కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల మునిసిప‌ల్ సంస్థ‌ల కాంట్రాక్టు ఉద్యోగులు, కాజువ‌ల్ ఉద్యోగుల‌కు ఇఎస్ఐ క‌వ‌రేజ్‌

Posted On: 10 JUN 2021 3:59PM by PIB Hyderabad

దేశంలోని మునిసిప‌ల్ సంస్థ‌ల కాంట్రాక్టు, కాజువ‌ల్ వ‌ర్కర్లంద‌రికీ కార్మిక రాజ్య బీమా చ‌ట్టం 1948 (ఇఎస్ఐ) ని వ‌ర్తింప చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కేంద్ర కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ సంతోష్ గంగ్వార్ ఈరోజు ప్ర‌క‌టించారు.  ఈ అంశాన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా ఇ.ఎస్‌.ఐ కార్పొరేష‌న్ ను కోరిన‌ట్టు ఆయ‌న తెలిపారు. త‌మ త‌మ ప‌రిధిలోని మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు, మునిసిప‌ల్ కౌన్సిళ్లలో ప‌నిచేస్తున్న కాజువ‌ల్, కాంట్రాక్టు కార్మికుల‌కు ఇ.ఎస్‌.ఐ క‌వ‌రేజ్ వ‌ర్తింప చేయ‌డానికి ఇ.ఎస్‌.ఐ చ‌ట్టం కింద నోటిఫికేష‌న్ ను సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు జారీ చేయ‌వ‌ల‌సి ఉంటుంది.


ఈ క‌వ‌రేజ్ ని కేంద్ర‌ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఇఎస్ఐ  చ‌ట్టం 1948 కింద నోటిఫై చేసిన ఏజెన్సీలు, ఎస్టాబ్లిష్‌మెంట్‌ల‌కు చెందిన కాజువ‌ల్ , కాంట్రాక్టు సిబ్బందికి వ‌ర్తింప‌చేస్తారు.

 ఢిల్లీ నేష‌న‌ల్ కాపిట‌ల్ రీజియ‌న్ విష‌యంలో ఇ.ఎస్‌.ఐ చ‌ట్టం కింద కేంద్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీచేయ‌వ‌ల‌సి ఉంటుంది. దీనితో కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌న మంత్రిత్వ‌శాఖ ఇప్ప‌టికే దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను 2021 జూన్ 7న జారీచేసింది. దీని ప్ర‌కారం ఢిల్లీ ఎన్‌సిటిలోగ‌ల మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు, కౌన్సిళ్ల కాంట్రాక్టు, కాజువ‌ల్ సిబ్బందికి ఇ.ఎస్‌.ఐ చ‌ట్టం కింద క‌వ‌రేజ్ వ‌ర్తిస్తుంది.


వివిధ రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లోని స్థానిక సంస్థ‌లు పెద్ద ఎత్తున కాజువ‌ల్‌, కాంట్రాక్టు వ‌ర్క‌ర్ల‌ను నియ‌మిస్తున్నాయి. అయితే వారు ఆయా మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు, మున్సిప‌ల్ కౌన్సిళ్ల రెగ్లుల‌ర్ ఉద్యోగులు కానందున ఈ కార్మికులు సామాజిక భ‌ద్ర‌తా ప‌రిధికిందికి వెలుప‌ల ఉండిపోతున్నారు. దీనితో వారి ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు..

 మునిసిప‌ల్ సంస్థ‌ల‌లో ప‌నిచేసే కాజువ‌ల్‌, కాంట్రాక్టు ఉద్యోగుల‌కు ఇఎస్ఐ క‌వ‌రేజ్ క‌ల్పించ‌డం,  కార్మికుల‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ‌ర్గానికి సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించ‌డం ఎంతో కీల‌క‌మైన‌ద‌ని ఇది ముందు ముందు మంచి ఫ‌లితాలు ఇవ్వనున్న‌ద‌ని ఆయ‌న అన్నారు ఇది కార్మికులు, వారి కుటుంబాల సామాజిక ఉన్న‌తికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌గ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు.

 
మునిసిప‌ల్ సంస్థ‌ల‌లో ప‌నిచేసే కాంట్రాక్టు, కాజువ‌ల్ సిబ్బందిని ఇఎస్ఐ పరిధి కిందికి తెస్తూ
.ఆయా రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు నోటిఫికేష‌న్ జారీచేసిన అనంత‌రం కార్మికులు ఇఎస్ఐ చ‌ట్టం కింద వ‌చ్చే పూర్తి ప్ర‌యోజ‌నాలు అంటే అనారోగ్య సంబంధిత ప్ర‌యోజ‌నాలు, గ‌ర్భిణుల‌కు ప్ర‌యోజ‌నాలు, అంగ‌వైక‌ల్యం సంభ‌వించినపుడు అందించే ప్ర‌యోజ‌నాలు,కార్మికుడిపై ఆధార‌ప‌డిన‌వారికి వ‌ర్తించే ప్ర‌యోజ‌నాలు, అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చులు వంటివి వీరికి వ‌ర్తిస్తాయి. దీనికి తోడు, వీరు దేశ‌వ్యాప్తంగా ఇ.ఎస్‌.ఐ నెట్ వ‌ర్క్ కింద గ‌ల 160 ఆస్ప‌త్రులు, 1500 డిస్పెన్స‌రీల‌లో వైద్య సేవ‌లు పొంద‌డానికి అర్హ‌త క‌లిగి ఉంటారు.




 

***

 


(Release ID: 1726104) Visitor Counter : 211