రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డీజీ ఎన్‌సీసీ మొబైల్ శిక్షణ యాప్‌ 2.0ను ప్రారంభించిన రక్షణ శాఖ కార్యదర్శి

Posted On: 28 MAY 2021 2:44PM by PIB Hyderabad

'డైరెక్టరేట్‌ జనరల్‌ నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ మొబైల్ శిక్షణ యాప్‌ 2.0'ను రక్షణ శాఖ కార్యదర్శి డా.అజయ్‌ కుమార్‌ న్యూదిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌సీసీ క్యాడెట్లకు ఈ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే శిక్షణ కొనసాగించవచ్చు. ఎన్‌సీసీ సంబంధిత ప్రాథమిక సమాచారం, సంపూర్ణ శిక్షణాంశాలను (పాఠ్యాంశాలు, ప్రసంగ పాఠాలు, శిక్షణ దృశ్యాలు, తరచూ అడిగే ప్రశ్నలు) ఒకే వేదిక ద్వారా అందించడం దీని లక్ష్యం. శిక్షణాంశాలను ఉపయోగించుకుకోవడానికి, ప్రస్తుత పరిస్థితుల్లో శిక్షణను కొనసాగించడానికి ఎన్‌సీసీ క్యాడెట్లకు ఈ యాప్‌ సాయపడుతుంది.

    కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా, ఆన్‌లైన్‌ ద్వారా క్యాడెట్లకు శిక్షణ కొనసాగించడంపై ఎన్‌సీసీని డా.అజయ్‌ కుమార్‌ అభినందించారు. కొవిడ్‌ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ఎన్‌సీసీ క్యాడెట్లకు కొత్త వెర్షన్‌ ఉపయోగపడుతుందన్నారు.
ఎన్‌సీసీ క్యాడెట్లు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఈ యాప్‌ ద్వారానే ఆన్‌లైన్‌ శిక్షణ, పరీక్షలకు హాజరు కావచ్చని చెప్పారు. యాప్‌ను అభివృద్ధి చేసినందుకు ఎన్‌సీసీ సిబ్బందిని డా.అజయ్‌ కుమార్‌ ప్రశంసించారు. ఎన్‌సీసీ శిక్షణను స్వయంచాలితం చేయడం ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'డిజిటల్‌ ఇండియా' మార్గంలో ఒక సానుకూల అడుగుగా మారుతుందని అభివర్ణించారు.

    ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో డిజిటల్‌ సాంకేతికతను జీవనరేఖగా పేర్కొన్న డా.అజయ్‌ కుమార్‌, ఇప్పుడది జీవనమార్గంగా, ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణనిచ్చే మార్గంగా మారిందన్నారు. ఎన్‌సీసీ డైరెక్టరేట్లలో అనేక రకాల అనుకరణ యంత్రాల సంఖ్యను పెంచడం సహా, ఎన్‌సీసీ క్యాడెట్లకు డిజిటల్ విధానాల్లో శిక్షణ కొనసాగించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఉపగ్రహ చిత్రాలు, జీఐఎస్‌-ఆధారిత మ్యాపింగ్‌ అంశాల్లో ఎన్‌సీసీ క్యాడెట్లు త్వరలోనే శిక్షణ అందుకుంటారని డా.అజయ్‌ కుమార్‌ ప్రకటించారు. ఎన్‌సీసీ క్యాడెట్లు యూనిఫారాలు కొనుక్కోవడానికి ఇచ్చే భత్యం త్వరలోనే నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతుందని తెలిపారు.

    దేశసేవలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల విగ్రహాలను "#NCCforStatues" ద్వారా దత్తత తీసుకోవాలని, ఆ వీర సైనికుల అత్యున్నత ప్రాణత్యాగాలకు ఇది నివాళి అవుతుందని ఎన్‌సీసీ క్యాడెట్లకు రక్షణ శాఖ కార్యదర్శి సూచించారు. కొవిడ్‌పై పోరాటానికి చేపట్టిన ఎక్స్‌-ఎన్‌సీసీ యోగ్‌ధన్‌లో గతేడాది పాల్గొన్న, ఈ ఏడాది పాల్గొంటున్న క్యాడెట్లను ఆయన అభినందించారు.

    గతేడాది మార్చిలో కొవిడ్‌ కారణంగా ఆంక్షలు విధించిన తర్వాత, డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించి క్యాడెట్లకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని ఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ తరుణ్‌ కుమార్‌ చెప్పారు. ఇందుకోసం రూపొందించిన డీజీ ఎన్‌సీసీ మొబైల్‌ యాప్‌ 1.0 వెర్షన్‌ను గతేడాది ఆగస్టు 27న రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఆ వెర్షన్‌ వినియోగంపై ఎప్పటికప్పుడు క్యాడెట్ల నుంచి అభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగా, మరింత ఉపయుక్తంగా ఉండేలా 2.0 వెర్షన్‌ను రూపొందించారు.

    శిక్షణ యాప్‌ 2.0 వెర్షన్‌ హిందీ, ఆంగ్ల భాషల్లో ఉంటుందని లెఫ్టినెంట్‌ జనరల్‌ తరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. వినియోగ సౌలభ్యం కోసం మరిన్ని కొత్త అంశాలు జత చేశామన్నారు. ప్రసంగ పాఠాలు, తరచూ అడిగే ప్రశ్నలను హిందీలోనూ ఉంచామని, తరగతులను మరింత ఆసక్తికరంగా మార్చడానికి మరో 130 శిక్షణ దృశ్యాలను కూడా కొత్త వెర్షన్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు. క్యాడెట్లకు వచ్చే సందేహాలను తీర్చుకునే సౌలభ్యం కూడా యాప్‌లో ఉంది. తమ సందేహాలను ఈ యాప్‌లో టైపు చేసి పంపితే, ధృవీకృత బోధకుల నుంచి సమాధానం వస్తుంది. 

    యాప్‌ 1.0 వెర్షన్‌ను ఉపయోగించిన అనుభవాలను ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు. యాప్‌ను మరింత సౌలభ్యంగా మార్చేందుకు సలహాలు ఇచ్చారు. ప్రస్తుత సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ కొనసాగిస్తున్న ఎన్‌సీసీకి వారు ధన్యవాదాలు తెలిపారు.

    దేశవ్యాప్తంగా ఉన్న 17 ఎన్‌సీసీ డైరెక్టరేట్ల అధికారులు, క్యాడెట్లు వర్చువల్‌ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ శాఖ సీనియర్‌ అధికారులు, సైనిక ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

 

***
 



(Release ID: 1722474) Visitor Counter : 183