ప్రధాన మంత్రి కార్యాలయం
ఏప్రిల్ 14న భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం 95వ వార్షికోత్సవం.. ఉప-కులపతుల జాతీయ సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌పై శ్రీ కిషోర్ మక్వానా రచించిన
పుస్తకాలు ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరణ
Posted On:
13 APR 2021 11:27AM by PIB Hyderabad
భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం 95వ వార్షికోత్సవంతోపాటు ఉప-కులపతుల జాతీయ సదస్సు సందర్భంగా 2021 ఏప్రిల్ 14న ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌పై శ్రీ కిషోర్ మక్వానా రచించిన నాలుగు పుస్తకాలను కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు. గుజరాత్ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అహ్మదాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఏఐయూ సమావేశం... ఉప-కులపతుల జాతీయ సదస్సుల గురించి...
దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన ప్రధాన అగ్రశ్రేణి సంస్థ అయిన భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) 2021 ఏప్రిల్ 14-15 తేదీల్లో తమ 95వ వార్షికోత్సవం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది సాధించిన విజయాలతోపాటు తమ ఆర్థిక వ్యవహారాల నివేదికను కూడా సమర్పించనుంది. అలాగే రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే కార్యకలాపాల గురించి వివరిస్తుంది. మరోవైపు ఏడాది పొడవునా నిర్వహించిన మండళ్ల స్థాయి ఉప-కులపతుల సమావేశాల్లో చర్చలు, సిఫారసులను ఈ సమావేశం వేదికగా సభ్యులకు వివరించనుంది. మరోవైపు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి దిగ్గజాల ప్రోత్సాహంతో 1925లో ఏఐయూ ఆవిర్భవించిన నేపథ్యంలో 96వ ఆవిర్భావ స్మారక దినోత్సవాన్ని కూడా ఈ సమావేశంలో భాగంగా నిర్వహిస్తారు.
భారత దేశంలో ఉన్నత విద్యా పరివర్తన దిశగా ‘జాతీయ విద్యావిధానం-2020 అమలు’ ఇతివృత్తంగా ఉప-కులపతుల జాతీయ సదస్సును కూడా ఇదే సందర్భంగా నిర్వహిస్తున్నారు. జాతీయ విద్యావిధానం-2020ని ఇటీవలే ఆవిష్కరించిన నేపథ్యంలో దీని అమలు వ్యూహాలకు రూపకల్పన చేయడం ఈ సదస్సు లక్ష్యం. ఈ మేరకు విద్యా విధానంలోని ప్రాథమిక భాగస్వాములు, విద్యార్థుల ప్రయోజనాలకు తగినట్లుగా దీన్ని సమర్థంగా అమలు చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందనుంది.
ఆవిష్కరించనున్న పుస్తకాల గురించి...
బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేడ్కర్ జీవితంపై శ్రీ కిషోర్ మక్వానా రచించిన కింది నాలుగు పుస్తకాలను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించనున్నారు:
“డాక్టర్ అంబేడ్కర్ జీవన్ దర్శన్”
“డాక్టర్ అంబేడ్కర్ వ్యక్తి దర్శన్”
“డాక్టర్ అంబేడ్కర్ రాష్ట్ర దర్శన్”
“డాక్టర్ అంబేడ్కర్ ఆయమ్ దర్శన్”
***
(Release ID: 1711587)
Visitor Counter : 157
Read this release in:
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam