వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2020-21 వ్యవసాయ ఎగుమతులలో అద్భుత వృద్ధి సాధించిన భారత్‌

వ్యవసాయ.. అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు 2020-21లో
41.25 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరి.. 17.34 శాతం పెరుగుదల నమోదు;
సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులలో 50.94 శాతం వృద్ధి నమోదు;
కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో చేపట్టిన చర్యలతో నిరంతర ఎగుమతులు

Posted On: 10 JUN 2021 1:09PM by PIB Hyderabad

   వ్యవసాయ ఎగుమతులలో 2020-21కిగాను భారత్ అద్భుతం సాధించిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ అనూప్ వాధ్వాన్ ఇవాళ విలేకరులతో మాట్లడుతూ వెల్లడించారు. ఈ మేరకు గత మూడేళ్లుగా (2017-18లో 38.43 బిలియన్ డాలర్లు, 2018-19లో 38.74 బిలియన్ డాలర్లు, 2019-20లో 35.16 బిలియన్ డాలర్లు వంతున) వ్యవసాయ ఎగుమతులు దాదాపు ఒకేస్థాయిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే, 2020-21కిగాను (సముద్ర/ఉద్యాన రంగాలుసహా) వ్యవసాయ/అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు 41.25 బిలియన్ డాలర్ల స్థాయికి దూసుకెళ్లి నిరుటితో పోలిస్తే 17.34 శాతం పెరుగుదలను నమోదు చేసిందన్నారు. భారతదేశ ద్రవ్యపరంగా చూస్తే- 2019-20లో ఎగుమతుల పరిమాణం రూ.2.49 లక్షల కోట్లు కాగా, 2020-21లో అది 22.62 శాతం పెరిగి, రూ.3.05 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇక 2019-20లో భారత వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల దిగుమతులు 20.64 బిలియన్ డాలర్లు కాగా, 2020-21 సంవత్సరానికి 20.67 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల్లోనూ వ్యవసాయ రంగంలో వాణిజ్య సమతౌల్యం 42.16 శాతందాకా మెరుగుపడి, 14.21 బిలియన్ల నుంచి 20.58 బిలియన్ డాలర్లకు పెరిగింది.

   వ్యవసాయ (సముద్ర, ఉద్యాన రంగాలు మినహా) ఉత్పత్తులకు సంబంధించి 2019-20లో ఎగుమతులు 23.23 బిలియన్ డాలర్లు కాగా, 2020-21లో 29.81 బిలియన్ డాలర్లకు చేరి 28.36 శాతం వృద్ధి నమోదైంది. ఆ మేరకు కోవిడ్‌-19 సమయంలో ఆహార ఉత్పత్తులకు పెరిగిన గిరాకీని భారత్‌ సద్వినియోగం చేసుకోగలిగింది. ముఖ్యంగా తృణధాన్యాల ఎగుమతులలో భారీ వృద్ధి చోటుచేసుకోగా- బాస్మతీయేతర బియ్యంద్వారా  136.04 శాతం పెరిగి 4794.54 మిలియన్‌ డాలర్లకు, అలాగే గోధుమద్వారా 774.17 శాతం పెరిగి, 549.16 మిలియన్‌ డాలర్లకు చేరింది. ఇతరత్రా (జొన్నలు, మొక్కజొన్న ఇతర ముతక) చిరుధాన్యాల ద్వారా 238.28 శాతం పెరిగి, 64.14 మిలియన్లకు చేరింది.

   మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ గణనీయ వృద్ధి ఈ మేరకు 2019-20తో పోలిస్తే నూనె చెక్క (1575.34 మిలియన్‌ డాలర్లు- వృద్ధి 90.28 శాతం), చక్కెర (2789.97 మిలియన్ డాలర్లు- వృద్ధి 41.88శాతం), ముడి పత్తి (1897.20 మిలియన్ డాలర్లు - వృద్ధి 79.43 శాతం), తాజా కూరగాయలు (721.47 మిలియన్ డాలర్లు - వృద్ధి 10.71 శాతం) వంటనూనెలు (602.77 మిలియన్ డాలర్లు- వృద్ధి 254.39 శాతం) తదితరాల ఎగుమతులు కూడా భారీగా పెరిగాయి.

   భారత వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా, చైనా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, సౌదీ అరేబియా, ఇండోనేషియా, నేపాల్, ఇరాన్, మలేషియా దేశాలు భారీ  విపణులుగా నిలిచాయి. ఈ జాబితాలోని చాలా దేశాలకు ఎగుమతులలో పెరుగుదల కనిపించగా, ఇండోనేషియా (102.42 శాతం), బంగ్లాదేశ్‌ (95.93శాతం), నేపాల్‌ (50.49 శాతం) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

   ఇక ఔషధ గుణాలున్న అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు, కుంకుమ పువ్వు వగైరా సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లోనూ గణనీయంగా వృద్ధి నమోదైంది. ఈ మేరకు 2020-21లో మిరియాలు 28.72 శాతం పెరిగి 1269.38 మిలియన్‌ డాలర్లకు చేరింది. అలాగే దాల్చిన చెక్క 64.47 శాతం పెరిగి 11.25 మిలియన్లకు చేరగా జాజికాయ, జాపత్రి, యాలకులలో 132.03 శాతం (81.60 మిలియన్ల నుంచి 189.34 మిలియన్లకు) పెరిగింది. అదేవిధంగా అల్లం, కుంకుమ పువ్వు, పసుపు, వాము, బిరింజి ఆకు తదితరాలు 35.44 శాతం పెరిగి 570.63 మిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తంమీద సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 2020-21లో మునుపెన్నడూ లేనంత అధికంగా దాదాపు 4 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరడం విశేషం.

   మరోవైపు 2020-21లో సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆ మేరకు 2019-20లో 689 మిలియన్ డాలర్ల స్థాయినుంచి 50.94 శాతం వృద్ధితో 1040 మిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. సేంద్రియ ఎగుమతులలో నూనె చెక్క/గానుగపిండి, చమురు గింజలు, తృణ/చిరు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, మసాలాలు, తేయాకు, ఔషధ మొక్కల ఉత్పత్తులు, ఎండుఫలాలు, చక్కెర, పప్పుధాన్యాలు, కాఫీ తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి.

   దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులలో తొలిసారిగా అనేక కొత్త సాముదాయక ప్రాంతాల వాటా కూడా ఉండటం విశేషం. ఉదాహరణకు... వారణాసి నుంచి తాజా కూరగాయలు, మామిడి; చందోలి నుంచి నల్ల బియ్యం ఎగుమతయ్యాయి. దీనివల్ల ఈ ప్రాంత రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. వీటితోపాటు ఇతర సాముదాయక ప్రాంతాల నుంచి కూడా ఎగుమతులు చేపట్టారు. వీటిలో నాగ్‌పూర్ నుంచి నారింజ; తేని అనంతపురం నుంచి అరటి; లక్నో నుంచి మామిడి వంటివి ఉన్నాయి. మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతాల నుంచి వాయు, సముద్ర మార్గాల్లో రవాణా ద్వారా దుబాయ్, లండన్ తదితర గమ్యస్థానాలకు బహుముఖ తాజా ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతి కొనసాగింది. మార్కెట్ అనుసంధానం, పంటకోత విలువ శృంఖలం అభివృద్ధి, వ్యవసాయ ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీఓ)లు వంటి సంస్థాగత నిర్మాణం తదితర చర్యలతో సంబంధిత శాఖ చేయూత నివ్వగా ఈశాన్య రాష్ట్రాల రైతులు కూడా తమ విలువ జోడించిన ఉత్పత్తులను భారత సరిహద్దులు దాటి ఎగుమతి చేయగలిగారు.

   తృణధాన్యాల విషయంలోనూ 2020-21 ఆశాజనకం కాగా, మనం తొలిసారి అనేక దేశాలకు ఎగుమతులు చేయగలిగాం. ఉదాహరణకు॥ తైమూర్-లెస్టే, ప్యూర్టోరికో, బ్రెజిల్ వంటి దేశాలకు మొట్టమొదటి సారి బియ్యం ఎగుమతి చేశాం. అలాగే యెమెన్, ఇండోనేషియా, భూటాన్ వంటి దేశాలకు గోధుమ ఎగుమతి సాగింది. దీంతోపాటు సూడాన్, పోలాండ్, బొలీవియా తదితర దేశాలకు చిరుధాన్యాలు ఎగుమతి చేయబడ్డాయి.

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో చేపట్టిన చర్యలు

 • “అపెడా (APEDA), ఎంపెడా (MPEDA), సరకుల (కమాడిటీ) బోర్డు”లు వివిధ గుర్తింపులు/అక్రెడిటేషన్లకు సంబంధించిన అన్నిరకాల చెల్లుబాటు గడువులను పొడిగించాయి. ఈ మేరకు ప్యాక్‌హౌస్ గుర్తింపు, వేరుసెనగ యూనిట్ల నమోదు, రిజిస్ట్రేషన్-కమ్-సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలు, సమగ్ర మాంస యంత్రాగారాలకు గుర్తింపు, చైనాతోపాటు అమెరికాలకు బియ్యం ఎగుమతి కోసం యంత్రాగారాల నమోదు, సేంద్రియ ఉత్పత్తుల నిరంతరాయ ఎగుమతులకు భరోసానిచ్చే జాతీయ కార్యక్రమం కింద అవసరమైన ధ్రువీకరణ పత్రాలు/ఆమోదాలు వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
 • ఎగుమతులకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాల ఆన్‌లైన్‌ జారీకి ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి.
 • కోవిడ్‌-19 దిగ్బంధం (2020) వేళ ఎగుమతిదారుల సమస్యలు పరిష్కరించడం కోసం  ‘అపెడా, కమాడిటీ బోర్డు’లలో వారానికి 24 గంటలూ పనిచేసే అత్యవసర ప్రతిస్పందన కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిద్వారా సరుకుల/ట్రక్కులు/కార్మికుల రవాణా/కదలికలు, ధ్రువీకరణ పత్రాల జారీ, ప్రయోగశాల పరీక్ష నివేదికలు, నమూనాల సేకరణకు తదితరాలకు సంబంధించిన సమస్యలను ఈ కేంద్రాలు పరిష్కరించాయి.  దిగ్బంధం విధించిన తొలి వారంలోనే ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఈ సహాయ కేంద్రాలకు రమారమి వెయ్యి ఫోన్‌ కాల్స్ వచ్చాయి. వీటన్నిటినీ రాష్ట్రాల పాలన యంత్రాంగం, కస్టమ్స్‌, రేవులు, నౌకాయానం, డీజీఎఫ్‌టీ తదితర సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సకాలంలో ఎగుమతులు సాగేవిధంగా చురుగ్గా చర్యలు చేపట్టబడ్డాయి.
 • కోవిడ్‌-19 దిగ్బంధం (2020) సమయంలో కొత్త ప్యాక్ హౌస్ దరఖాస్తుదారుల కోసం వాస్తవిక సాదృశ తనిఖీ పద్ధతి ప్రవేశపెట్టబడింది. అలాగే ప్రస్తుత ప్యాక్‌ హౌస్‌ల మునుపటి పనితీరును బట్టి తనిఖీ లేకుండానే చెల్లుబాటు గడువు పొడిగించబడింది. తదనుగుణంగా దాదాపు 216 ప్యాక్ హౌస్‌లు ప్రత్యక్ష తనిఖీ-సమ్మతి ప్రక్రియతో నిమిత్తం లేకుండా నిరంతరాయంగా పనిచేశాయి. ప్రస్తుతం కోవిడ్‌-19 రెండోదశలో కూడా ప్యాక్ హౌస్‌ల గుర్తింపు స్వయంచలితంగా పొడిగించేందుకు అనుమతి ఇవ్వబడింది. దీనివల్ల ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి కాలం చెల్లిన 100 ప్యాక్‌ హౌస్‌లు లబ్ధిపొందగా, ఎగుమతిదారులకూ ఉపశమనం లభించింది.
 • మహమ్మారి సమయంలో ఎగుమతిదారు సోదరులకు ఎగుమతి ధ్రువీకరణ, ఆరోగ్య ధ్రువీకరణ, బయలుదేరే/సరుకు చేరవేసే ప్రదేశాల ధ్రువీకరణ పత్రాల వంటివి సకాలంలో, సజావుగా జారీ అయ్యేలా ఎగుమతి తనిఖీ మండలి/ఎగుమతి తనిఖీ ఏజెన్సీలు సముచిత చర్యలు చేపట్టాయి.
 • వాణిజ్య సౌలభ్యానికి ప్రోత్సాహం దిశగా కనీస స్థాయికి నియంత్రణల తగ్గింపు, నేరాల జాబితా నుంచి వివిధ కార్యకలాపాల తొలగింపు చర్యలు చేపట్టబడ్డాయి.
 • కోవిడ్-19 మహమ్మారివల్ల అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించలేని నేపథ్యంలో భారత ఎగుమతి-దిగుమతిదారుల మధ్య సంబంధాల ఏర్పాటు-నిర్వహణ కోసం ‘అపెడా’ ఒక అంతర్గత వేదికను రూపొందించి, వాస్తవిక సాదృశ మార్గంలో ప్రదర్శన (వీటీఎఫ్)లు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ‘ఇండియా రైస్ అండ్ అగ్రో కమాడిటీ షో’, ‘ఇండియా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్లోరికల్చర్ షో’ పేరిట రెండు ప్రదర్శనలు నిర్వహించింది. అంతేకాకుండా 2021-22లోనూ ‘ఇండియన్ ప్రాసెస్డ్ ఫుడ్ షో‘, ‘ఇండియన్ మీట్ అండ్ పౌల్ట్రీ షో’, ‘ఇండియన్ ఆర్గానిక్ ప్రాడక్ట్స్ షో’లను ‘అపెడా’ నిర్వహించబోతోంది.
 • దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల ఎగుమతిదారుల సౌలభ్యం దృష్ట్యా 2020-21లో ప్రాంతీయ/విస్తరణ/ప్రాజెక్టు కార్యాలయాలను ‘అపెడా’ ప్రారంభించింది. ఈ మేరకు చెన్నై, చండీగఢ్‌, అహ్మదాబాద్, కోచ్చి, జమ్ముకశ్మీర్‌లలో ‘ప్రాంతీయ’; భోపాల్‌లో ‘విస్తరణ’; వారణాసిలో ‘ప్రాజెక్ట్’ ఆఫీసులు ఏర్పటు చేసింది.
 • కోవిడ్‌-19 నేపథ్యంలో అనేక ఉద్యాన పంటలకు విస్తరింపజేసిన “ఆపరేషన్ గ్రీన్” పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా వాణిజ్యశాఖ నిరంతరం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ వచ్చింది. అంతేగాక సరకు రవాణాలో ఎగుమతిదారులపై అధిక చార్జీల భారం తగ్గించడానికి పౌర విమానయాన, రైల్వే మంత్రిత్వ శాఖలతో సంయుక్తంగా ‘కృషి ఉడాన్’ విమానాలు, ‘కృషి’ రైళ్ల సదుపాయాన్ని వాడుకునేందుకు సహకరించింది. తద్వారా మధ్యప్రాచ్యం, ఐరోపా సమాఖ్య, ఆగ్నేయాసియా విపణులకు నశ్వర వస్తువుల చేరవేత సజావుగా సాగింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల నుంచి తాజా పండ్లు, సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారులకు ‘కృషి రైళ్ల’ ప్రాజెక్టు నిర్ణయాత్మక తోడ్పాటునిచ్చింది.
 • చివరకు అనేక రాష్ట్రాల్లో దిగ్బంధం అమలులో ఉన్నప్పటికీ సేంద్రియ ఉత్పత్తుల జాతీయ కార్యక్రమం కిందగల అన్ని గుర్తింపు పొందిన ధ్రువీకరణ వ్యవస్థలూ ఎలక్ట్రానిక్‌ మాధ్యమంద్వారా పనిచేసేలా చర్యలు చేపట్టబడ్డాయి. దీంతోపాటు సదరు వ్యవస్థల గుర్తింపు 3 నెలలపాటు పొడిగించబడటంతో ఆన్‌లైన్‌ అన్వేషణ సౌలభ్యం అందుబాటులోకి వచ్చి, ధ్రువీకరణ పత్రాల జారీకి మార్గం సుగమమైంది.

వ్యవసాయ ఎగుమతుల విధానం – ఎగుమతి ప్రోత్సాహక చర్యల అమలు

   కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబరులో తొట్టతొలి ‘వ్యవసాయ ఎగుమతి విధానం’ (AEP) ప్రవేశపెట్టింది. దీని అమలులో భాగంగా 18 రాష్ట్రాలు- మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కేరళ, నాగాలాండ్, తమిళనాడు, అస్సాం, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్, మిజోరాం, ఉత్తరాఖండ్‌లతోపాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు- లద్దాఖ్‌, అండమాన్‌-నికోబార్‌ దీవుల కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేసింది. అలాగే 25 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు కాగా, 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ‘ఏఈపీ’ అమలు కోసం సంబంధిత నోడల్ ఏజెన్సీలను నియమించాయి.

సాముదాయక కేంద్రాల అభివృద్ధి

   వ్యవసాయ ఎగుమతి విధానంలో భాగంగా ఎగుమతులను ప్రోత్సహించడం కోసం 46 ‘ప్రత్యేక ఉత్పత్తుల’ జిల్లా సముదాయాలను గుర్తించగా, వాటిలో 29 సముదాయ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి.

   ఎగుమతుల కోసం సముదాయాలకు క్రియాశీలత: సముదాయాలను క్రియాశీలం చేయడం కోసం వ్యవసాయ ఉత్పత్తిదారు సంస్థలు-ఎగుమతిదారుల అనుసంధానానికి ‘అపెడా’ ద్వారా వాణిజ్య మంత్రిత్వశాఖ చొరవ చూపింది. సదరు అనుసంధానం అనంతరం రవాణా/తరలింపు సంబంధిత సమస్యలు పరిష్కారం కాగా, భూభాగ సరిహద్దులుగల ప్రాంతాల నుంచి కూడా ఎగుమతులు సాధ్యమయ్యాయి.

కొన్ని విజయగాథలను దిగువన చూడవచ్చు:

 • వారణాసి సముదాయం (తాజా కూరగాయలు): ఈ సముదాయం పరిధిలోని వ్యవసాయ ఉత్పత్తిదారు సంస్థల ద్వారా ఇప్పటిదాకా 48 టన్నుల తాజా కూరగాయలు (మిచ్చి, పొట్ల, బఠాణీ, దోస వగైరా), 10 టన్నుల మామిడి (బనారసి, లంగ్రా, రామ్‌ఖేడా, చౌసా), 532 టన్నుల నల్ల బియ్యం ఎగుమతి చేయబడ్డాయి.
 • అనంతపురం సముదాయం (అరటి): ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం సముదాయం నుంచి ఇటీవలి పంటకాలం (2021 జనవరి-ఏప్రిల్‌)లో 30,291 టన్నుల అరటి పంటను 9 శీతల వ్యాగన్‌ రైళ్లద్వారా తరలించగా, మధ్యప్రాచ్యానికి ఎగుమతి చేయబడింది.
 • నాగ్‌పూర్‌ సముదాయం (కమలాఫలం): ఈ సముదాయం నుంచి 115 టన్నుల నాగ్‌పూర్‌ కమలాఫలం, 45 టన్నుల ‘అంబియాబహార్‌’ సీజన్‌ నారింజ పండ్లు మధ్యప్రాచ్య దేశాలకు (తొలిసారి) సముద్ర మార్గంలో ఎగుమతి కాగా, ఆయా దేశాల్లోని ‘లులు సూపర్‌ మార్ట్‌, సఫారీ మాల్‌, నెస్టో’ తదితర అగ్రశ్రేణి సూపర్‌ మార్కెట్లకు సరఫరా చేయబడటం విశేషం.
 • లక్నో సముదాయం (మామిడి): ఈ సముదాయం నుంచి 80.5 టన్నుల (దషేరి, లాంగ్రా, బాంబే గ్రీన్‌ వగైరా రకాల) మామిడి మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయబడింది.
 • తేని సముదాయం (పచ్చ అరటి): ఈ సముదాయం నుంచి గడచిన ఏడాది వ్యవధిలో ఇప్పటిదాకా 2400 టన్నుల పచ్చ రకం, 1560 టన్నుల జి9-నేండ్రన్‌ రకం అరటి పంట ఎగుమతి చేయబడింది.
 •  దానిమ్మ సముదాయం - మహారాష్ట్ర: ఈ రాష్ట్రంలోని సోలాపూర్‌ సముదాయం నుంచి 2020-21లో 32,315 టన్నుల దానిమ్మ పంట ఎగుమతి చేయబడింది.
 • మామిడి సముదాయం – ఆంధ్రప్రదేశ్‌: ఈ రాష్ట్రంలోని కృష్ణా, చిత్తూరు జిల్లా  సముదాయాల రైతులద్వారా ప్రస్తుత పంటకాలంలో (భౌగోళిక ధ్రువీకరణగల) ‘బంగినపల్లితోపాటు సువర్ణ రేఖ’ రకం మామిడి పంట మధ్యప్రాచ్యం, ఐరోపా సమాఖ్య దేశాలతోపాటు యునైటెడ్‌ కింగ్‌డమ్‌, న్యూజిలాండ్‌ దేశాలకు ఎగుమతి అయింది. ప్రస్తుత పంటకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా సముదాయం నుంచి మొత్తం 4000 టన్నుల మామిడి పండ్లను రైలు మార్గంలో ఢిల్లీకి రవాణా చేశారు.
 • మామిడి సముదాయం – తెలంగాణ: ఈ రాష్ట్రంలోని సముదాయాల నుంచి ఇప్పటిదాకా 100 టన్నుల తాజా మామిడిని మధ్యప్రాచ్యం, ఐరోపా సమాఖ్య దేశాలతోపాటు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు ఎగుమతి చేశారు.
 • ఎర్రగడ్డల సముదాయం – కర్ణాటక: ఈ రాష్ట్రంలోని సముదాయాల నుంచి 2020 అక్టోబర్-2020 డిసెంబర్ మధ్య మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలకు 7168 టన్నుల ఎర్రగడ్డ (ఉల్లి) ఎగుమతి చేయబడింది.
 • అరటి సముదాయం – గుజరాత్‌: ఈ రాష్ట్రంలోని సముదాయాల నుంచి 2020 ఏప్రిల్‌ మొదలు నేటిదాకా 6198.26 టన్నుల తాజా అరటి మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేయబడింది. ఈ మేరకు సూరత్, నర్మదా, భారూచ్‌ సముదాయాల నుంచి బహ్రెయిన్, దుబాయ్, జార్జియా, ఇరాన్, ఒమన్, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఇరాక్ తదితర దేశాలకు పంట ఎగుమతి అయింది.
 • అరటి సముదాయం – మహారాష్ట్ర: ఈ రాష్ట్రంలోని సోలాపూర్, జల్గావ్, కొల్హాపూర్ సముదాయాల నుంచి 2020-21కాలంలో మొత్తం 3278, 280, 90 వంతున కంటెయినర్లలో అరటి ఎగుమతి చేయబడింది.
 • ఉల్లి సముదాయం – మహారాష్ట్ర: ఈ రాష్ట్రంలోని సముదాయాల నుంచి 2021 జనవరి నుంచి ఏప్రిల్‌ 15 వరకూ 10,697 టన్నుల తాజా ఉల్లి పంట ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం దేశాలుసహా బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయబడింది.
 • ద్రాక్ష సముదాయం – మహారాష్ట్ర: ఈ రాష్ట్రంలోని నాసిక్‌ సముదాయం నుంచి 2020-21లో ఇప్పటిదాకా 6797 కంటైనర్లద్వారా 91,762 టన్నుల తాజా ద్రాక్ష ఐరోపా సమాఖ్య దేశాలకు ఎగుమతి చేయబడింది. అలాగే సాంగ్లి సముదాయం నుంచి 1013 కంటైనర్లలలో 13,884 మెట్రిక్ టన్నుల తాజా ద్రాక్ష, 1 కంటెయినర్‌లో ఎండు ద్రాక్ష కూడా ఐరోపా సమాఖ్యసహా ఇతర దేశాలకు ఎగుమతి చేయబడింది.

   ఈ సముదాయాలన్నీ ప్రస్తుతం అందుబాటులోగల వనరులతో ఎలాంటి పెట్టుబడి లేదా అదనపు పెట్టుబడులు లేకుండానే క్రియాశీలం చేయబడటం విశేషం. తదనుగుణంగా ఈ సముదాయాల నుంచి ఎగుమతులు నిరంతర ప్రాతిపదికన కొనసాగుతూనే ఉన్నాయి.

నిర్దిష్ట దేశాలకు వ్యవసాయ ఎగుమతుల ప్రత్యేక వ్యూహంపై నివేదికలు: ఆయా దేశాలకు ప్రత్యేకంగా ఉత్పత్తులు, ఎగుమతి సామర్థ్యం, మార్గానుసరణపై వ్యవసాయ-ఎగుమతి వ్యూహం రూపకల్పన దిశగా 60 దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, భాగస్వాములతో సంప్రదింపులు సాగాయి.

ఉత్పత్తి-నిర్దిష్ట చర్యలపై నివేదిక: ‘వ్యవసాయ ఎగుమతుల విధానం’ కింద భారత ఎగుమతులకు ఉత్తేజమిచ్చే దిశగా సంభావ్య ఎగుమతి ఉత్పత్తుల విషయంలో ‘ఎస్పీఎస్‌/టీబీటీ’ సంబంధిత సమస్యల పరిష్కారంపై సమగ్ర విశ్లేషణ సాగింది. తదనుగుణంగా “భారత వ్యవసాయ ఎగుమతులకు సుంకాల ప్రతికూలతలు” శీర్షికన నివేదిక రూపొందించబడింది.

కొనుగోలు-అమ్మకందారుల మధ్య వర్చువల్‌ సమావేశాలు (వి-బిఎస్ఎం): యూఏఈ, కువైట్, ఇండోనేషియా, స్విట్జర్లాండ్, బెల్జియం, ఇరాన్, కెనడా (సేంద్రియ ఉత్పత్తులు); యూఏఈ, అమెరికా (జీఐ ఉత్పత్తులు); జర్మనీ, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, థాయిలాండ్, ఒమన్‌, భూటాన్, అజర్‌బైజాన్, ఖతార్, సౌదీ అరేబియా, నేపాల్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, నెదర్లాండ్స్, బ్రూనై, కంబోడియా (జంతు ఉత్పత్తులు)లతో 24 ‘వి-బిఎస్ఎం’లు నిర్వహించబడ్డాయి. ప్రతి ‘వి-బిఎస్ఎం’లో పాల్గొనే ఎగుమతి/దిగుమతిదారులు, వాణిజ్య సంఘాల వివరాలతో ఇ-కేటలాగ్‌లను కూడా ఆవిష్కరించారు.

వర్చువల్‌ వాణిజ్య ప్రదర్శనలు (వీటీఎఫ్‌): ‘అపెడా’ తన సొంత వర్చువల్ వాణిజ్య ప్రదర్శన (వీటీఎఫ్)ల నిర్వహణ అనువర్తనం రూపకల్పనకు చొరవ చూపింది. ఇందులో వివిధ దేశాల దిగమతిదారులు, భారత ఎగుమతిదారులు పాల్గొనడంవల్ల వారి మధ్య సంప్రదింపులకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా 2021 మార్చి 10-12 తేదీల మధ్య తృణధాన్యాల ఉత్పత్తి రంగంపై తొలి వర్చువల్ వాణిజ్య ప్రదర్శన నిర్వహించబడింది. అలాగే తాజా పండ్లు/కూరగాయలపై 2021 మే 27-29 తేదీల మధ్య ‘వీటీఎఫ్‌’ నిర్వహించబడింది.

వివిధ భారత రాయబార కార్యాలయాల్లో వ్యవసాయ విభాగాలు: వివిధ దేశాల్లోని 13 భారత రాయబార కార్యాలయాల్లోగల వ్యవసాయ విభాగాలతో ‘అపెడా’ సంప్రదించి, ప్రస్తుత మార్కెట్ నిఘా విభాగాల బలోపేతానికి ప్రత్యక్ష ప్రాతిపదికన సలహాలు/సూచనలు కోరింది. ఈ వ్యవసాయ విభాగాల నుంచి అందిన సమీకృత నివేదికల ఆధారంగా ఆయా దేశాలకు తగిన ఎగుమతి ఉత్పత్తుల సంబంధిత వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు ‘అపెడా’ సిద్ధమవుతోంది.

రైతు అనుసంధాన పోర్టల్‌: ఎగుమతిదారులతో సంప్రదింపులకు వీలుగా వ్యవసాయ ఉత్పత్తిదారు సంస్థలు/కంపెనీలు (ఎఫ్‌పీఓ/ఎఫ్‌పీసీ), సహకార సంఘాల కోసం ‘అపెడా’ వెబ్‌సైట్‌లో ఒక ‘రైతు అనుసంధాన పోర్టల్‌’ ప్రారంభించబడింది. ఇందులో ఇప్పటిదాకా 2360 ‘ఎఫ్‌పీఓ/ఎఫ్‌పీసీ’లతోపాటు 2324 ఎగుమతిదారు సంస్థలు కూడా నమోదయ్యాయి.

మధ్యప్రాచ్యంపై ప్రత్యేక దృష్టి

   మధ్యప్రాచ్యంలోని దేశాలకు వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో సంప్రదించిన తర్వాత అక్కడి పరిస్థితులకు తగిన వ్యవసాయ ఎగుమతి వ్యూహం రూపొందించబడింది. తదనుగుణంగా ఆ దేశాల్లో సంభావ్య దిగుమతిదారులను భారత ఎగుమతిదారులు గుర్తించగల వేదికగా ‘వీ-బీఎస్‌ఎం’ (కొనుగోలుదారులు-అమ్మకందారుల సమావేశా)లను రాయబార కార్యాలయాలతో సంయుక్తంగా నిర్వహించారు. ఆ మేరకు మధ్యప్రాచ్యంలోని 7 దేశాలు- యుఏఈ, ఒమన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, ఇరాన్‌లలో ‘వీ-బీఎస్‌ఎం’లు ఏర్పాటు చేయబడ్డాయి. తద్వారా వ్యాపార నిర్వహణ దిశగా మరింత పరస్పర సంప్రదింపులు సాగేందుకు ఎగుమతి/దిగుమతిదారులకు వర్చువల్ వేదిక అందుబాటులోకి వచ్చింది.

   అదేవిధంగా గల్ఫ్‌ దేశాలకూ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి పెంపు దిశగా వ్యూహంపై ఒక ‘వీ-బీఎస్‌ఎం’ నిర్వహించబడింది. జీసీసీ సభ్య దేశాల్లో (ఒమన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌)ని భారత రాయబార కార్యాలయాలతో సంయుక్తంగా 2020 మే 20న ఒక ‘వీ-బీఎస్‌ఎం’ నిర్వహించబడింది. మరోవైపు భారత వ్యవసాయ ఉత్పత్తులపై మధ్యప్రాచ్య దేశాల్లో మార్కెటింగ్‌ ప్రచారం దిశగా ‘ది ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌’ ఓ కార్యక్రమం నిర్వహించనుంది. భారత్‌ నుంచి జీసీసీ దేశాలకు అత్యధికంగా ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులలో బియ్యం, గేదె మాంసం, సుగంధ ద్రవ్యాలు, సముద్ర ఉత్పత్తులు, తాజా పండ్లు/ కూరగాయలు, చక్కెర వంటివి ఉన్నాయి. కాగా, 2020-21లో జీసీసీ దేశాలకు భారత్‌ నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతి 26.01 శాతం పెరిగింది. అదేవిధంగా సుగంధ ద్రవ్యాల ఎగుమతి 52.39 శాతం, చక్కెర 50.88 శాతం వంతున పెరిగాయి. పశుసంబంధ/సముద్ర ఉత్పత్తుల ఎగుమతిపై కోవిడ్‌-19 మహమ్మారి తీవ్ర ప్రభావం చూపినప్పటికీ జీసీసీ కూటమి దేశాలకు వ్యవసాయ ఎగుమతులు మొత్తంమీద 7.15 శాతం పెరిగాయి.

మార్కెట్‌ లభ్యత

   ఆయా విపణులలో భారత ఉత్పత్తులకు విక్రయ సౌలభ్య కల్పన దిశగా వ్యవసాయం-సహకార/రైతు సంక్షేమ మంత్రిత్వశాఖతో సంయుక్తంగా వాణిజ్య మంత్రిత్వశాఖ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియాలో భారత దానిమ్మ పండ్లకు విపణి సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా అర్జెంటీనాలో మామిడి, బాస్మతి బియ్యం; ఇరాన్‌లో కేరట్ విత్తనాలు; ఉజ్బెకిస్తాన్‌లో గోధుమ పిండి, బాస్మతి బియ్యం, దానిమ్మ అరిల్స్, మామిడి, అరటి, సోయాబీన్ నూనె చెక్క; భూటాన్‌లో టమోటా, బెండ, ఉల్లిపాయ; సెర్బియాలో నారింజ తదితర పంటలకు మార్కెట్‌ లభ్యత అందుబాటులోకి వచ్చింది.

కొత్త ఉత్పత్తులపై దృష్టి

   భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి వైవిధ్యం విస్తరణకు, భారత్‌కే ప్రత్యేకమైన ఉత్పత్తుల వ్యాపారాన్ని విదేశీ విపణులలో ప్రోత్సహించడంపైనా దృష్టి సారించబడిన నేపథ్యంలో కొన్ని ఉదాహరణలను దిగువన చూడవచ్చు:

 • సేంద్రియ ధ్రువీకరణ పొందిన మునగాకు పౌడర్ (2 టన్నులు), అధిక పీడనంతో ఘనీభవింపజేసిన 7 విలువ జోడించిన మునగ ఉత్పత్తులు; తమిళనాడులోని కుంభకోణం నుంచి సహజ గ్రామీణ బియ్యం వంటివి ఆస్ట్రేలియా, వియత్నాం, ఘనా వంటి దేశాల్లో అనేక చోట్లకు ఎగుమతి అయ్యాయి.
 • కుంభకోణం నుండి సమీకరించిన పేటెంట్‌గల వాణిజ్యపరమైన ‘గ్రామీణ బియ్యం’.. ఘనా, యెమెన్‌ దేశాలకు విమాన, సముద్ర మార్గాల్లో ఎగుమతి చేయబడింది.
 • అమెరికాకు 40 టన్నుల ‘ఎర్ర బియ్యం’ తొలిసారి ఎగుమతి చేయబడింది. ఇనుప ధాతువు సమృద్ధిగాగల (‘బావో-ధాన్‌’ అనే) ఈ బియ్యాన్ని అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీలోయలో పండిస్తారు.
 • అదనపు రుచి సమకూర్చిన బెల్లం పొడి (4 టన్నులు) అమెరికాకు ఎగుమతి చేయబడింది.
 • ఉత్తరాఖండ్‌ పరిధిలోని హిమాలయ సానువులలో పండించిన చిరుధాన్యాల తొలి సరకు కన్‌సైన్‌మెంట్‌ డెన్మార్క్‌కు ఎగుమతి చేయబడింది.
 • ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని రైతుల నుంచి ప్రస్తుత పంటకాలంలో (జిఐ ధ్రువీకరణగల) బంగినపల్లి, సువర్ణరేఖ మామిడి సరుకును 2021 మే 6న దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు.
 • మహారాష్ట్రలోని పాల్ఘర్‌కు చెందిన దహాను-ఘోల్వాడ్‌ తాలూకా రైతుల నుంచి సమీకరించిన (జిఐ ధ్రువీకరణగల) దహను ఘోల్వాడ్‌ సపోటా పంట (200 కిలోలు) యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు ఎగుమతి చేయబడింది.
 • బీహార్‌ నుంచి ‘షాహి లిచ్చి’ పంట 2021 మే 24న విమానం ద్వారా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు ఎగుమతి చేయబడింది.
 • అలాగే త్రిపుర నుంచి లండన్‌కు (1.2టన్నుల) తాజా పనస పండ్లు ఎగుమతి అయ్యాయి.
 • బెంగళూరు నుంచి విలువ జోడించిన గ్లూటెన్‌ రహిత పనస పౌడర్‌, పనస క్యూబ్‌ల ప్యాకెట్లతో కూడిన సరకు సముద్ర మార్గంలో జర్మనీకి ఎగుమతి చేయబడింది.
 • జమ్ముకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం నుంచి సౌదీ అరేబియాలోని అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలుగల ‘ఎఫ్‌ఎంసీజీ’ సంస్థ ‘లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌’కు కుంకుమ పువ్వు, ఎండుఫలాలు ఎగుమతి చేయబడ్డాయి.
 • ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి తొలిసారి లండన్‌కు (500 కిలోల) నేరేడు పండ్లు విమానంలో ఎగుమతి చేయబడ్డాయి.
 • పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని మిడ్నపూర్‌ జిల్లా రైతులనుంచి సేకరించిన (24 టన్నుల) వేరుసెనగ తొలిసారిగా రోడ్డు మార్గంలో నేపాల్‌కు రవాణా చేయబడింది.

ఐరోపా సమాఖ్య దేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతిలో నిబంధనలకు కట్టుబాటు

   ఐరోపా సమాఖ్య దేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతులను పురుగుమందుల అవశేషాల సమస్య కాస్త దెబ్బతీసింది. భారత రైతులు వరిసాగులో పురుగుమందులు విస్తృతంగా వినియోగిస్తారు. ఈ కారణంగా బియ్యంలో ట్రైసైక్లజోల్‌, బుప్రోఫెజిన్‌ వంటి రసాయన అవశేషాల పరిమితిపై ఐరోపా సమాఖ్య కఠిన ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం. తదనుగుణంగా ఐరోపా సమాఖ్య దేశాలకు బాస్మతి బియ్యం ఎగుమతులకు ముందు ‘ఈఐసీ’ పరీక్షల నిర్వహణ తప్పనిసరి చేయబడింది. దీనివల్ల పరిస్థితులు కాస్త చక్కబడటంతోపాటు వాణిజ్య మంత్రిత్వ శాఖ నిశిత, నిరంతర అనుసరణ ఫలితంగా 2020 ఖరీఫ్‌ పంట కాలంలో ట్రైసైక్లజోల్‌, బుప్రోఫెజిన్‌ సహా 9 రకాల రసాయన పురుగుమందుల విక్రయాన్ని పంజాబ్‌ ప్రభుత్వం నిషేధించింది.

   మరోవైపు బాస్మతి సాగుచేసే ప్రాంతాల్లో అవగాహన పెంపునకు వాణిజ్య సంఘాలతో సంయుక్తంగా ‘అపెడా’ కృషిచేసింది. అంతేకాకుండా ట్రైసైక్లజోల్‌, బుప్రోఫెజిన్‌ రసాయన అవశేషాల ‘దిగుమతి ఆమోద పరిమితి’ ప్రక్రియ ఖరారులో ఐరోపా సమాఖ్య పరంగా జాప్యం నివారణకూ ‘అపెడా’ కృషిచేస్తోంది.

 

***(Release ID: 1726167) Visitor Counter : 356