ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారి సమయంలో జాతీయ దూరవాణి-వైద్యసేవ (ఈ-సంజీవని) ద్వారా 50 లక్షలమందికిపైగా రోగులకు సేవాప్రదానం
ఈ వేదికనుంచి నిత్యం 1500 మందికిపైగా వైద్యులతో రోగులకు సుదూర సేవలు;
కొన్ని రాష్ట్రాల్లో ఏకాంత గృహవాస ప్రత్యేక ఓపీడీ సేవల దిశగా కృషి; చివరి
ఏడాది వైద్య విద్యార్థులతో రోగులకు కోవిడ్-19 నిర్ధరాణ పరీక్షలపై యోచన
Posted On:
13 MAY 2021 12:18PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రతిష్ఠాత్మక జాతీయ దూరవాణి-వైద్యసేవ ‘‘ఈ-సంజీవని’’కి శ్రీకారం చుట్టిన తర్వాత ఏడాదికిపైగా వ్యవధిలో 50 లక్షలమంది (అరకోటి)కి పైగా రోగులకు సేవలందాయి. తొలిసారి దేశవ్యాప్త దిగ్బంధం సందర్భంగా అవుట్ పేషెంట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో రోగి-డాక్టర్ మధ్య సుదూర సంప్రదింపు సేవలందించే ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్ నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం 31 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘ఈ-సంజీవని’ కింద సేవాప్రదానం కొనసాగుతోంది. ఈ మేరకు దేశం మొత్తంమీద నిత్యం సుమారు 40,000 మంది దీనిద్వారా ప్రమాదరహిత, స్పర్శరహిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందుకుంటున్నారు.
‘ఈ-సంజీవని’లో రెండు రకాలు:
కేంద్ర ప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్ (ఏబీ) పథకం’లో భాగంగా ‘కూడలి-శాఖల’ నమూనాలో దేశంలోని అన్ని ఆరోగ్య-శ్రేయో కేంద్రాల్లో (హెచ్‌డబ్ల్యూసీ) ‘ఈ-సంజీవని’ కింద డాక్టర్ల మధ్య ‘ఏబీ- హెచ్‌డబ్ల్యూసీ’ పేరిట దూరవాణి-వైద్య వేదిక ప్రారంభమైంది. ఈ వేదికను ఇప్పటిదాకా దేశవ్యాప్తంగాగల 18,000కుపైగా ఆరోగ్య-శ్రేయో కేంద్రాల్లో, 1,500 కూడళ్లలో అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2022 డిసెంబరు నాటికి 1,55,000 ‘హెచ్‌డబ్ల్యూసీ’లలో దూరవాణి-వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, 2019 నవంబరులో మొత్తం 22 రాష్ట్రాలు ‘ఈ-సంజీవని ఏబీ- హెచ్‌డబ్ల్యూసీ’ వేదికను ప్రారంభించాయి. ఈ డిజిటల్ నమూనా వినియోగంద్వారా ప్రత్యేక నిపుణులు-డాక్టర్ల ద్వారా దాదాపు 20 లక్షల మంది రోగులకు ఆరోగ్య సేవలు లభించాయి. ఈ సేవలకు సంబంధించి మొత్తం 21,000 మంది ప్రత్యేక నిపుణులు, వైద్యులు, సామాజిక ఆరోగ్యాధికారులకు ‘ఈ-సంజీవని ఏబీ- హెచ్‌డబ్ల్యూసీ’ వేదికద్వారా శిక్షణ ఇవ్వబడింది.
ఈ జాతీయ దూరవాణి-వైద్యసేవలో రెండోరకం ‘ఈ-సంజీవని ఓపీడీ’ కాగా, ఈ ఉచిత సేవ ప్రస్తుతం 28 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోంది. తదనుగుణంగా ‘ఈ-సంజీవని ఓపీడీ’ కింద 350 అవుట్ పేషెంట్ విభాగాలు ఏర్పాటు కాగా, వీటిలో 300 ప్రత్యేక నిపుణుల ‘ఓపీడీ’లు ఉన్నాయి. ‘ఈ-సంజీవని ఓపీడీ’ ద్వారా నేటివరకూ 30,00,000 మందికిపైగా రోగులు సేవలు అందుకున్నారు. సదరు డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం ద్వారా పౌరులకు వారి ఇళ్లవద్దనే సేవలు అందుబాటులోకి వచ్చాయి.
మహమ్మారి వ్యాప్తి ఆరంభమైనప్పటి నుంచి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అందిస్తున్న జాతీయ దూరవాణి-వైద్యసేవను సద్వినియోగం చేసుకోవడంలో అటు రోగులు, ఇటు వైద్యుల నుంచి విశేష సత్వర, విస్తృత స్పందన లభించింది. తద్వారా దేశంలో ఇప్పటికే విపరీత భారం మోస్తున్న ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాన వ్యవస్థకు ‘ఈ-సంజీవని’ ఒక సమాంతర ఆరోగ్య వ్యవస్థగా పనిచేస్తోంది. నిరుడు ఏప్రిల్ నెలలో ‘ఈ-సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించినపుడు కోవిడేతర ఆరోగ్య సేవలందించే విధానంగానే పరిగణించబడింది. కానీ, సదరు ఎలక్ట్రానిక్ ఆరోగ్యసేవ అనువర్తనంతో లభ్యమయ్యే ప్రయోజనాల దృష్ట్యా వివిధ రాష్ట్రాలు సత్వరం దీన్ని అందిపుచ్చుకున్నాయి. తదనుగుణంగా కోవిడ్-19 సంబంధిత ఆరోగ్య సేవలను కూడా అందించేందుకు ‘ఈ-సంజీవని’ కార్యక్రమం కింద వివిధ ప్రక్రియలు, కార్యకలాపాల ప్రణాళికను రూపొందించాయి. ఈ ప్రణాళిక మేరకు గృహనిర్బంధ చికిత్స పొందుతున్న కోవిడ్-19 రోగుల పర్యవేక్షణ, యాజమాన్యం కోసం ఆయా రాష్ట్రాలు ‘ఓపీడీ’లను ఏర్పాటు చేసుకున్నాయి.
ఏకాంత గృహవాస ప్రత్యేక ఓపీడీ సేవల దిశగా కొన్ని రాష్ట్రాలు కృషి చేస్తున్నాయి. ఈ మేరకు చివరి ఏడాది వైద్య విద్యార్థులద్వారా సుదూర విధానంలో రోగులకు కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కేసుల భారం పెరుగుతున్నందున ‘ఈ-సంజీవని ఓపీడీ’ని 24 గంటలూ వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ‘ఈ-సంజీవని’ వినియోగం ద్వారా రికార్డు స్థాయిలో 10 లక్షల సంప్రదింపు సేవలందించిన తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ప్రజలకు సేవలు అందించడం కోసం కేంద్ర రక్షణ శాక కూడా సాయుధ బలగాల వైద్యసేవలకు చెందిన అనుభవజ్ఞులను కూడా రంగంలో దింపింది.
ఇక ‘ఈ-సంజీవని’ సృష్టికర్తలు ప్రస్తుతం మొహాలీలోని ‘సి-డాక్’ కేంద్రంలో ‘ఈ-సంజీవని ఓపీడీ’ విశేషతకు మరో వినూత్న విశేషతను జోడించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ‘ఈ-సంజీవని ఓపీడీ’ వేదికనుంచే ‘జాతీయ ఓపీడీల’ నిర్వహణ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చే వీలుంది. తద్వారా దేశంలోని ఏ ప్రాంతంలోగల పౌరులకైనా వైద్యులు సుదూర ఆరోగ్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు, వైద్యుల సంఖ్యలో అసమతౌల్యం, కొరత వంటి సవాళ్లను పరిష్కరించడంలో ఈ వినూత్న ఆవిష్కరణ తోడ్పడనుంది. ‘ఈ-సంజీవని’ అమలు చేస్తున్న (సంప్రదింపుల సంఖ్య దృష్ట్యా) అగ్రస్థానంలోని 10 రాష్ట్రాల జాబితా ఇలా ఉంది: తమిళనాడు (1044446), కర్ణాటక (936658), ఉత్తర ప్రదేశ్ (842643), ఆంధ్రప్రదేశ్ (835432), మధ్యప్రదేశ్ (250135), గుజరాత్ (240422), బీహార్ (153957), కేరళ (127562), మహారాష్ట్ర (127550), ఉత్తరాఖండ్ (103126).
***
(Release ID: 1718288)
Visitor Counter : 277