ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

టీకాలపై అపోహల తొలగింపు


“ఉదారంగా ధరలు-వేగంగా టీకాలు” వ్యూహంతో టీకాలలో సమానత్వం

మే నెలలో ప్రైవేట్ ఆస్పత్రులు అందుకున్న టీకా డోసులు 1.2 కోట్లు

Posted On: 05 JUN 2021 7:42PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో జనవరి 16 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమాన్ని నడిపిస్తోంది. అయితే, టీకాల కార్యక్రమంలో అసమానతలున్నట్టు కొన్ని మీడియా వార్తలు ఆరోపిస్తున్నాయి. అవి అసంబంధమైనవి, ఊహాజనితమైనవే తప్ప వాస్తవాలు కావు.


సరసమైన ధరకు టీకాల అందుబాటు ద్వారా ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసే వ్యూహాన్ని కేంద్ర ప్రభుత్వం మే 1 నుమ్చి అమలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు నడుస్తున్న మూడో దశ టీకాలకు అదే ప్రాతిపదిక. ఈ వ్యూహం కింద కేంద్ర ఔషధ ప్రయోగశాల ( సిడిఎల్) ఆమోదం పొందిన ఏ తయారీదారు దగ్గరైనా కేంద్ర ప్రభుత్వం 50% మేరకు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మిగిలిన 50% సొంతగా కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో  సగం ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించారు. ఆ విధంగా 25% ప్రైవేట్ ఆస్పత్రులు కొనుక్కునే వీలుంది. టీకా కొనగల స్థోమత ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళి టీకాలు వేయించుకుంటారు.

 

జూన్ 1 నాటికి ( అంటే మే నెలలో) ప్రైవేట్ ఆస్పత్రులకు అందిన టీకా డోసులు 1.2 కోట్లు. మే 4 వరకు కోవిషీల్డ్ కోసం సీరమ్ ఇన్ స్టిట్యూట్ ను, కొవాక్సిన్ కోసం భారత్ బయోటెక్ ను సంప్రదించిన ప్రైవేట్ ఆస్పత్రులకు అన్నిటికీ టీకాలు సరఫరా చేశారు. ఈ ఆస్పత్రులు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా అన్ని రాష్టాలలో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలలో ఉన్నాయి.

కొన్ని నగరాల జాబితా ఇది:

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, నెల్లూరు, శ్రీకాళహస్తి, విజయవాడ; అరుణాచల్ ప్రదేశ్ లో ఇటానగర్; అస్సాం లో డిబ్రూగర్’ ఒడిశాలో సంభల్పూర్; గుజరాత్ లో అంక్లేశ్వర్ కచ్, మోర్బి, వాపి, సూరత్; జార్ఖండ్ లో బొకారో, జంషెడ్పూర్, పాల్ఘర్; జమ్మూకశ్మీర్ లో జమ్మూ, శ్రీనగర్; కర్నాటకలో బళ్లారి, దావణగెరె, మంగుళూరు, మైసూరు, శివమొగ్గ; కేరళలో కాలికట్, ఎర్నాకుళం, కొచ్చి, కోళికోడ్, పఠాన్ మిట్ట, త్రిస్సూర్; మహారాష్ట్రలో అహ్మద నగర్, అకోలా, ఔరంగాబాద్, బారామతి, కల్హేర్, కొల్హాపూర్, నాగపూర్, జలగావ్, నాసిక్; హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రా; పంజాబ్ లో జలంధర్, మొహలి, భివాండి, లుధియానా; తమిళనాడులో కోయంబత్తూర్, వేలూర్; తెలంగాణలో ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి; ఉత్తరప్రదేశ్ లో గోరఖ్ పూర్, కాన్పూర్, వారణాసి; పశ్చిమ బెంగాల్ లో దుర్గాపూర్

ఈ టీకాల కార్యక్రమం విజయవంతం కావటానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి కృషి చేస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు తక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రాలను గుర్తించి అక్కడి పరిస్థితిని సమీక్షించిన మీదట ఎబి-పిఎం జె ఎ వై  కింద పనిచేసే ఆస్పత్రుల జాబితా, నిర్దిష్టమైన బీమా పథకాలు, భౌగోళికంగా వాటి వ్యాప్తి లాంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని టీకా తయారీదారులతో ఒప్పందాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.  

పైగా, ఎప్పటికప్పుడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ప్రభుత్వంసంప్రదింపులు జరుపుతూ, అక్కడి ప్రైవేట్ ఆస్పత్రులకు అందిన టీకా డోసుల సంఖ్యను  నిశితంగా పర్యవేక్షిస్తూ ఉంది. దీనివలన జిల్లా స్థాయిలో కూడా సమాచారం అందుతోంది.  తయారీదారులతో కూడా క్రమం తప్పకుందా సమీక్షించటం వలన తదుపరి చర్యలకు సూచనలివ్వటానికి, అవసరాలకు తగినట్టు సరఫరా జరిగేట్టు చూడటానికి వీలవుతోంది.

 

                                                                     *****


(Release ID: 1724831) Visitor Counter : 247