ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
టీకాలకు సంబంధించి అపోహల పై - వివరణ
2021 మే నెలలో 61.06 మిలియన్ మోతాదుల టీకాలు వేసిన - రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు
2021 మే, 31వ తేదీన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వద్ద వినియోగించకుండా మిగిలిన - 16.21 మిలియన్ టీకా మోతాదులు
Posted On:
02 JUN 2021 12:17PM by PIB Hyderabad
టీకాలు వేసే కార్యక్రమం సమర్ధవంతంగా నిర్వహించడం కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కృషికి, "మొత్తం ప్రభుత్వం" అనే విధానం కింద, భారత ప్రభుత్వం, ఈ ఏడాది జనవరి, 16వ తేదీ నుండి పూర్తి సహకారాన్ని అందిస్తోంది. టీకా మోతాదుల లభ్యతను క్రమబద్ధీకరించడానికి, కేంద్ర ప్రభుత్వం టీకా తయారీదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. 2021 మే నెల 1వ తేదీ నుండి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల కోసం వివిధ సేకరణ ఎంపికలను ప్రారంభించింది.
జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ భారీ కార్యక్రమానికి సంబంధించి, తప్పుడు సమాచారాన్ని, అనేక అవాస్తవ మీడియా నివేదికలు ప్రచారం చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2021 మే నెలలో అందుబాటులో ఉన్న మొత్తం 79 మిలియన్ మోతాదుల నుండి కేవలం 58 మిలియన్ మోతాదులను మాత్రమే అందజేయగా, 2021 జూన్ నెలలో, 120 మిలియన్ మోతాదుల టీకాలు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిందని, మీడియా నివేదికలు ఆరోపించాయి. వాస్తవానికి ఈ నివేదిక తప్పు మరియు నిరాధారమైనది.
2021 జూన్, 1వ తేదీ ఉదయం 7:00 గంటలకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2021 మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 61.06 మిలియన్ టీకా మోతాదులను వేశాయి. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం, మొత్తం 16.22 మిలియన్ ల మేర వినియోగించకుండా మిగిలిన టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయి. 2021 మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు మొత్తం 79.45 మిలియన్లు అందుబాటులో ఉన్నాయి.
ధృవీకరించని సమాచారం ఆధారంగా భారతదేశ టీకా విధానాన్ని కొన్ని మీడియా నివేదికలు విమర్శించాయి. జనాభా విభాగాల ప్రాధాన్యతను ప్రశ్నించే ఈ నివేదికలు ఈ విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోకుండా విమర్శిస్తున్నాయి.
లబ్ధిదారుల ప్రాధాన్యత, సేకరణ, వ్యాక్సిన్ ఎంపిక, దాని సరఫరాతో సహా టీకా పరిచయం యొక్క అన్ని అంశాలపై మార్గదర్శకత్వం అందించడం కోసం 2020 ఆగష్టు నెలలో కోవిడ్-19 కోసం టీకా నిర్వహణ పై జాతీయ నిపుణుల బృందాన్ని (ఎన్.ఈ.జి.వి.ఏ.సి) ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల సమీక్ష, డబ్ల్యూ.హెచ్.ఓ. ప్రతిపాదించిన మార్గదర్శకాలు, ప్రపంచ ఉదాహరణలతో పాటు, ఇతర దేశాల్లో అనుసరించిన పద్ధతుల ఆధారంగా, భారతదేశంలో కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం కోసం లబ్ధిదారుల ప్రాధాన్యతలను నిర్ణయించడం జరిగింది.
భారతదేశంలో కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమం యొక్క ప్రాధమిక లక్ష్యాలు:
* మహమ్మారి ప్రతిస్పందన వ్యవస్థలో భాగంగా ఆరోగ్య సంరక్షణ కు రక్షణ కల్పించడం.
* కోవిడ్-19 కారణంగా సంభవించే మరణాలను నివారించడం. ఈ వ్యాధి కారణంగా మరణించే అత్యధిక ప్రమాదం మరియు హాని ఉన్న వ్యక్తులు మృతి చెందకుండా, వారిని రక్షించడం.
దీని ప్రకారం, మన దేశంలో టీకాలు వేసే కార్యక్రమం, వరుసగా ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలు (హెచ్.సి.డబ్ల్యు) తో మొదలై, ఆతర్వాత ముందు వరుసలో సేవలందించే కార్యకర్తలు (ఎఫ్.ఎల్.డబ్ల్యు.లు), అనంతరం, 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారితో పాటు, 45-59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో గుర్తించిన 20 సహ-అనారోగ్యాలతో బాధపడుతున్న వ్యక్తులను ప్రాధాన్యత గల బృందాలుగా విభజించి అమలుచేయడం జరుగుతోంది. తదనంతరం, 2021 ఏప్రిల్, 1వ తేదీ నుండి, 45 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారందరూ కూడా కోవిడ్-19 టీకాలు వేయించుకోవడానికి అర్హులుగా ప్రకటించడం జరిగింది.
నమోదైన హెచ్.సి.డబ్ల్యు. లలో 81 శాతం కంటే ఎక్కువ మంది మొదటి మోతాదు టీకా వేయించుకోవడం ద్వారా, ఈ విధానం, సానుకూల ఫలితాలను ఇచ్చింది. అదేవిధంగా, నమోదైన ఎఫ్.ఎల్.డబ్ల్యూ. లలో సుమారు 84 శాతం మంది మొదటి మోతాదు టీకా వేయించుకున్నారు. తద్వారా, కోవిడ్-19 మహమ్మారి రెండవ దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ సేవలు, నిఘా మరియు నియంత్రణ కార్యకలాపాలను అందించడంలో పాల్గొంటున్న ఈ సహచరులను రక్షించుకుంటున్నట్లు అయ్యింది. 45 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిలో 37 శాతం మందికి మొదటి మోతాదు టీకా ఇవ్వబడింది, కాగా, వీరిలో, అర్హత కలిగిన 32 శాతం మంది లబ్ధిదారులకు 2వ మోతాదు టీకా కూడా ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు, 2021 మే నెల 1వ తేదీ నుండి 18 సంవత్సరాలు, మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ టీకాలు వేయించుకోవడానికి అర్హులు. 2021 మే నెల 1వ తేదీన ‘సరళీకృత ధర నిర్ణయం మరియు వేగవంతమైన జాతీయ కోవిడ్-19 టీకా వ్యూహం’ ప్రారంభమయ్యింది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్-19 టీకాలు వేసే 3వ దశ కార్యక్రమానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈ వ్యూహం ప్రకారం, ప్రతి నెలలో, ఏ తయారీదారు నుంచి అయినా, కేంద్ర ఔషధ ప్రయోగశాల (సి.డి.ఎల్) అనుమతించిన మొత్తం టీకా మోతాదుల్లో 50 శాతం భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇంతకు ముందు చేసిన విధంగా, ఈ మోతాదులను రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు పూర్తిగా ఉచితంగా అందజేయడం కొనసాగుతుంది. కాగా, మిగిలిన 50 శాతం మోతాదులు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా ప్రత్యక్ష సేకరణ కు అందుబాటులో ఉంటాయి. వీటిలో రాష్ట్రాల వాటా దామాషా ప్రాతిపదికన ఉంటుంది.
*****
(Release ID: 1723995)