హోం మంత్రిత్వ శాఖ

ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతోపాటు అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్తో ‘యాస్’ తుపాను సన్నద్ధతపై కేంద్ర హోంశాఖమంత్రి శ్రీ అమిత్ షా సమీక్షించారు.


ప్రత్యేకించి కోవిడ్ – 19 ఆస్పత్రులు, ల్యాబ్స్, వ్యాక్సిన్లు, నిల్వచేసే కోల్డ్ స్టోరేజీల్లో సరిపడా పవర్ బ్యాకప్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో సమీక్షించారు.

పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై తుపాను ప్రభావాన్ని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి సమీక్షించారు.

ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

తుపాను ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మత్స్యకారులను వెనక్కు తీసుకొచ్చే చర్యలతోపాటు తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను కూడా శ్రీ అమిత్ షా సమీక్షించారు.

విద్యుత్, టెలికమ్యూనికేషన్ సేవల భద్రత, సమయానికి వాటి పునరుద్ధరణ ఏర్పాట్లపై దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ మంత్రి నొక్కి చెప్పారు.

తుపాను ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులకు కేంద్ర ప్రభుత్వంతోపాటు సంబంధిత విభాగాల నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందుతాయని శ్రీ అమిత్ షా భరోసా ఇచ్చారు.

Posted On: 24 MAY 2021 2:05PM by PIB Hyderabad

‘యాస్’ తుపాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో నిన్న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించగా.. దానికి కొనసాగింపుగా  ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఇవాళ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రిత్వశాఖలు, సంబంధిత విభాగాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించారు.

ముఖ్యంగా కోవిడ్ – 19 ఆస్పత్రులు, ల్యాబ్స్, వ్యాక్సిన్ నిల్వచేసే కోల్డ్ స్టోరేజీల్లో పవర్ బ్యాకప్ ఏర్పాట్లపై అమిత్ షా సమీక్షించారు. రవాణా వ్యవస్థపై తుపాను ప్రభావం నేపథ్యంలో మందులు, ఇతర వైద్య సామగ్రిని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాట్లు, వైద్య సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. తుపాను నష్టాన్ని వీలైనంతగా తగ్గించాలని, అవసరమైతే రోగులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పశ్చిమ తీర ప్రాంతంలో వైద్య సదుపాయాలపై ఎటువంటి ప్రభావం పడకుండా ముందుజాగ్రత్తగా తగిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై తుపాను ప్రభావంపై సమీక్షించిన కేంద్ర హోంశాఖ మంత్రి.. ముందుజాగ్రత్తగా రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇందుకోసం తుపాను ప్రభావిత ప్రాంతాలపై ప్రతికూల ప్రభావం పడకుండా సంబంధిత రాష్ట్రాలకు ఆక్సిజన్ రవాణా చేసే వాహనాలు ముందుగా చేరేలా చూడాలన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల భద్రతపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని అమిత్ షా పేర్కొన్నారు. అంతేకాకుండా హాస్పిటల్స్, ఇతర వైద్య సదుపాయాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా  విద్యుదుత్పత్తి కేంద్రాల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.  

సరుకు రవాణా నౌకలు, చేపల వేటకు వెళ్లిన పడవలు, పోర్టులు, చమురు కేంద్రాల భద్రతపైనా ఈ సమావేశం సందర్భంగా సమీక్షించారు. సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర ప్రాలిత ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి తీసుకురావడం, తీరప్రాంతాల ప్రజలను సమయానికి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, లోతట్టు ప్రాంతాలు, తుపాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే ఏర్పాట్లపైనా కేంద్ర హోంశాఖ మంత్రి సమీక్షించారు. తుపాను  ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు స్థానిక భాషల్లో మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, సామాజిక మాద్యమాలు, గ్రామ పంచాయతీల ద్వారా సందేశాలను పంపాలని సూచించారు. ఒడిశాలో అమలు చేస్తున్నట్లుగా హోంగార్డులు, వలంటీర్లు, ఎన్సీసీ, పౌరరక్షకుల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూడాలని అమిత్ షా సూచించారు.

 విద్యుత్ మరియు టెలికమ్యూనికేషన్ సేవల భద్రత మరియు సకాలంలో వాటి పునరుద్ధరణ అవసరమని కేంద్ర హోంమంత్రి నొక్కి చెప్పారు. ఇందుకోసం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, సరిపడా మానవ వనరులను, పరికరాలను, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని తుపాను ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలకు సూచించారు. తుపాను సమయంలో విద్యుత్ లైన్ల భద్రతపై దృష్టిసారించాలని.. ఏదైనా నష్టం జరిగితే సమయానికి పునరుద్ధరించేలా చూడాలని నొక్కి చెప్పారు. భారీ చెట్ల కొమ్మలను సకాలంలో కత్తిరించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. భారత వాతావరణ విభాగం చేసే ముందస్తు హెచ్చరికలను అనుసరించాలని తుపాను ప్రభావిత రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలకు సూచించారు.  

తుపాను ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం, సంబంధిత విభాగాల నుంచి అన్నిరకాల సహాయసహకారాలు అందుతాయని అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. తుపాను పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలో భారతదేశం తుపాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి పునరుద్ఘాటించారు.

తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ(MHA)  కంట్రోల్ రూమ్ 24x7 పనిచేస్తుంది. తుపాను ప్రభావిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవసరమైన సహాయసహకారాల కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చు. ఇండియన్ కోస్ట్గార్డ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.


24x7 కంట్రోల్ రూమ్ అని శ్రీ అమిత్ షా అన్నారు MHA లో పనిచేస్తుంది, ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సహాయం కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, నిఘా విమానాలు, హెలిక్యాప్టర్లు పరిస్థితిని ఏరియల్ వ్యూ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయన్నారు.

తుపాను పరిస్థితిని ఎదుర్కొనే విషయమై సమీక్ష సమావేశాన్నినిర్వహించినందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సంసిద్ధత ఏర్పాట్లపై ఒడిశా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తుపాను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. తుపాను పరిస్థితుల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి చెప్పారు. ముందుజాగ్రతగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకుగాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తపాను ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై తక్కువ లేదా అతితక్కువగా ఉంటుందని లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖ మంత్రికి తెలిపారు.
 
ఈ సమావేశంలో కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్, కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, విద్యుత్, టెలికమ్యూనికేషన్, రోడ్డు రవాణా, రహదారులు, పోర్ట్ షిప్పింగ్ జలమార్గాలు, చమురు సహజవాయువుల మంత్రిత్వశాఖల కార్యదర్శులతోపాటు ఎన్డీఎంఏ, సీఐఎస్సీ,  ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ ఐఎండి, కోస్ట్ గార్డ్ మరియు ఎన్డీఆర్ఎఫ్ ముఖ్య కార్యదర్శులు, సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇతర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

 

***



(Release ID: 1721569) Visitor Counter : 157