యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

క్రీడా పురస్కారాలు-2021 కోసం నామపత్రాలు ఆహ్వానించిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

Posted On: 20 MAY 2021 5:38PM by PIB Hyderabad

క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిని జాతీయ స్థాయిలో గుర్తించి, బహుమతులు ప్రదానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏటా క్రీడా పురస్కారాలను ప్రకటిస్తుంది. నాలుగేళ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడికి 'రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న' పురస్కారం, నాలుగేళ్లపాటు స్థిరంగా, అత్యుత్తమంగా రాణించివారికి 'అర్జున పురస్కారం', అంతర్జాతీయ క్రీడావేదికల్లో పతక విజేతలను తయారు చేసిన శిక్షకులకు 'ద్రోణాచార్య పురస్కారం', క్రీడల అభివృద్ధికి జీవితకాలంపాటు సేవ చేసినవారికి 'ధ్యాన్‌చంద్‌ పురస్కారాన్ని' కేంద్రం అందిస్తుంది. క్రీడల ప్రోత్సాహం, అభివృద్ధికి పాటుపడిన కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తులకు 'రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కారం' ప్రదానం చేస్తుంది. అంతర్‌ విశ్వవిద్యాలయాల పోటీల్లో అన్ని విభాగాల్లో కలిపి మొదటి స్థానంలో నిలిచిన విశ్వవిద్యాలయానికి 'మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జ్ఞాపిక'ను కేంద్రం అందజేస్తుంది.

    కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఏటా క్రీడా పురస్కారాల కోసం నామపత్రాలు/దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది ఇచ్చే క్రీడా పురస్కారాలకు నామపత్రాలు/దరఖాస్తులను ఆహ్వానించే ప్రకటనలను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ www.yas.nic.inలో ఉంచింది. భారత ఒలింపిక్‌ సంఘాలు/ భారత క్రీడా ప్రాధికార సంస్థ/ గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సంస్థలు/ క్రీడా ప్రోత్సాహక బోర్డులు/ రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కూడా సమాచారం అందించింది.

    అర్హులైన క్రీడాకారులు/ శిక్షకులు/ సంస్థలు/ విశ్వవిద్యాలయాల నుంచి నామపత్రాలు/దరఖాస్తులను మంత్రిత్వ శాఖ కోరుతోంది. surendra.yadav[at]nic[dot]in లేదా girnish.kumar[at]nic[dot]inకు ఈ-మెయిల్‌ ద్వారా నామపత్రాలు/దరఖాస్తులను పంపాలి. వచ్చే నెల 21వ తేదీ సాయంత్రం 5 గం. వరకు నామపత్రాలు/దరఖాస్తులను పంపేందుకు గడువుంది. ఈ గడువు తర్వాత వచ్చే నామపత్రాలు/దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
 

*******


(Release ID: 1720405) Visitor Counter : 187