విద్యుత్తు మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పవర్‌గ్రిడ్‌ కొవిడ్‌ టీకా శిబిరాలు

Posted On: 12 JUN 2021 5:14PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహారత్న హోదాగల ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పవర్‌గ్రిడ్‌). తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సకాలంలో సాయం చేయడం ద్వారా, కొవిడ్‌పై విభిన్నమైన రీతిలో పవర్‌గ్రిడ్‌ పోరాటం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో కొవిడ్‌ టీకా శిబిరాలు నిర్వహించడం వీటన్నింటిలో అతి ప్రధానమైనది.

    కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "దవాయి భీ కడాయి భీ" కార్యక్రమానికి అనుగుణంగా, నాగ్‌పుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారంతో, పవర్‌గ్రిడ్‌ పశ్చిమ ప్రాంతీయ విభాగం-1 నాగ్‌పుర్‌లో టీకా శిబిరం ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సంస్థ ఒప్పంద కార్మికులు, 45 ఏళ్లు దాటిన భద్రత సిబ్బందికి కలిపి 40 మందికి ఇక్కడ టీకాలు వేశారు. ఓక్‌హార్ట్‌ ఆసుపత్రి సహకారంతో నాగ్‌పుర్‌లోనే నిర్వహించిన మరో శిబిరంలో 143 మందికి టీకాలు ఇచ్చారు. ముంబయిలోని హిరానందిని ఆసుపత్రిలో, 55 మంది పవర్‌గ్రిడ్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఒప్పంద కార్మికులకు ఈ నెల 10న టీకాలు వేశారు.

    ఈ నెల 11వ తేదీన, అమీన్‌గావ్‌లో ఎన్‌ఈఆర్‌పీఎస్‌ఐపీ టీకా శిబిరం ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, 
220కేవీ జీఐఎస్‌ ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఎక్సెల్‌ కేర్‌ ఆసుపత్రి సాయంతో మొత్తం 130 మందికి టీకాలు వేశారు. 

    కోల్‌కతాలోని పవర్‌గ్రిడ్‌ తూర్పు ప్రాంతీయ విభాగం-2 ప్రాంతీయ ప్రధాన కార్యాలయం (హెచ్‌ఆర్‌క్యూ) కూడా టీకా శిబిరం ఏర్పాటు చేసింది. ప్రస్తుత, విశ్రాంత, చనిపోయిన ఉద్యోగులు, వారందరి కుటుంబ సభ్యులతోపాటు, హెచ్‌ఆర్‌క్యూ, రాజర్‌హాట్‌, సుభాష్‌గ్రామ్‌ ఉప కేంద్రాలు, కల్యాణి కన్‌స్ట్రక్షన్‌ కార్యాలయం, ఈఆర్‌ఎల్‌డీసీ, సీఈఏ, ఈఆర్‌పీసీ, సీఏజీ కార్మికులందరికీ కలిపి మొత్తం 311 మందికి టీకాలు వేశారు. చనిపోయిన ఉద్యోగి భార్యకు ఇక్కడ తొలి టీకా ఇచ్చారు. దీనిద్వారా, చనిపోయిన ఉద్యోగులకు వినయపూర్వక నివాళి అర్పించడంతోపాటు, సంస్థ ఎప్పుడూ వారి కుటుంబాలకు అండగా ఉంటుందని పవర్‌గ్రిడ్‌ భరోసా ఇచ్చింది.

    ఈ నెల 7న, ఫరీదాబాద్‌లోని ఉత్తర ప్రాంతీయ విభాగం-1 ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, 150 మందికిపైగా హెచ్‌ఆర్‌క్యూ, కార్పొరేట్‌ కేంద్రం, కొత్త దిల్లీలోని బల్లాహఘర్‌, మహారాణి బాగ్‌, కట్వారియా సరాయ్‌లో కొత్తగా చేర్చుకున్న సిబ్బంది, ఒప్పంద కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేశారు. ఫరీదాబాద్‌లోని క్యూఆర్‌జీ హెల్త్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ సాయంతో ఈ కార్యక్రమం జరిగింది.

    గూటి, చిలకలూరిపేటలో పశ్చిమ ప్రాంతీయ విభాగం-1 టీకా శిబిరాలు నిర్వహించింది. పవర్‌గ్రిడ్‌ కార్యాలయ ఉద్యోగులకేగాక, డ్రైవర్లు, భద్రత సిబ్బంది, ఒప్పంద కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు కూడా టీకాలు వేశారు.    

    ఈ నెల 5న, ప్రభుత్వ సాయంతో భీవాడి ఉప కేంద్రంలోనూ మూడో దశ శిబిరం ఏర్పాటు చేశారు. భీవాడి, నీమ్రానలోని 70 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఒప్పంద కార్మికులు ఇక్కడ టీకాలు తీసుకున్నారు. మే నుంచి దశలవారీగా నిర్వహించిన కార్యక్రమాల్లో మొత్తం 180 మందికి టీకాలు వేశారు.

    డెహ్రాడూన్ వికాస్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి సాయంతో, సంత్‌ నిరాకారీ సత్సంగ్‌ భవన్‌లో రెండు రోజుల టీకా శిబిరాన్ని పవర్‌గ్రిడ్‌ నిర్వహించింది. 18 ఏళ్లు దాటిన 43 మంది ఉద్యోగులు, సహాయ సిబ్బందికి ఇక్కడ టీకాలు వేశారు.

    ఒప్పంద కార్మికుల కుటుంబాలకు సాయంతోపాటు, కరోనాను నియంత్రించేందుకు, వారి కోసం దగ్గరలోని టీకా కేంద్రాల్లో పవర్‌గ్రిడ్‌ రూర్కెలా ఉప కేంద్రం టైమ్‌ స్లాట్‌లు బుక్‌ చేసింది. రూర్కెలా మున్సిపల్‌ కార్పొరేషన్‌ సాయంతో తన నిబద్ధతను చాటింది. 100కుపైగా స్లాట్‌లు బుక్‌ చేయగా, 100 మంది టీకాలు తీసుకున్నారు. దీనిద్వారా, తన ఉద్యోగులు, సహాయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులందరికీ టీకాల కార్యక్రమాన్ని పవర్‌గ్రిడ్‌ పూర్తి చేసింది. ఈ నెల 4న రూర్కెలా ఉపకేంద్రం సాయంతో, చుట్టుపక్కల గ్రామాల్లో పాంపోష్‌ ఆసుపత్రి కరోనా పరీక్షల కార్యక్రమాలను కూడా నిర్వహించింది.

    ఒడిశాలోని కనిహా హెచ్‌వీడీసీ కేంద్రంలో, కనిహా, రెంగాలీ ఉపకేంద్రాల ఉద్యోగులు, సహాయక సిబ్బందికి టీకాల కార్యక్రమం నిర్వహించారు. 98 మందికి టీకాలు వేశారు.
 

***


(Release ID: 1726672) Visitor Counter : 154