో గడచిన 10 ఏళ్లలో 3 మిలియన్ హెక్టార్ల అదనపు అటవీకరణను సాధించినట్లు తెలిపారు. దీంతో అడవుల విస్తీర్ణం నేడు దేశ వైశాల్యంలో దాదాపు నాలుగోవంతుకు పెరిగిందని ప్రధానమంత్రి వివరించారు. భూసార క్షీణత తటస్థీకరణపై భారత్ తన జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నదని శ్రీ మోదీ వెల్లడించారు. “ఇందులో భాగంగా 2030 నాటికి భూసారం క్షీణించిన 26 మిలియన్ హెక్టార్ల భూమి పునరుద్ధరణ లక్ష్యంగా కృషి చేస్తున్నాం. ఆ మేరకు 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల బొగ్గుపులుసు వాయువుకు సమానమైన హరితవాయు ఉద్గారాల శోషణపై మా వంతు బాధ్యతను నెరవేర్చగలమని భావిస్తున్నాం” అని ప్రధానమంత్రి ప్రకటించారు.
గుజరాత్‌లోని బన్నీ ప్రాంతంలోగల ‘రాన్ ఆఫ్ కచ్’లో చేపట్టిన భూమి పునరుద్ధరణ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఉదాహరించారు. అక్కడ తగు చర్యలు చేపట్టిన తర్వాత భూసారం పెరగడంతోపాటు ఉత్పాదకత ఇనుమడించడం, తద్వారా ఆహార భద్రత సిద్ధించి, జీవనోపాధి మార్గాలు మెరుగుపడటం వంటి పరిణామాలను ఆయన వివరించారు. బన్నీ ప్రాంతంలో భూమి పునరుద్ధరణకు చేపట్టిన చర్యల్లో భాగంగా పచ్చికబయళ్లను అభివృద్ధి చేశామని చెప్పారు. దీనివల్ల భూసార క్షీణతను తటస్థీకరించడం సాధ్యమైందన్నారు. ఇది వన సంబంధ కార్యకలాపాలకు మద్దతునిచ్చిందని, దీంతోపాటు పశుసంవర్ధక కార్యకలాపాలను ప్రోత్సహించడంతో ప్రజల జీవనోపాధి మెరుగుపడిందని ఆయన వివరించారు. “ఇదే స్ఫూర్తితో భూమి పునరుద్ధరణకు మనం సమర్థ వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దేశీయ పద్ధతులను ప్రోత్సహించడమూ అవశ్యం” అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.
భూమి పునరుద్ధరణ వ్యూహాల రూపకల్పనలో సాటి వర్ధమాన దేశాలకు భారత్ ‘దక్షిణ-దక్షిణ’ సహకార స్ఫూర్తితో తోడ్పాటునిస్తున్నదని చెప్పారు. ఈ చేయూతలో భాగంగా భూసార క్షీణత సమస్యల పరిష్కారంలో శాస్త్రీయ విధానాన్ని ప్రోత్సహించేందుకు భారత్‌లో నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. “మానవ కార్యకలాపాల ఫలితంగా క్షీణించిన భూసారాన్ని పునరద్ధరించడం మానవాళి సమష్టి బాధ్యత. తదనుగుణంగా భవిష్యత్తరాలకు ఆరోగ్యకర భూగోళాన్ని అందించడం మనందరి పవిత్ర కర్తవ్యం” అని ఉద్బోధిస్తూ ప్రధానమంత్రి తన ఉపన్యాసాన్ని ముగించారు.
***
(Release ID: 1727126)
Visitor Counter : 300
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam