రక్షణ మంత్రిత్వ శాఖ
శుక్రవారంతో ముగియనున్న ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ సేవలు
Posted On:
20 MAY 2021 2:04PM by PIB Hyderabad
భారత నౌకాదళానికి చెందిన తొలి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ అద్భుత శకం ముగింపునకు వచ్చింది. దేశ సేవ నుంచి ఆ నౌకను శుక్రవారం తప్పించనున్నారు. కషిన్ తరగతికి చెందిన ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్‌ను గత యూఎస్‌ఎస్‌ఆర్ నిర్మించింది. 1980 మే 4వ తేదీన ఆ నౌక నౌకాదళంలో చేరి, 41 ఏళ్లుగా అద్భుత సేవలు అందిస్తోంది. విశాఖ నావల్ డాక్‌యార్డులో జరిగే కార్యక్రమంలో ఈ నౌకను లాంఛనంగా విధుల నుంచి విరమింపజేస్తారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని, కార్యాలయ అధికారులు, నావికుల హాజరు మధ్య అతి ముఖ్యమైన చిన్న కార్యక్రమం నిర్వహిస్తారు.
ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌ను మైకోలైవ్‌లోని (ప్రస్తుత ఉక్రెయిన్) "61 కమ్యునార్డ్స్ షిప్‌యార్డు"లో నిర్మించారు. ఈ నౌకకు తొలుత పెట్టిన రష్యన్ పేరు ‘నాదేజ్నీ’. దీని అర్ధం 'ఆశ'. నౌక నిర్మాణాన్ని 1976 సెప్టెంబరు 11న ప్రారంభించి, 1977 సెప్టెంబరు 17న వినియోగంలోకి తీసుకొచ్చారు. జార్జియాలోని పోతిలో, 1980 మే 4న ఈ నౌక పేరును ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్‌గా మార్చారు. అప్పుడు యూఎస్‌ఎస్‌ఆర్‌లో భారత రాయబారిగా ఉన్న శ్రీ ఐ.కె.గుజ్రాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ తొలి కమాండింగ్ అధికారి కెప్టెన్ గులాబ్ మోహన్‌లాల్ హీరానందానీ. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో పశ్చిమ, తూర్పు నౌకాదళాలలో ఈ ఓడ అద్భుతమైన దేశ సేవ చేసింది.
భారత సముద్ర జలాల ప్రయోజనాలు, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి “రాజ్ కరేగా రాజ్‌పుత్” నినాదంతో, ఐఎన్ఎస్ రాజ్‌పుత్ సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తతో వ్యవహించారు. దేశ రక్షణ లక్ష్యాలతో చేపట్టిన అనేక ఆపరేషన్లలో ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ పాల్గొంది. ఐపీకేఎఫ్‌కు సాయం చేయడానికి శ్రీలంకకు చెందిన ఆపరేషన్ అమన్, శ్రీలంక తీరంలో గస్తీ విధుల కోసం ఆపరేషన్ పవన్, మాల్దీవుల పరిస్థితిని పరిష్కరించడానికి చేపట్టిన ఆపరేషన్ కాక్టస్, లక్షద్వీప్ వద్ద ఆపరేషన్ క్రోస్‌నెస్ట్ వంటివి వీటిలో కొన్ని. వీటికితోడు, అనేక ద్వైపాక్షిక, బహుళ దేశాల విన్యాసాల్లో ఈ నౌక పాల్గొంది. ఒక సైనిక రెంజిమెంట్ (రాజ్‌పుత్ రెజిమెంట్)కు అనుబంధంగా ఉన్న తొలి నౌక కూడా ఇదే.
తన 41 ఏళ్ల సేవల్లో 31 మంది కమాండింగ్ అధికారులను ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ చూసింది. చివరి కమాండింగ్ అధికారి 2019 ఆగస్టు 14న బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సూర్యాస్తమయం కాగానే 'నావల్ ఎన్‌సైన్ అండ్ కమిషనింగ్ పెన్నెంట్' చివరిసారిగా అవనతం చేస్తారు. సేవల నుంచి నౌక నిష్క్రమణకు ఇది గుర్తు.
***
(Release ID: 1720285)
Visitor Counter : 211