ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 టీకాల కార్యక్రమంపై తరచూ అడిగే ప్రశ్నలు

Posted On: 08 JUN 2021 10:17AM by PIB Hyderabad

అలర్జీ ఉన్నవారికి టీకా వేయవచ్చా?

గర్భిణులు కోవిడ్‌-19 టీకా తీసుకోవచ్చా? బిడ్డలకు పాలిచ్చేవారి మాటేమిటి?

టీకా తీసుకున్న తర్వాత తగినన్ని ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయా?

టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం సర్వసాధారణమా?

నాకు కోవిడ్‌ సోకి ఉంటే టీకా తీసుకోవడానికి ఎన్ని రోజులు ఆగాలి?

   కోవిడ్‌ టీకాల గురించి ప్రజల మదిలో మెదిలే సందేహాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు దూరదర్శన్‌ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దీనిపై దేశ ప్రజలకుగల అనేక సందేహాలకు డాక్టర్‌ నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యులు డాక్టర్‌ వి.కె.పాల్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏఐఐఎంఎస్‌ లేదా ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా సమాధానాలిచ్చారు. ఈ మేరకు వ్యాధి నుంచి రక్షణ కోసం కింది ప్రశ్నలు-జవాబులను పూర్తిగా చదవడంద్వారా సరైన వాస్తవాలు, సమాచారంతో సంసిద్ధంగా ఉండండి. తరచూ అడిగే ఇతర ప్రశ్నలపై జవాబులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ (https://www.mohfw.gov.in/covid_vaccination/vaccination/faqs.html)లో కూడా చూడవచ్చు:

అదేవిధంగా వీడియో కోసం ఈ లింకు (https://youtu.be/RnFaV4_dLlM >)ను క్లిక్‌ చేయండి.

అలర్జీ ఉన్నవారికి టీకా వేయవచ్చా?

డాక్టర్‌ పాల్‌: సాధారణమైన జలుబు, చర్మ అలర్జీల వంటి చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ టీకా తీసుకోవడానికి వెనుకాడాల్సిన పనిలేదు. ఒకవేళ ఎవరికైనా, నిర్దిష్ట అలర్జీ ఉన్నట్లయితే వైద్యుల సలహాతో మాత్రమే టీకా తీసుకోవాలి.

డాక్టర్‌ గులేరియా: ఏవైనా అలర్జీలకు మందులు వాడుతున్నవారి వాటిని ఆపకూకడదు. టీకా తీసుకున్న తర్వాత కూడా వాటిని కొనసాగించాలి. టీకావల్ల ఏదైనా అలర్జీ కలిగితే వాటి నివారణకు టీకాలిచ్చే ప్రతి ప్రదేశంలోనూ తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి. అందువల్ల మీకు ఒకవేళ తీవ్రమైన అలర్జీ కలిగినా మీరు అప్పటికే వాడుతున్న మందులను కొనసాగిస్తూ నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చునని మేం సూచిస్తున్నాం.

గర్భిణులు కోవిడ్‌-19 టీకా తీసుకోవచ్చా?

డాక్టర్‌ పాల్‌: మా ప్రస్తుత (https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1719925 చూడండి) మార్గదర్శకాల ప్రకారం గర్భిణులకు టీకా ఇవ్వకూడదు. ప్రయోగ పరీక్షల ఫలితాల మేరకు గర్భిణులకు టీకాలు వేయడంపై వైద్యులుగానీ, శాస్త్రవేత్తల బృందాలుగానీ నిర్ణయం తీసుకోరాదని సిఫారసు చేయబడింది. అయితే, తాజా శాస్త్రీయ అధ్యయనాల సమాచారం ఆధారంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

   ఇప్పటిదాకా వచ్చిన పలు కోవిడ్‌-19 టీకాలు గర్భిణులకు సురక్షితమేనని తేలింది; అలాగే మన రెండు దేశీయ టీకాలకూ మార్గం సుగమం కాగలదని ఆశిస్తున్నాం. స్వల్ప వ్యవధిలోనే టీకాలకు రూపకల్పన చేసినందున ప్రయోగ పరీక్షల సందర్భంగా ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినందున గర్భిణులను ఆ జాబితాలో చేర్చలేదు. అందువల్ల గర్భిణులకు టీకా విషయంలో కొంత సహనం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

డాక్టర్‌ గులేరియా: చాలా దేశాలు గర్భిణులకు టీకాలివ్వడం ప్రారంభించాయి. ఈ మేరకు అమెరికాలో ‘ఫైజర్‌, మోడర్నా’ కంపెనీల టీకాలకు ‘యూఎస్‌ ఎఫ్‌డీఏ’ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ‘కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌’ టీకాలకూ ఆమోదముద్రపై సమాచారం త్వరలోనే అందనుంది. దీనిపై ఇప్పటికే కొంత సమాచారం అందుబాటులో ఉన్నప్పటికీ, వీలైనంత త్వరగా అవసరమైన ఇతర సమాచారం కూడా లభ్యం కాగలదని మేం ఆశాభావంతో ఉన్నాం. ఆ మేరకు భారత్‌లోనూ గర్భిణులకు టీకాలివ్వడంపై త్వరలోనే ఆమోదం లభించగలదని భావిస్తున్నాం.

బిడ్డలకు పాలిచ్చే తల్లుల మాటేమిటి?

డాక్టర్‌ పాల్‌: బిడ్డలకు పాలిచ్చే తల్లులు టీకా తీసుకోవడం పూర్తిగా సురక్షితమేనని మార్గదర్శకాలు (https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1719925 చూడండి) స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి భయాలూ అక్కర్లేదు. టీకాకు ముందు/తర్వాత కూడా నిస్సందేహంగా బిడ్డకు పాలివ్వడం కొనసాగించవచ్చు.

టీకా తీసుకున్న తర్వాత తగినన్ని ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయా?

డాక్టర్‌ గులేరియా: టీకాలతో ఉత్పన్నమయ్యే ప్రతిరోధకాల పరిమాణాన్ని బట్టి మాత్రమే టీకాల సామర్థ్యాన్ని నిర్ధారించడం సరికాదని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. టీకాలు- ప్రతిరోధకాల ద్వారా, కణజాల ప్రసారిత రోగనిరోధకత ద్వారా, (మనకు వ్యాధి సోకినపుడు మరిన్ని ప్రతిరోధకాలను సృష్టించే) జ్ఞాన కణాలద్వారా అనేక రకాలుగా రక్షణ కల్పిస్తాయి. ఇప్పటివరకూ టీకాల సామర్థ్య ఫలితం ప్రయోగాత్మక అధ్యయనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అధ్యయనాలు వేర్వేరు రకాల ప్రయోగాల రూపంలో ఉండటమే ఇందుకు కారణం.

   ఇప్పటిదాకా అందుబాటులోగల సమాచారం ప్రకారం- ‘కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ లేదా స్పుత్నిక్‌-వి’ వంటి టీకాలన్నిటి సామర్థ్యం ఇంచుమించు సమానంగానే ఉంది. కాబట్టి మనం “ఈ టీకా తీసుకుందామా లేక ఆ టీకా వేసుకుందామా” అంటూ తర్జనభర్జన పడకుండా మీ ప్రాంతంలో ఏ టీకా లభిస్తే అది నిస్సందేహంగా తీసుకోండి. ఆ విధంగా మీతోపాటు మీ కుటుంబాన్నీ సురక్షితంగా ఉంచండి. 

డాక్టర్‌ పాల్‌: కొందరు టీకా వేయించుకున్న తర్వాత ప్రతిరోధకాల పరిమాణం తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ, ఒక వ్యక్తి రోగనిరోధక శక్తిని కేవలం ప్రతిరోధకాలు మాత్రమే నిర్ధారించలేవన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో అలాంటి పరీక్షలు నిరర్ధకం-  టీకా తీసుకున్న తర్వాత శరీరంలోని “టి-కణాలు లేదా జ్ఞాన కణాలు” మరింత బలం పొందడం, నిరోధక శక్తిని పెంచుకోవడం వంటి కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. పైగా ఎముక మజ్జలో ఉండే ‘టి-కణాలు’ ప్రతిరోధకాల పరిమాణ నిర్ధారణ పరీక్షలలో కనిపించవు. కాబట్టి టీకా తీసుకునే ముందు/తర్వాత ప్రతిరోధక పరిమాణ పరీక్షలవైపు వెళ్లవద్దన్నది ప్రజలకు మా అభ్యర్థన. అందుబాటులోగల టీకాను రెండు మాతాదులలో సరైన సమయ వ్యవధుల మేరకు తప్పకుండా తీసుకోండి. అదేవిధంగా కోవిడ్‌ అనుగుణ ప్రవర్తన పద్ధతులను పాటించండి. ఇక కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నాం కాబట్టి ఇక టీకాతో పనిలేదనే భ్రమలో పడరాదని ప్రజలకు మా విజ్ఞప్తి.

టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం సర్వసాధారణమా?

డాక్టర్‌ పాల్‌: ఆస్ట్రా-జెనెకా టీకా విషయంలో ఇలాంటి ఉదంతాలు కొన్ని చోటుచేసుకున్నాయి. అయితే, ఇది ఐరోపాలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ సమస్య కనిపించింది. అక్కడి ప్రజల జన్యు నిర్మాణం, జీవనశైలి కారణంగా యువతలో కొంతవరకూ ఈ దుష్ప్రభావం వెల్లడైంది. అయితే, భారత్‌లో దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ మేం క్రమపద్ధతిలో క్షుణ్నంగా పరిశీలించాం. రక్తం గడ్డకట్టడం వంటి సమస్య మన దేశంలో దాదాపు శూన్యమని, దీనిపై ఎంతమాత్రం ఆందోళన అవసరంలేదని నేను భరోసా ఇస్తున్నాను. మన దేశంతో పోలిస్తే ఐరోపా దేశాల్లో ఈ సమస్య 30 రెట్లు అధికంగా ఉందని తేలింది.

డాక్టర్‌ గులేరియా: అమెరికా, ఐరోపా దేశాల జనాభాతో పోలిస్తే శస్త్రచికిత్సల తర్వాత రక్తం గడ్డకట్టే సమస్య భారతదేశ జనాభాలో అత్యంత స్వల్పమని ఏనాడో స్పష్టమైంది. టీకా ప్రేరేపిత “త్రాంబోసిస్‌ లేదా త్రాంబోసైటోపీనియా” దుష్ప్రభావం ఐరోపాతో పోలిస్తే భారత్‌లో అత్యంత అరుదు మాత్రమే. కాబట్టి దీనిగురించి భయపడాల్సిన పనిలేదు. అంతేగాక దుష్ప్రభావమంటూ ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని త్వరగా నిర్ధారించుకుని, మనం తక్షణ చికిత్స తీసుకునే వీలుంది.

నాకు కోవిడ్‌ సోకి ఉంటే టీకా కోసం ఎన్ని రోజులు ఆగాలి?

డాక్టర్‌ గులేరియా: కోవిడ్‌-19 బారిన పడినవారు కోలుకున్న రోజునుంచి 3 నెలల తర్వాత టీకా తీసుకోవచ్చునని (https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1719925 చూడండి) మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేయడంవల్ల మన శరీరం బలమైన రోగనిరోధకత సాధించడంతోపాటు టీకా ప్రభావం మరింత సమర్థంగా ఉంటుంది.

   ఈ మేరకు భారతదేశంలో ఇప్పటివరకూ కనిపించిన వైరస్‌ కొత్త రకాలపై పోరులో మన టీకాలు రెండూ శక్తిమంతమైనవేనని ఇద్దరు నిపుణులు- డాక్టర్‌ పాల్‌, డాక్టర్‌ గులేరియా ఈ సందర్భంగా భరోసా ఇవ్వడమేగాక వాస్తవాలను పునరుద్ఘాటించారు. అదే సమయంలో టీకా తీసుకున్న తర్వాత మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని లేదా చనిపోతారని సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం ఒట్టి బూటకమని వారిద్దరూ స్పష్టం చేశారు. కొన్ని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోగల ఈ ప్రచారం కేవలం వదంతి మాత్రమేనని, దీన్ని నమ్మవద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

సారాంశ సౌజన్యం: దూరదర్శన్‌ న్యూస్‌- పీఐబీ ముంబై/డీజేఎం/ఎస్‌సి 

 

***(Release ID: 1725273) Visitor Counter : 945