ఆయుష్

దేశవ్యాపితంగా ఆయుష్ 64 మరింతగా అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్న ఆయుష్ మంత్రిత్వశాఖ


తేలికపాటి నుండి మితమైన కోవిడ్ 19 కేసులకు చికిత్స చేయడానికి వనమూలికలతో తయారైన ఆయుష్ 64 తోడ్పడుతుందని క్లినికల్ పరీక్షల్లో వెల్లడి

Posted On: 03 MAY 2021 4:50PM by PIB Hyderabad

శతాబ్ద కాలంలో దేశం కోవిడ్ -19 రూపంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సమస్యను పరిష్కరించే దిశలో ఆయుష్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు కీలకంగా మారాయి. గత కొన్ని వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే విధంగా వేగంగా పెరుగుతున్న సమయంలో వ్యక్తులు, వైద్యులు ఆయుష్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. 

ఈ దిశలో కోవిడ్-19 చికిత్స కోసం వనమూలికలతో తయారుచేసిన ఆయుష్-64 అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మలేరియా నివారణకు 1980లో ఆయుష్-64ని అభివృద్ధి చేశారు. దీనిని ఔషధ ప్రమాణాలు, నియంత్రణలకు లోబడి అభివృద్ధి చేశారు. దీనిని తేలికపాటి నుంచి మితమైన కోవిడ్ కేసులకు చికిత్స అందించడానికి ఏ మేరకు ఉపయోగించవచ్చునన్న అంశంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సిఎస్ఐఆర్), వైద్య కళాశాలలు ఇతర పరిశోధనా సంస్థలతో కలసి  ఆయుర్వేద శాస్త్రాల కేంద్ర పరిశోధనా మండలి (సిసిఆర్ఎఎస్) పరిశోధనలను నిర్వహించింది. ప్రముఖ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సాగిన ఈ పరిశోధనల్లో ఆయుష్ 64 యాంటీవైరల్, ఇమ్యూన్-మాడ్యులేటర్ మరియు యాంటిపైరేటిక్ లక్షణాలు కలిగి ఉందని వెల్లడయ్యింది. దీనిని లక్షణం లేని, తేలికపాటి మరియు మితమైన కోవిడ్-19 కేసుల చికిత్స కోసం ఉపయోగించవచ్చునని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పరిశోధనల నివేదికల ఆధారంగా ఈ మందును కోవిడ్-19 చికిత్స కోసం వినియోగించడానికి అనుమతించాలని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీనికి సంబందించి 2021 ఏప్రిల్ 29వ తేదీన మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

ఆయుష్-64 దేశంలోని అన్ని ప్రాంతాలల్లో కావలసిన పరిమాణంలో లభించేలా చూడడానికి ఆయుష్ మంత్రిత్వశాఖ చర్యలను అమలు చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ మందికి ఆయుష్-64ను అందుబాటులోకి తేవడానికి దీని ఉత్పత్తిని ఎక్కువ చేయాలనీ నిర్ణయించారు. పెద్ద మొత్తంలో వాణిజ్య సరళిలో ఆయుష్-64ని ఉత్పత్తి చేయడానికి సిసిఆర్ఎఎస్ మరియు నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ( ఎన్ ఆర్ డిసి ) ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఆయుష్-64ని తేలికపాటి నుంచి ఒక మోస్తరు కోవిడ్ లక్షణాలు వున్నవారికి చికిత్స ఇవ్వడానికి వినియోగించాలని సూచిస్తూ రాష్ట్రాల్లో లైసెన్సులను జారీ చేసే అధికారులకు సమాచారం అందించింది.  

ఆయుష్-64 ఉత్పత్తిని ఎక్కువ చేసి దీనిని దేశంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొని రావడానికి ఔషధ కర్మాగారాలకు అనుమతులు మంజూరు చేయాలని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆసక్తి కలిగిన సంస్థలు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం సిసిఆర్ఎఎస్, ఎన్ ఆర్ డిసి లను సంప్రదించాలని ఆయుష్ మంత్రిత్వశాఖ కోరింది. ఆయుష్ -64 తయారీలో  మందుల తయారీదారులకు సిసిఆర్ఎఎస్ సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. డ్రగ్స్, కాస్మటిక్స్ రూల్స్ 1945నిబంధనలకు లోబడి ఉండే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి లైసెన్సులను మంజూరు చేయడానికి రాష్ట్రాల అధికారులు చర్యలు తీసుకుంటారు. 

ఇప్పటికే పనిచేస్తున్న ఆయుష్ వ్యవస్థగా గుర్తింపు పొందిన జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆయుష్-64 ఉత్పత్తి, సరఫరా, అందుబాటు అంశాలలో తమ వంతు సహకారాన్ని అందిస్తాయని ఆశిస్తున్నారు. ఆయుర్వేద, యోగా ప్రక్రియల భాగంగా  జాతీయ క్లినికల్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం ఆయుష్ -64 వాడకాన్ని రాష్ట్ర ఆరోగ్య అధికారులు ప్రోత్సహించవలసి ఉంటుంది.

***



(Release ID: 1715827) Visitor Counter : 202