రైల్వే మంత్రిత్వ శాఖ

గత ఏడు సంవత్సరాల కాలంలో రైల్వేలు బయో టాయిలెట్లు,విద్యుద్దీకరణ, మౌలిక సదుపాయాల పెంపు లాంటి అంశాలపై తీసుకున్నకార్యక్రయాలపై ఎన్‌ఆర్‌టిఐ పరిశోధన చేయాలి- శ్రీ పియూష్ గోయల్


రైల్వేనిర్వహిస్తున్న అన్ని శిక్షణా సంస్థలు ఎన్‌ఆర్‌టిఐ పరిధిలోకి రావాలి - శ్రీ గోయల్

3 సంవత్సరాలలో ఎన్‌ఆర్‌టిఐ శిక్షణకు మార్గదర్శక సంస్థగా అవతరించింది. విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఎన్‌ఆర్‌టిఐ ప్రాధాన్యత ఇవ్వాలి ... శ్రీ పియూష్ గోయల్

ఎన్‌ఆర్‌టిఐ సాధించిన అభివృద్ధిని సమీక్షించిన కేంద్ర రైల్వే , వాణిజ్య మరియు పరిశ్రమ , వినియోగదారుల వ్యవహారాల ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రి

Posted On: 31 MAY 2021 6:01PM by PIB Hyderabad

 గత ఏడు సంవత్సరాల కాలంలో రైల్వేలు బయో టాయిలెట్లు,విద్యుద్దీకరణ, మౌలిక సదుపాయాల పెంపు లాంటి అంశాలపై అమలు చేస్తున్న కార్యక్రయాలపై  జాతీయ రైలు మరియు రవాణా సంస్థ (ఎన్‌ఆర్‌టిఐ)  పరిశోధన చేయాలని కేంద్ర  కేంద్ర రైల్వే , వాణిజ్య మరియు పరిశ్రమ , వినియోగదారుల వ్యవహారాల  ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖల మంత్రి   శ్రీ పియూష్ గోయల్ అన్నారు.  ప్రస్తుతం రైల్వేశాఖ నిర్వహిస్తున్న వివిధ శిక్షణా సంస్థలను ఎన్‌ఆర్‌టిఐ పర్యవేక్షణలోకి తీసుకుని రావలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు. దీనివల్ల శిక్షణా ప్రమాణాలు మెరుగుపడడమే కాకుండా ఖర్చులను తగ్గించి, వనరులను పూర్తిగా వినియోగించుకుని  అందరికి  ఒకేవిధమైన శిక్షణను అందించడానికి అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు. ఆవిర్భవించిన మూడు సంవత్సరాల కాలంలోనే ఎన్‌ఆర్‌టిఐ గణనీయ ప్రగతిని సాధించి విద్యా కార్యక్రమాల్లో అగ్రస్థానం చేరుకున్నదని అన్నారు. విద్యా సంబంధ అంశాలలో సంస్థ మరిన్ని సౌకర్యాలను సమకూర్చుకోవాలని మంత్రి సూచించారు. 

రైలు, రవాణా సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, యాజమాన్యం అంశాలలో ఉన్నత విద్యను అందించి పరిశోధనా కార్యక్రమాలను ప్రపంచ స్థాయీ ప్రమాణాలతో  నిర్వహించాలన్న లక్ష్యంతో ఎన్‌ఆర్‌టిఐ పనిచేస్తోంది. విద్యా అంశాలను, పరిశోధనా కార్యక్రమాలను చేపట్టడానికి ఎన్‌ఆర్‌టిఐ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుంది. రవాణా యాజమాన్య రంగాలలో ఎన్‌ఆర్‌టిఐ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తోంది.  

ఇప్పటికే రైల్వేలు, రవాణా రంగంలో పనిచేస్తున్నవారు మరింత నైపుణ్యంతో పనిచేయడానికి ఎన్‌ఆర్‌టిఐ తన కార్యక్రమాలతో తోడ్పడుతున్నది. 

 

****



(Release ID: 1723253) Visitor Counter : 126