వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆక్సిజన్ కోసం కేంద్రం బహుముఖ వ్యూహం!
లభ్యత, పంపిణీ, నిల్వ సదుపాయాల పెంపుదలే లక్ష్యాలు
ఎక్కువ ఉత్పత్తి, దిగుమతులు, పి.ఎస్.ఎ.ప్లాంట్ల ఏర్పాటు, కాన్సంట్రేటర్ల సేకరణతో పెరిగిన ఆక్సిజన్ లభ్యత
గణనీయంగా పెరిగిన ఆక్సిజన్ ట్యాంకర్ల సంఖ్య
రవాణా పర్యవేక్షణకు డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ
Posted On:
10 MAY 2021 5:41PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇటీవిల కాలంలో ఆక్సిజన్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో అనేక కీలక చర్యలు తీసుకుంది. ఆక్సిజన్ లభ్యతను, పంపిణీని క్రమబద్ధీకరించడం, ఆక్సిజన్ నిల్వకు సంబంధించి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఆక్సిజన్ సరఫరా వ్యవస్థపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఆక్సిజన్ ఉత్పత్తిని మెరుగుపరచడం, ఆక్సిజన్ సరఫరా, రవాణాను పటిష్టపరిచేందుకు ట్యాంకర్ల లభ్యతను పెంచడం, చివరి గమ్యస్థానం వరకూ ఆక్సిజన్ నిల్వ సదుపాయాన్ని మెరుగుపరచడం, ఆక్సిజన్ సేకరణకు సంబంధించిన నిబంధనలను సడలించడం వంటి చర్యలు కూడా తీసుకున్నారు.
ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆక్సిజన్ లభ్యతను పెంపొందించారు. ఇందుకోసం ప్రెషర్ స్వింగ్ అడ్సార్పన్షన్ (పి.ఎస్.ఎ.) ప్లాంట్లను ఏర్పాటు, విదేశాలనుంచి వైద్యపరమైన ద్రవీకృత ఆక్సిజన్ దిగుమతి, ఆక్సిజన్ కాంసన్సేటర్ల సేకరణ వంటి చర్యలు తీసుకున్నారు. ఆక్సిజన్ రవాణా వ్యవస్థను క్రమబద్ధం చేయడంలో భాగంగా, ట్యాంకర్ల లభ్యతను పెంచడానికి నైట్రోజెన్, ఆర్గోన్ ట్యాంకర్లను ఆక్సిజన్ రవాణాకు అనుగుణంగా తీర్చిదిద్దారు, ట్యాంకర్లను, కంటెయినర్లను ఇందుకోసం దిగుమతి చేసుకున్నారు. దేశీయంగా ట్యాంకర్ల తయారీని ప్రోత్సహించారు. తక్కువ వ్యవధిలో ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చేసేందుకు రైల్వేలు, విమానాల ద్వారా ట్యాంకర్ల సరఫరాను చేపట్టారు. మొత్తం సరఫరా ప్రక్రియపై పర్యవేక్షణకు ఆక్సిజన్ డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ (ఒ.డి.టి.ఎస్.)ను ఏర్పాటు చేశారు. ట్యాంకర్లను నడిపే డ్రైవర్ల లభ్యతను పెంచే ప్రయత్నంలో భాగంగా ఎం.హెచ్.వి. డ్రైవర్లకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చారు. ఆక్సిజన్ నిల్వలను మెరుగుపరిచేందుకు, ఆసుపత్రులవద్ద క్రయోజెనిక్ ట్యాంకర్ల సంఖ్యను, వాటి సామర్థ్యాన్ని కూడా పెంచారు. తద్వారా మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను సేకరిస్తున్నారు. కీలకమైన ఆక్సిజన్ సరఫరా వేగంగా జరిగేందుకు వీలుగా సాధారణ ఆర్థిక నిబంధనల సడలింపును చేపట్టారు. ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, నిల్వ, మౌలిక సదుపాయాల పరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను ఈ కింద చూడవచ్చు.
ఆక్సిజన్ ఉత్పత్తి పెంపు, సామర్థ్యం పెరుగుదల
2020 ఆగస్టులో ఆక్సిజన్ రోజువారీ ఉత్పత్తి 5,700 మెట్రిక్ టన్నులుండగా, 2021 మే నెలలో రోజువారీ ఉత్పత్తిని 9,446 మెట్రిక్ టన్నులకు పెంచారు. రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 6,817మెట్రిక్ టన్నులనుంచి, 7,314 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇదే కాలంలో సామర్థ్య వినియోగం 84శాతంనుంచి 129 శాతానికి పెరిగింది.
దేశ వ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ కు ఏర్పడిన డిమాండుకు తగినట్టుగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉక్కు కంపెనీలు కూడా ఎంతో కృషి చేశాయి. 2021వ సంవత్సరం మే నెల 4వ తేదీ నాటికి ఉక్కు ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేసిన ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ (ఎల్.ఎం.ఒ.) మొత్తం పరిమాణం 3,680.30 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఏప్రిల్ మధ్యలో సగటున 1,500నుంచి 1,700 మెట్రిక్ టన్నులుగా ఉన్న మొత్తం రోజువారీ ఎల్.ఎం.ఒ. ఏప్రిల్ 25వ తేదీనాటికల్లా 3,131.84 మెట్రిక్ టన్నులకు పెరిగింది. మే నెల 4వ తేదీకల్లా ఇది మరింత పెరిగి, 4,076.65 మెట్రిక్ టన్నులకు చేరింది.
పెరిగిన ఉత్పత్తి, డిమాండ్లకు అనుగుణంగా, దేశంలో ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ (ఎల్.ఎం.ఒ.) అమ్మకం కూడా బాగా పెరిగింది. 2021 మార్చిలో రోజువారీ అమ్మకం దాదాపు 1,300 మెట్రిక్ టన్నులు ఉండగా, మే నెల 6వ తేదీ నాటికి ఇది 8,920 మెట్రిక్ టన్నులకు పెరిగింది. కోవిడ్-19 వైరస్ మహమ్మారి తొలి ఉధృతి సందర్భంగా, 2020 సెప్టెంబరు 29నాటికి ఎల్.ఎం.ఒ. రోజువారీ గరిష్ట అమ్మకం 3,095 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ఆ తర్వాత ఈ విక్రయం ఐదు రెట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలాఖరున 1,559 మెట్రిక్ టన్నులున్న రోజువారీ అమ్మకం, ఈ ఏడాది మే నెల 3వ తేదీ నాటికి 8,000మెట్రిక్ టన్నులకు చేరింది.
ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపుదలకు ప్రణాళికలు
ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సమీప భవిష్యత్తులో గణనీయంగా పెంచేందుకు వీలుగా అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా, కర్ణాటక రాష్ట్రంలో ప్రతి రోజూ అదనంగా 70మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరగవచ్చని భావిస్తున్నారు.; చిన్న మధ్యతరహా పారిశ్రామిక రంగానికి చెందిన ఎయిర్ సపరేషన్ యూనిట్ నుంచి సరఫరాను పెంచారు; ఇక, రిఫైనరీలనుంచి ఆక్సిజన్ వాయువు సరఫరా వ్యవస్థతో కూడిన (11,950 పడకల) భారీ ఆసుపత్రులను, 3,850 పడకలకు సరఫరా చేయగలిగే విద్యుత్ ప్లాంట్లను, 8,100 పడకలకు సరఫరా చేయగలిగే ఉక్కు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసరం కాని పారిశ్రామిక ప్రయోజనాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంపై ఈ ఏడాది ఏప్రిల్ 22నుంచి నిషేధం విధించారు. దీనితో అదనంగా వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చింది. ఇక ఉక్కు రంగంలో ప్రతి రోజూ అదనంగా 630 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి జరిగేలా తయారీ సామర్థ్యాన్ని పెంచాలని ఆ రంగం సంకల్పించింది.
డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచేందుకు 1,594 పి.ఎస్.ఎ. ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పి.ఎం. కేర్స్ నిధి కింద కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ఏడాది మార్చిలో మంజూరైన 162 ప్లాంట్లు, రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) ద్వారా, పి.ఎం. కేర్స్ నిధి కింద 500 ప్లాంట్లు, పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ద్వారా చమురు గ్యాస్ కంపెనీల ఆధ్వర్యంలో దాదాపు వంద ప్లాంట్లు, ఆయా రాష్ట్రాలు సొంతంగా నిర్మించే ప్లాంట్లు ఈ కోవలోకి వస్తాయి. కొత్తగా నిర్మించ తలపెట్టిన 162 పి.ఎస్.ఎ. ప్లాంట్లలో 74 ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. మిగిలిన ప్లాంట్లను వచ్చే జూన్ నాటికి స్థాపించబోతున్నారు. ఇక పి.ఎం. కేర్స్ నిధి కింద ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో అదనంగా మంజూరైన 1,051 ప్లాంట్లు కూడా దశలవారీగా ఏర్పాటు కానున్నాయి. రాబోయే మూడు నెలల్లో ఇవి ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.
ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ (ఎల్.ఎం.ఒ.) దిగుమతి
విదేశాలనుంచి 50,000 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్ ను దిగుమతి చేసుకోనున్నారు. ఇందులో 5,800మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బట్వాడా, ఆర్డర్లకు సంబంధించి షెడ్యూలు ఇప్పటికే ఖరారైపోయింది. విదేశాలనుంచి ఆక్సిజన్ తెప్పించే వనరులను సాధనలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు కొటేషన్లను సేకరించారు. దాదాపు 3,500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ దిగుమతికి సంబంధించి 3 కొటేషన్లు అందాయి. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన వాటిని ఆమోదించారు. ఈ కొటేషన్లకు సంబంధించి రాబోయే 3నెలల్లో ఆక్సిజన్ బట్వాడా కానుంది. దీనికి తోడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఫ్రాన్స్ దేశాలనుంచి 2,285 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఒ. దిగుమతి అవుతోంది. ఇందులో కొంతభాగం ఇప్పటికే మన దేశం చేరుకుంది.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సేకరణ
పి.ఎం. కేర్స్ నిధి కింద లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సేకరణకు ఈ ఏడాది ఏప్రిల్ 27న ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీన ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ టెండర్లు జారీ అయ్యాయి. 2,500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరఫరా చేయగలమంటూ ఈ టెండర్ల ద్వారా సంసిద్ధత తెలిపారు. అలాగే, చమురు సహజవాయు సంస్థ (ఒ.ఎన్.జి.సి.) ప్రారంభించిన టెండరుకు మంచి స్పందన లభించింది. 50,000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరఫరా చేయగలమంటూ స్వదేశీ తయారీదార్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. 9,800 యూనిట్ల సరఫరాకు సంబంధించి ఆమోదం కుదిరింది. అందులో 4,800 కాన్సంట్రేటర్లను ఈ నెల 15వ తేదీన, 500 కాన్సంట్రేటర్లను ఈ నెల 27వ తేదీన బట్వాడా చేయనున్నారు. దీనికి అదనంగా 70వేలనుంచి 75వేల కాన్సంట్రేటర్లను సరఫరా చేయగలమంటూ బిడ్డర్లుగా 55 సంస్థలు ఆసక్తిని కనబరిచాయి. ఇందుకు సంబంధించిన ఆర్డర్ల ఖరారు ప్రక్రియ తుదిదశలో ఉంది.
ఆక్సిజన్ కేటాయింపు ప్రక్రియ
డిమాండుకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతిపదికన ఆక్సిజన్ వాయువును సరఫరా చేసేందుకు వీలుగా ఆక్సిజన్ కేటాయింపు ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ కేటాయింపునకు సంబంధించిన తొలి ఆర్డరు ఈ ఏడాది ఏప్రిల్ 15న జారీ అయింది. అయితే, ఇది మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలకే పరిమితమైంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తికి సంబంధించిన రెండవ ఉధృతి ఇతర రాష్ట్రాలకు కూడా ప్రబలడంతో ఇతర రాష్ట్రాలనుంచి కూడా ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిపోయింది. ప్రతి రాష్ట్రంలోనూ తలెత్తే కోవిడ్ యాక్టివ్ కేసులకు అనుగుణంగా సంబంధిత రాష్ట్రంలో ఆక్సిజన్ ఆవశ్యకతను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఫార్ములాను వినియోగిస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో అవసరానికి అనుగుణంగా ఆక్సిజన్ ను కేటాయించేందుకు గరిష్టస్థాయిలో కృషి జరుగుతోంది. ఆక్సిజన్ కేటాయింపును ఖరారు చేసేముందుగా, సంబంధిత రాష్ట్రంలో ఆసుపత్రి మౌలిక సదుపాయాలు, ఐ.సి.యు. పడకల వసతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
దేశంలో ఆక్సిజన్ పంపిణీని క్రమబద్ధం చేసేందుకు ఆక్సిజన్ కేటాయింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుతూ వస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ కేటాయింపు క్రియాశీలకంగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, తయారీదార్లు, ఇతర భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపులను కూడా ఆక్సిజన్ కేటాయింపు ప్రక్రియకు ప్రాతిపదికగా పరిగణిస్తున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలకు, దాన్ని వినియోగించుకునే రాష్ట్రాలకు మధ్య పొంతన కనిపించడం లేదు. అందువల్ల ఆక్సిజన్ కేటాయింపులో రాష్ట్రాల మధ్య సమాన ప్రాతిపదికను అనుసరించవలసి ఉంది. ఆక్సిజన్ ఉత్పత్తిలో మూడవ వంతు తూర్పు ప్రాంతంలో కేంద్రీకృతమైంది. డిమాండులో 60 శాతం ఉత్తర, దక్షిణ రాష్ట్రాలనుంచి ఉత్పన్నమవుతోంది. దీనితో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఆక్సిజన్ రవాణా చేసేందుకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆక్సిజన్ ఉత్పత్తి ప్రాంతాలు, అది చేరవలసిన గమ్యస్థానం వంటి వివరాలతో గరిష్ట స్థాయి రవాణా ఏర్పాట్లతో ఒక ప్రణాళిక రూపకల్పన పూర్తి చేశారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆక్సిజన్ తయారీ దార్లు, ఇతర భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపుల అనంతరం ఈ కార్యాచరణ ప్రణాళకను రూపొందించారు.
Zone
|
Production
|
Allocation
|
MT
|
%
|
MT
|
%
|
North
|
1,174
|
13%
|
2,897
|
33%
|
East
|
2,867
|
32%
|
1,035
|
12%
|
West
|
2,838
|
32%
|
2,688
|
30%
|
South
|
1,980
|
22%
|
2,239
|
25%
|
Total
|
8,859
|
100%
|
8,859
|
100%
|
ఆక్సిజన్ ట్యాంకర్ లభ్యతను పెంచడం –ట్యాంకర్లను మార్పుచేయడం, ట్యాంకర్ల దిగుమతి
ఆక్సిజన్ ట్యాంకర్ల లభ్యతను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం నైట్రోజెన్, ఆర్గాన్ ట్యాంకర్లను మార్పు చేయడం, వాటిని దిగుమతి చేసుకోవడం వంటి చర్యలు తీసుకున్నారు. 2020 మార్చిలో ట్యాంకర్ల సామర్థ్యం 12,480 మెట్రిక్ టన్నులు కాగా, ట్యాంకర్ల సంఖ్య 1,040గా ఉంది. ఇపుడు ట్యాంకర్ల సామర్థ్యం 23,056 మెట్రిక్ టన్నులకు, ట్యాంకర్ల సంఖ్య 1,681కి పెరిగింది. వాటిలో మార్పు చేసిన 408 ట్యాంకర్లు, దిగుమతి చేసుకున్న 101 ట్యాంకర్లు ఉన్నాయి. మొత్తం 1,105 నైట్రోజెన్, ఆర్గాన్ ట్యాంకర్లలో ఇప్పటివరకూ 408 ట్యాంకర్లను,.. ఆక్సిజన్ రవాణా చేసేవిధంగా మార్పు చేశారు. త్వరలో మరో 200 ట్యాంకర్లను కూడా ఇలా మార్పు చేయనున్నారు. 248 ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటున్నారు. వాటిలో 101 ట్యాంకర్లు ఇప్పటికే దిగుమతి అయ్యాయి. మరో 58 ట్యాంకర్లు రానున్న పది రోజుల్లో దిగుమతి కానున్నాయి. వీటికి తోడు మరో వంద ట్యాంకర్లను స్వదేశీయంగానే తయారు చేస్తున్నారు.
వ్యవధిని తగ్గించేందుకు రైల్వేలు, విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా
ఆక్సిజన్ ట్యాంకర్లను దూర ప్రాంతాలకు రవాణా చేసేందుకు రైల్వేలను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకూ రైల్వేలు, దాదాపు 4,200 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ (ఎల్.ఎం.ఒ.) ను 248కి పైగా ట్యాంకర్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా చేశాయి. ఇప్పటికే 68 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్.లు తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ నెల 9వ తేదీ సాయంత్రానికి 293 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు చేరింది. అలాగే, 1,230 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి, 271 మెట్రిక్ టన్నులు మధ్యప్రదేశ్ కు, 555 మెట్రిక్ టన్నులు హర్యానాకు, 123 మెట్రిక్ టన్నులు తెలంగాణకు, 40 మెట్రిక్ టన్నులు రాజస్థాన్ కు, 1,679 మెట్రిక్ టన్నులు ఢిల్లీకి రైల్వేల ద్వారా చేరింది.
రవాణా సమయం తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఖాళీ ట్యాంకర్లను యుద్ధ విమానాల ద్వారా రవాణా చేశారు. ఇలా 5,505 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 282 ట్యాంకర్లను ఈ పద్ధతిలో రవాణా చేశారు. ఆ తర్వాత దేశీయ రూట్లలో ఆక్సిజన్ ను ఈ ట్యాంకర్ల ద్వారా రవాణా చేశారు. 1,293 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కూడిన 75 కంటెయినర్లను భారతీయ వైమానిక దళం విమానాల ద్వారా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నారు. దీనికి అదనంగా, 1,252 ఆక్సిజన్ సిలిండర్లను, 3 ఆక్సిజన్ ఉత్పాదకన ప్లాంట్లను వైమానిక దళ విమానాల ద్వారా దిగుమతి చేసుకున్నారు.
ఆక్సిజన్ డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ(ఒ.డి.టి.ఎస్.)
దేశంలో ఆక్సిజన్ రవాణాకు పట్టే వ్యవధిని వాస్తవ ప్రాతిపదికన తెలుసుకునేందుకు వెబ్ ఆధారంగా, యాప్ ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ (ఒ.డి.టి.ఎస్.) ప్రారంభించారు. ఆక్సిజన్ కేటాయింపు ఆర్డర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్లాంట్లకు అందజేసే సమాచారం, ప్లాంట్లనుంచి ఆక్సిజన్ పంపిణీ చేసే సమాచారం, ప్లాంట్లనుంచి వివిధ రాష్ట్రాలకు సరఫరా అయ్యే సమాచారం ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుంది. ఈ-వేబిల్, జి.పి.ఎస్., డ్రైవర్ మెబైల్ నంబర్ (సిమ్), ఫాస్టాగ్ వంటి అంశాలతో సమీకృతం చేస్తూ ఈ వ్యవస్థను రూపొందించారు. ఆక్సిజన్ రవాణా వాహనాలు నేరుగా గమ్యం చేరేందుకు, అనవసర జాప్యాలను నివారించేందుకు ఒ.డి.టి.ఎస్. ఉపకరిస్తుంది. దీనికి తోడు, ఈ వ్యవస్థను సమన్వయం చేసేందుకు వర్చువల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా,.. ఆరోగ్య, రైల్వేశాఖలు, రహదారులు, ఉక్కు శాఖల అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు ఆక్సిజన్ రవాణాను పర్యవేక్షిస్తారు. అలాగే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు కూడా ఈ వ్యవస్ధను పర్యవేక్షించేందుకు వీలు కల్పించారు. ఆక్సిజన్ రవాణాను నిర్విరామంగా పర్యవేక్షించేందుకు, రవాణాలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు ఈ కంట్రోల్ రూమ్ వ్యవస్థ దోహదపడుతుంది.
ట్యాంకర్ల నడపడంలో డ్రైవర్లకు శిక్షణ
ఆక్సిజన్ ట్యాంకర్లను సరిగా నడిపేందుకు వీలుగా 2,500మంది డ్రైవర్లకు శిక్షణ కల్పిస్తున్నారు. డ్రైవర్లకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్.ఎస్.డి.సి.), లాజిస్టిక్ రంగపు నైపుణ్య మండలి (ఎల్.ఎస్.ఎస్.సి.) ఈ శిక్షణ ఇస్తున్నాయి. ఆక్సిజన్ రవాణాను నిరాటంకంగా సాగించాలంటే నైపుణ్యం కలిగిన డ్రైవర్లు అవసరం. ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ రవాణాకు, ప్రమాదకర రసాయనాల నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి, తగిన శిక్షణ, నైపుణ్యంతో పాటు, హెచ్.ఎ.జెడ్. కార్గో లైసెన్సు కలిగిన డ్రైవర్లను మాత్రమే అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు అనుసరించదగిన శిక్షణా మాడ్యూల్ ను ఇంగ్లీషు, హిందీ భాషల్లో రూపొందించే అంశంపై ఎన్.ఎస్.డి.సి., ఎల్.ఎస్.ఎస్.సి. సంస్థలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. శిక్షణ కోసం 20మంది ట్రెయినర్లను కూడా గుర్తించారు. అంత క్రియాశీలకంగా లేని డ్రైవర్లకోసం ఆన్ లైన్ ద్వారా పునశ్చరణ తరగతులను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లతో సహా డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించేందుకు 73 ప్రాంతాలను గుర్తించారు.
ఆక్సిజన్ నిల్వ సదుపాయం పెంపుదల–క్రయోజెనిక్ ట్యాంకులు
ఆసుపత్రి వద్ద ఆక్సిజన్.ను నిల్వ ఉంచే క్రయోజెనిక్ ట్యాంకుల సంఖ్యను పెంచారు. గత ఏడాది మార్చిలో ఇవి 609 ఉండగా వాటి సంఖ్యను తాజాగా 901కి పెంచారు. మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతను కూడా గణనీయంగా పెంచారు. గత ఏడాది మార్చిలో 4.35 లక్షలుగా ఉన్న సిలిండర్ల సంఖ్యను 2021 మే నాటికి 11.19 లక్షలకు పెంచారు. డిమాండ్ అంచనాలకు అనుగుణంగా అదనంగా 3.35 లక్షల సిలిండర్లను సేకరించే ప్రక్రియ కూడా సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీకల్లా అదనంగా 1,27,000 సిలిండర్లకోసం ఆర్డర్లు పెట్టారు. పి.ఎం. కేర్స్ నిధి కింద డి.ఆర్.డి.ఒ. 10,00,000 ఎన్.ఆర్.ఎం. వాల్వులను సేకరిస్తోంది. వినియోగంలో ఆక్సిజన్ వృథా కాకుండా అరికట్టేందుకు ఇవి దోహదపడతాయి.
కీలకమైన సరఫరాల కోసం చర్యలు
కోవిడ్ చికిత్సా నిర్వహణలో భాగంగా ఆక్సిజన్ సరఫరా ప్రక్రియలో కీలకమైన సరఫరాలు సజావుగా జరిగేలా చూసేందుకు సాధారణ ఆర్థిక నిబంధనలను (జి.ఎఫ్.ఆర్.ను) సడలించారు. మరిన్ని భాగస్వామ్య వర్గాలకు ప్రమేయం కల్పించేలా, వేగంగా ఆక్సిజన్ సేకరణ ప్రక్రియ జరిగేలా చూసేందుకు ఆంక్షలతో కూడిన నిబంధనలన్నింటినీ తొలగించి వేశారు. కీలకమైన కోవిడ్ చికిత్సకోసం జరిగే సేకరణలకోసం వందశాతం అడ్వాన్స్ చెల్లింపును ఆమోదించారు. సరఫరామార్కెట్ నిబంధనలు సహకరించని చోట నామినేషన్ ప్రాతిపదికన ఆక్సిజన్ సేకరణ ప్రక్రియ జరిపేందుకు ఆమోదం తెలిపారు.
******
(Release ID: 1717558)
Visitor Counter : 218