ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 స్థితి, కట్టడి ఇతర ప్రజారోగ్య అంశాలపై అన్ని కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షించిన కేంద్ర హోం కార్యదర్శి


పరీక్షలు, సదుపాయాలను ఎక్కువ చేయాలని , కంటెయిన్‌మెంట్ జోన్ల పరిధిని ఎక్కువ చేసి, కొవిడ్ అనుగుణ ప్రవర్తనకు ప్రాధాన్యత ఇస్తూ, రాకపోకలపై ఆంక్షలు విధించాలని సూచన

రానున్న మూడు వారాలకు ముందుగానే ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రణాళిక రూపొందించాలని సలహా ఇచ్చిన కార్యదర్శి

Posted On: 20 APR 2021 3:33PM by PIB Hyderabad

కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్-19 స్థితి, కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలు, దీనికోసం అమలు చేయవలసిన కార్యాచరణపై కేంద్ర హోం శాఖ శ్రీ అజయ్ కుమార్ భల్లా కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ తో కలసి ఈ రోజు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు ( ఆరోగ్య) డాక్టర్ వికె పాల్ , డిహెచ్‌ఆర్,  డిజి ఐసిఎంఆర్ కార్యదర్శి డాక్టర్ బలరామ్ భార్గవ, అన్ని యుటిల పోలీసుల డిజిలు పాల్గొన్నారు.  

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య దేశవ్యాపితంగా గణనీయంగా పెరుగుతున్న అంశాన్ని సమావేశంలో హోంశాఖ కార్యదర్శి ప్రస్తావించారు. 2021 జనవరి ఒకటవ తేదీ వరకు రోజుకి  20,000 వరకు వున్న కేసుల సంఖ్య 2021 ఏప్రిల్ 15 నాటికి పది రెట్లు పెరిగిందని ( 2,00,000 పైగా కేసులు) ఆయన అన్నారు. కడచిన 11 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపు అయిందని అన్నారు. ఏప్రిల్ తొమ్మిదిన 1.31 లక్షల కొత్త కేసులు నమోదుకాగా ఏప్రిల్ 20వ తేదీన ఒక్కరోజే 2.73 లక్షల కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 

కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదవుతున్న కోవిడ్ కేసులు, వారంలో నిర్వహించిన పరీక్షలు, వారంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య, వారంలో గుర్తించిన కొత్త కేసులు, మరణాలు, ఆర్టీ పీసీఆర్, రాపిడ్ యాంటిజెన్ పరీక్షల వివరాలను సమావేశంలో చర్చించారు. 

పాజిటివ్ కేసుల నివారణకు అమలు చేస్తున్న చర్యలను, పాజిటివ్ తేలిన వారి కోసం అమలు చేస్తున్న చర్యలను ఆయా కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు వివరించారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తున్న వారి వల్ల తమ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని లడఖ్,జమ్మూ కాశ్మీర్,లక్ష దీవుల అధికారులు వివరించారు. ఇటీవలి పండుగ సందర్భాలలో షాపింగ్ చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రధాన భూభాగానికి వెళ్లడం వల్ల 2021 ఏప్రిల్ 14 తరువాత ఇక్కడ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే అనేక కేంద్రపాలిత ప్రాంతాలు రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. దీవులు కలిగి వున్న కేంద్రపాలిత ప్రాంతాల్లో దీవుల మధ్య జరిగే రాకపోకలపై ఆంక్షలను విధించాయి, టీకాల కార్యక్రమాన్ని మరింత ఎక్కువగా అమలు చేయడానికి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చండీఘర్ అధికారులు తెలిపారు.  90% మంది రోగులు హోం ఐసొలేషన్ లో వుంటున్నారని వీరిని మొబైల్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయని అధికారులు వివరించారు. 

తమ వద్ద పడకల కొరత ఉందని, వీటి సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వ సౌకర్యాలను, ఇటీవల డీఆర్డీఓ కొత్తగా ప్రారంభించిన ఆస్పత్రిని వినియోగిస్తూ చర్యలను తీసుకుంటున్నామని ఢిల్లీ అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచే అంశంలో తమకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలు రావడానికి పడుతున్న సమయాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. 

వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన తరువాత కోవిడ్ పై మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు హోం శాఖ కార్యదర్శి సూచించారు. రాకపోకలపై ఆంక్షలను విధించడంతో పాటు, ఎక్కువ మంది ఒకచోట గుమికాకుండా చూడడానికి, మార్కెట్లు లాంటి ప్రాంతాల్లో పని సమయాలను నిర్దేశించడం లాంటి చర్యలను అమలు చేయాలని ఆయన సూచించారు.  ఆర్టీ పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచి, కట్టడి ప్రాంతాల పర్యవేక్షణకు రాట్ వినియోగాన్ని ఎక్కువ చేయాలనీ సూచించారు. పరీక్షల నిర్వహణ, ఆసుపత్రులలో సౌకర్యాలపై తక్షణం సమీక్షించాలని ఆయన అన్నారు. 

పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ వి.కె. పాల్ కోవిడ్ కట్టడి అంశంలో రానున్న మూడు వారాలు కీలకంగా వుంటాయని అన్నారు. రానున్న మూడు వారాల్లో అమలు చేయవలసిన వ్యూహంపై ముందుగానే ప్రణాళికను రూపొందించుకోవాలని ఆయన కేంద్రపాలిత అధికారులకు సూచనలు జారీ చేశారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను గుర్తించడానికి సర్వే నిర్వహించాలని అన్నారు. కోవిడ్ కట్టడికి రూపొందించిన ప్రణాళికను సమర్ధంగా అమలు చేయాలని అన్నారు. లడఖ్  యుటి లోకి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కార్మికులను నియంత్రించడంతో పాటు వారిని పర్యవేక్షించే నియంత్రణనుఅమలు చేయాలని అన్నారు. ద్వీపాలను పెద్ద కంటైనర్ జోన్లుగా మార్చవచ్చని ఆయన సూచించారు.

కోవిడ్ నియంత్రణ నిర్వహణలోకేంద్రపాలిత ప్రాంతాలు చేసే అన్ని ప్రయత్నాలకు తమ శాఖ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని కేంద్ర హోం కార్యదర్శి హామీ ఇచ్చారు.

***



(Release ID: 1712926) Visitor Counter : 160