ఆర్థిక మంత్రిత్వ శాఖ

మౌలిక సదుపాయాల ప్రణాళిక గురించి చర్చించడానికి ఏర్పాటైన సమావేశానికి అధ్యక్షత వహించిన - ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్


మూలధన వ్యయాన్ని ముందుగానే పేర్కొనవలసిందిగా మంత్రిత్వ శాఖలను కోరిన - కేంద్ర ఆర్ధిక మంత్రి

ఎం.ఎస్.ఎం.ఈ.ల బకాయిలను త్వరగా చెల్లించాలని మంత్రిత్వ శాఖలను, వాటి ఆధీనంలోని సి.పి.ఎస్.ఈ. లను కోరిన - కేంద్ర ఆర్ధిక మంత్రి

Posted On: 04 JUN 2021 6:21PM by PIB Hyderabad

మౌలిక సదుపాయాల ప్రణాళిక గురించి చర్చించడానికి, కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రభుత్వ సీనియర్ అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమావేశం నిర్వహించారు.  కేంద్ర ఆర్ధిక మంత్రి, 2021-22 బడ్జెట్ సమర్పించిన తర్వాత, ఆర్థిక మంత్రిత్వ శాఖలు / విభాగాలతో ఇది నాల్గవ సమీక్ష సమావేశం మరియు  మౌలిక సదుపాయాల ప్రణాళిక రూపొందించిన తర్వాత నిర్వహించిన వరుస సమావేశాలలో రెండవది.  మంత్రిత్వ శాఖలు, వాటి ఆధ్వర్యం లోని సి.పి.ఎస్.ఈ. ల మూలధన వ్యయ ప్రణాళికలు, బడ్జెట్ ప్రకటనల అమలు స్థితి, మౌలిక సదుపాయాల పెట్టుబడులను వేగవంతం చేసే చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.  ఈ సమావేశంలో - ఆర్ధిక కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ కార్యదర్శి, విద్యుత్ శాఖ కార్యదర్శి, రైల్వే బోర్డు ఛైర్మన్, సి.ఈ.ఓ. లతో పాటు, రెండు మంత్రిత్వ శాఖల ఆధ్వర్యం లోని సి.పి.ఎస్.ఈ.లకు చెందిన సి.ఎం.డి.లు / సి.ఈ.ఓ.లు, సి.ఈ.ఓ.లు పాల్గొన్నారు.

మంత్రిత్వ శాఖలు, వాటి ఆధ్వర్యంలోని సి.పి.ఎస్‌.ఈ.ల మూలధన వ్యయ పనితీరును సమీక్షిస్తున్న సందర్భంగా, కేంద్ర ఆర్ధిక మంత్రి మాట్లాడుతూ, మహమ్మారి అనంతరం, ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించడం లో మెరుగైన మూలధన వ్యయం కీలక పాత్ర పోషిస్తుందని నొక్కిచెప్పారు. వారి మూలధన వ్యయాన్ని ముందు గానే పేర్కొనాలని, మంత్రిత్వ శాఖలను కోరారు.  మూలధన వ్యయం లక్ష్యాలను మరింతగా సాధించాలనే లక్ష్యంతో మంత్రిత్వ శాఖలు కృషి చేయాలని కూడా అభ్యర్థించారు.  2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లో 5.54 లక్షల కోట్ల రూపాయల మేర మూలధన వ్యయాన్ని అందించడం జరిగిందనీ, 2020-21 బడ్జెట్ అంచనా తో పోలిస్తే ఇది 34.5 శాతం పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఏదేమైనా, మూలధన వ్యయాన్ని పెంచడానికి బడ్జెట్ పరంగా చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మౌలిక సదుపాయాల వ్యయం కేవలం మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వ్యయం మాత్రమే కాదని, దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, ప్రైవేటు రంగంలో పెండింగ్‌ లో ఉన్న మౌలిక సదుపాయాలు కూడా కలిసి ఉన్నాయని, కేంద్ర ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు.  అదనపు బడ్జెట్ వనరుల ద్వారా ప్రభుత్వ వ్యయం కూడా ఇందులో ఉంది.  అందువల్ల, వినూత్న నిర్మాణ మరియు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా ద్వారా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంతో పాటు, మౌలిక సదుపాయాల వ్యయాన్ని పెంచడానికి ప్రైవేట్ రంగానికి పూర్తి సహకారం అందించడానికి, మంత్రిత్వ శాఖలు చురుకుగా పని చేయాలని, ఆచరణీయ ప్రాజెక్టుల కోసం మంత్రిత్వ శాఖలు కూడా పి.పి.పి. విధానాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి సూచించారు. ఎం.ఎస్.ఎం.ఈ.ల బకాయిలను త్వరగా చెల్లించాలని కూడా మంత్రిత్వ శాఖలను, వాటి ఆధ్వర్యంలోని సి.పి.ఎస్.ఈ. లను కేంద్ర ఆర్ధిక మంత్రి కోరారు.

భారీ ముఖ్యమైన ప్రాజెక్టుల పై సమయానుకూలంగా వ్యయం అందుబాటులో ఉండేలా చూడాలని, కేంద్ర ఆర్థిక మంత్రి, తమ ప్రసంగాన్ని ముగిస్తూ,  మంత్రిత్వ శాఖల కార్యదర్శులను కోరారు.  ఆయా రంగాల - నిర్దిష్ట ప్రాజెక్టులపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సమర్ధవంతంగా సమీక్షలు జరపాలని కూడా ఆమె మంత్రిత్వ శాఖల ను కోరారు.  అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలతో, తాను, క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని, కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు.

 

*****



(Release ID: 1724605) Visitor Counter : 169