ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కోసం తొలి విడత మొత్తం రూ.8873.6 కోట్లు ముందుస్తుగా విడుదల
ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో 50 శాతం మొత్తాన్ని కొవిడ్ నియంత్రణ చర్యల కోసం రాష్ట్రాలు ఉపయోగించుకునే వెసులుబాటు
Posted On:
01 MAY 2021 8:55AM by PIB Hyderabad
2021-22 ఏడాదికిగాను, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కోసం, సాధారణ పద్ధతిలో విడుదలయ్యే కేంద్ర వాటాలోని తొలి విడత మొత్తం ముందుగానే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పంపిణీగా విడుదలయింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు, కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఈ నిధులను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.8873.6 కోట్లు అందాయి.
సాధారణంగా, ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు జూన్‌లో ఎస్‌డీఆర్‌ఎఫ్ తొలి విడత మొత్తాన్ని కేంద్రం కేటాయిస్తుంది. ఈసారి సాధారణ విధానాన్ని సడలించి ఎస్‌డీఆర్‌ఎఫ్ వాటాను ముందుగానే అందించింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన మొత్తానికి వినియోగ ధృవీకరణ పత్రాల కోసం ఎదురుచూడకుండా ఈ మొత్తాన్ని కేంద్రం విడుదల చేసింది. ఈ మొత్తంలో 50 శాతం వరకు, అంటే రూ.4436.8 కోట్లను కొవిడ్ నియంత్రణ చర్యల కోసం రాష్ట్రాలు ఉపయోగించవచ్చు.
ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ, వెంటిలేటర్లు, వాయు శుద్ధి యంత్రాలు, ఆంబులెన్స్ సేవల బలోపేతం, కొవిడ్ ఆసుపత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాలు, వినియోగ వస్తువులు, థర్మల్ స్కానర్లు, వ్యక్తిగత రక్షణ సామగ్రి, పరీక్ష కేంద్రాలు, పరీక్ష కిట్లు, కంటైన్‌మెంట్ జోన్లు సహా కొవిడ్ నియంత్రణ సంబంధిత చర్యల కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో 50 శాతాన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు.
***
(Release ID: 1715396)
Visitor Counter : 253