పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
గ్రామీణ భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యల పై రాష్ట్రాలకు లేఖలు వ్రాసిన - కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ
గ్రామీణ వర్గాల్లో అవగాహన కోసం తగిన సమాచారం తో పటిష్టమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి
గ్రామ స్థాయిలో ఉపశమనం తో పాటు పునరావాసం కల్పించడానికి అందుబాటులో ఉన్న ఐ.టి. ఇన్ఫ్రా మరియు వివిధ పథకాలను ఉపయోగించుకోవాలని - రాష్ట్రాలకు సూచన
Posted On:
11 MAY 2021 4:29PM by PIB Hyderabad
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి వీలుగా, తగిన నివారణ చర్యలు తీసుకోవాలని, కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. కోవిడ్-19 ను అరికట్టే సమయంలో ఎదురయ్యే సవాళ్ళను పరిష్కరించి, తగిన నాయకత్వాన్ని అందించడానికి వీలుగా, పంచాయతీలు / గ్రామీణ స్థానిక సంస్థలను సన్నద్ధం చేసి, తగిన సౌకర్యాలు కల్పించాలని, మంత్రిత్వ శాఖ తన లేఖలో సూచించింది.
కోవిడ్ వ్యాప్తి, స్వభావం, నివారణ, ఉపశమన చర్యలతో పాటు, దురభిప్రాయాలు, అపనమ్మకాలను తొలగించడానికి వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా, గ్రామీణ వర్గాల్లో అవగాహన కల్పించడానికి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ( ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ), వైద్యులు, వైద్య సంస్థల సూచనలకు అనుగుణంగా, పూర్తి సమాచారం తో పటిష్టమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
ఎన్నికైన పంచాయతీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఆశా కార్మికులు వంటి, స్థానిక సమాజానికి చెందిన ఫ్రంట్-లైన్ వాలంటీర్లను ఈ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం చేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అదేవిధంగా, ఫింగర్ ఆక్సి-మీటర్లు, ఎన్-95 మాస్కులు, ఇన్‌ఫ్రా రెడ్ థర్మల్ స్కానింగ్ సాధనాలు, శానిటైజర్లు వంటి అవసరమైన రక్షణ వ్యవస్థల వినియోగాన్ని కూడా వీరికి తగిన విధంగా వివరించవచ్చు.
పరీక్షా కేంద్రాలు, టీకా కేంద్రాలు, వైద్యులు, ఆసుపత్రి పడకలు మొదలైన వాటి లభ్యతపై, ఎప్పటికప్పుడు, వాస్తవ సమాచారాన్ని అందించడానికి వీలుగా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అందుబాటులో ఉన్న పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, సాధారణ సేవా కేంద్రాలు మొదలైన ఐ.టి. మౌలిక సదుపాయాల ప్రభావాలను గ్రామీణ పౌరులకు తెలియజేయాలని, మంత్రిత్వ శాఖ, సూచించింది.
"ఆయా ప్రదేశాలకు అవసరమైన సంస్థాగత గ్రామ-స్థాయి సహాయాన్ని అందించడానికి పంచాయతీలను సన్నద్ధం చేయవచ్చు. అవకాశం ఉన్న ప్రదేశాల్లో, తమ ఇళ్ళను హోమ్-క్వారంటైన్ ప్రదేశాలుగా మెరుగుపరచవచ్చు. వీటిని లక్షణాలు లేని కోవిడ్ పాజిటివ్ రోగుల చికిత్స కోసం ఎక్కువగా వినియోగించవచ్చు. వీటికి అదనంగా, అత్యవసరమైన వారి కోసం, స్వస్థలాలకు తిరిగి వస్తున్న వలస కార్మికుల కోసం, క్వారంటైన్ / ఐసోలేషన్ కేంద్రాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయవచ్చు. ఆరోగ్య శాఖతో సంప్రదించి, సాధ్యమైనంత ఎక్కువగా అర్హులైన ప్రజలందరికీ టీకాలు వేయడానికి వీలుగా పంచాయతీలను సన్నద్ధం చేయవచ్చు.” అని మంత్రిత్వ శాఖ తన లేఖలో సూచించింది.
అవసరమైన వారికి గ్రామ స్థాయిలో ఉపశమనం తో పాటు, పునరావాసం కల్పించడానికీ, అలాగే, నిత్యావసర వస్తువుల సరఫరా, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ఉపాధి పనులు మొదలైన వాటి కోసం, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, అన్ని రాష్ట్రాలను కోరింది.
అత్యవసర పరిస్థితిని ఎదుర్కోడానికి వీలుగా, సమీప జిల్లా, ఉప జిల్లాలలో వైద్య సదుపాయాలతో సరైన అనుసంధానాలను ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. తద్వారా, అంబులెన్సులు, అధునాతన పరీక్ష, చికిత్స సౌకర్యాలు, మల్టీ-స్పెషాలిటీ వైద్య సంరక్షణ వంటి అత్యవసర సేవలు అవసరమైన వారికి, ఎక్కువ సమయం కోల్పోకుండా అందించడానికి అవకాశం ఉంటుంది.
కోవిడ్ మహమ్మారి తో పాటు సంబంధిత ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించి, గ్రామ పంచాయతీలు మరియు వారి కమిటీల పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం కోసం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, రెవెన్యూ, స్త్రీ, శిశు అభివృద్ధి, విద్యా శాఖలకు చెందిన అధికారులతో, బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయి లో, తగిన విధంగా ఒక అంతర్విభాగ పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ సునీల్ కుమార్, ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
*****
(Release ID: 1717903)
Visitor Counter : 173