ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కరోనాపై మంత్రుల గ్రూపు 24వ భేటీ!


ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సమావేశం

“149 జిల్లాల్లో వారంరోజులుగా కేసుల్లేవు

14 రోజులుగా 8 జిల్లాలకు కోవిడ్ నుంచి విముక్తి

21 రోజులుగా 3 జిల్లాల్లో, 28 రోజులుగా 63 జిల్లాల్లో నమోదు కాని కేసులు”

టీకాల ఉత్పత్తి సామర్థ్యం పెంచే చర్యలపై మంత్రులకు వివరణ

Posted On: 09 APR 2021 2:31PM by PIB Hyderabad

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు న్యూఢిల్లీలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అధ్యక్షత వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్ దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి, రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే,  హోమ్ శాఖ సహాయ మంత్రి  నిత్యానంద్ రాయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నీతీ ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వినోద్ కె. పాల్ వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు.  

https://ci3.googleusercontent.com/proxy/X5KDWK-k0R8VyZk1tDtml-j7vrIa3xZMY0ezDglloJq_fkwlT0P87gI_M7XC_EFx-U53ZbBKAbmBM-_aOA-jP_SFoxeN-H8jQzOiVxbnDTDJ6MMcBWqcDjAjnw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00139KS.jpg

కోవిడ్ వైరస్ పై పోరాటంలో భాగంగా ప్రపంచంలోనే అతి భారీ స్థాయిలో దేశవ్యాప్తంగా చేపట్టిన టీకా కార్యక్రమాన్ని గురించి ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. “60ఏళ్లకు మించిన మొత్తం 3కోట్ల మందికిపైగా వ్యాక్సీన్లను అందించాం. ఈ రోజు ఉదయం 9గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం 9.43కోట్ల మందికి కోవిడ్ టీకా అందించాం. వ్యాక్సీన్ మైత్రి పేరిట చేపట్టిన కార్యక్రమం ద్వారా ప్రపంచ సమాజానికి కూడా భారత్ టీకాలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా 85 దేశాలకు 6.45కోట్ల డోసుల వ్యాక్సీన్ ను ఎగుమతి చేశాం. వాణిజ్య కాంట్రాక్టుల ద్వారా 25 దేశాలకు 3.58కోట్ల డోసుల వ్యాక్సీన్ ను సరఫరా చేశాం. గ్రాంట్స్ కింద 44దేశాలకు కోటీ 4లక్షల డోసులు, కోవాక్స్ కింద 39 దేశాలకు కోటీ 82 లక్షల డోసులు సరఫరా చేశాం.” అని ఆయన వివరించారు. దేశంలోని 149 జిల్లాల్లో గత ఏడు రోజుల్లో తాజాగా కోవిడ్ కేసులేవీ నమోదు కాలేదని అన్నారు. గత 14 రోజుల్లో 8జిల్లాలపరిధిలో కొత్త కోవిడ్ కేసులు లేవని అన్నారు. 3 జిల్లాల్లో గత 21 రోజులుగా, 63 జిల్లాల్లో గత 28 రోజులుగా కొత్తగా కోవిడ్ కేసులు నమోదు కాలేదని మంత్రి చెప్పారు.

   ఇప్పటివరకూ నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల వివరాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల పరిస్థితిని గురించి మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. “ఇప్పటివరకూ మొత్తంగా 25,71,98,105 కరోనా పరీక్షలు నిర్వహించాం. గత 24 గంటల్లో 13,64,205 పరీక్షలు చేశాం. దేశంలో మొత్తం 2,449 లేబరేటరీలు పరీక్షలకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో1,230 ప్రభుత్వం ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించే లేబరేటరీలు కాగా, 1,219 ప్రైవేటు లేబరేటరీలు.” అని చెప్పారు. కోవిడ్ నియంత్రణకోసం ప్రభుత్వం తగినంత స్థాయిలో ఆసుపత్రి మౌలిక సదుపాయాలన్నింటినీ వినియోగించిందని, 2,084 ఆసుపత్రులను కోవిడ్ కేసుల కోసమే ప్రత్యేకంగా కేటాయించిందని అన్నారు. వీటిలో 89 ఆసుపత్రులను కేంద్రం ఆధ్వర్యంలో, 1,995 ఆసుపత్రులు రాష్ట్రాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని అన్నారు. కోవిడ్ బాధితులకోసం మొత్తంగా 4,68,974 పడకలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీటిలో 50,408 ఐ.సి.యు. పడకలు కాగా, 1,54,993 ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలని చెప్పారు. వీటన్నిటికీ తోడుగా కోవిడ్ కేసులకోసమే ప్రత్యేకంగా 4,043 (కేంద్రం: 85,.. రాష్ట్రాలు: 3,958) ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో మొత్తంగా 3,57,096 కోవిడ్ పడకలున్నాయని, వీటిలో  2,31,462 ఐసోలేషన్ పడకలు, 25,459 ఐ.సి.యు. పడకలు, 1,00,175 ఆక్సిజన్ సదుపాయం కలిగిన పడకలు ఉన్నాయన్నారు. మొత్తం 12,673 క్వారంటైన్ కేంద్రాలను 9,313 కోవిడ్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీటిలో 28 కోవిడ్ కేర్ సెంటర్లను కేవలం ఢిల్లీలోనే ఏర్పాటు చేశామన్నారు.  ఢిల్లీలోని కోవిడ్ కేర్ సెంటర్లలో మొత్తం 9,421 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసిన వైద్య పరికరాల వివరాలను కూడా మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఆయా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు పంపిణీ చేసిన కృత్రిమ శ్వాస పరిరకరాలు (వెంటలేటర్లు), వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఇ. సూట్లు), ఎన్.95 మాస్కులు తదితర వివరాలను ఆయన వివరించారు.

https://ci3.googleusercontent.com/proxy/j94TN2w4umateDaTWCzLzSYA9Sk2DvdsF63XvSeTOcv3NciojP2WPCUirT0XQY7Zh0uPhG5zri8Jc0Tr3UJDmo3GSRCc5H9420HaeRxnIXo88abIQZQoEKk-vw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002X9VV.png

ఇటీవలి కాలంలో తీవ్రంగా పెరిగిన కేసులనుంచి కూడా భారతదేశం త్వరలోనే బయటపడగలదన్నారు. కోవిడ్ వైరస్ నియంత్రణ లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిర్వహణా పరమైన నిబంధనలు, వ్యక్తిగతంగా పాటించవలసిన కోవిడ్ నియమ నిబంధనలు అమలు చేయడంపై మరో సారి దృష్టిని కేంద్రీకరించడం ద్వారా ఈ సమస్యనుంచి విజయవంతంగా బయటపడగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పరిపాలనా అధిపతులతో ప్రధానమంత్రి జరిపిన చర్చలు ఈ విషయంలో మనకు స్ఫూర్తిదాయకం కావాలన్నారు.

  దేశంలో కోవిడ్ కేసులు భారీగా నమోదయ్యే 11రాష్ట్రాల పరిస్థితిని, తాజా సమాచారాన్ని జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్.సి.డి.సి.) డైరెక్టర్ డాక్టర్ సుజిత్ కుమార్ సింగ్ ఈ సమావేశంలో వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీనాటికి భారతదేశంలో ఏడు రోజుల వ్యవధిలో కేసుల వృద్ధి రేటు 12.93శాతంగా ఉందని, కేసుల విషయంలో ఇది అమెరికా, బ్రెజిల్ తర్వాతి స్థానమని అన్నారు. ఏప్రిల్ 8వ తేదీ గణాంకాల ప్రకారం దేశంలో ప్రతిరోజూ సగటున 5.37శాతం చొప్పున కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా మరణాల రేటు మాత్రం 1.28శాతానికి తగ్గిందని అన్నారు. ఇటీవల కేసుల పెరుగుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నమోదైనా జాతీయ స్థాయి రికవరీ రేటు 91.22శాతానికి తగ్గిందన్నారు.

   దేశంలో 54శాతం కేసులు, 65శాతం మరణాలు 11రాష్టాలనుంచే వస్తున్నాయని వివరించారు. గత 14 రోజుల్లో మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా మరణాలు (దేశంలోని మొత్తం మరణాల్లో 64శాతం) నమోదయ్యాయన్నారు. గత ఫిబ్రవరి నుంచి సమస్యాత్మకమైన 11 రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో కేసులు పెరిగాయని, వీటిలో ఎక్కువ మంది బాధితులు 15నుంచి 44 సంవత్సరాల మధ్యవారే ఉన్నారని, 60ఏళ్లు అంతకంటే ఎక్కువగా వయస్సున్న వారిలోనే మెజారిటీ మరణాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్  రాష్ట్రాల్లో ఎక్కువ శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, మహారాష్ట్రలో 25శాతం, చత్తీస్ గఢ్.లో 14శాతం పాజిటివిటీ రేటు నమోదైందని తెలిపారు. చాలా వరకు రాష్ట్రాల్లో ఆర్.టి.పి.సి.ఆర్. (ఆర్.ఎ.టి.) పరీక్షల నిష్పత్తి ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, ప్రైవేటు రంగంలో పరీక్షల సదుపాయాన్ని చాలా రాష్ట్రాలు సరిగా వినియోగించుకోలేదని అన్నారు. కోవిడ్ నిబంధనలను పాటించడం, కంటెయిన్మెంట్ జోన్ల ఏర్పాటు విషయాలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఎంతో ఉదాసీనత కనిపించిందని, సమావేశాలు, సామూహిక కార్యక్రమాలు పెరగడంతో కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిందని ఆయా రాష్ట్రాలను సందర్శించిన బృందాలు నివేదించినట్టు పేర్కొన్నారు.

  నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ మాట్లాడుతూ, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్య ప్రాతిపదికన పాటిస్తున్న పద్ధతిని గురించి వివరించారు. అదే పద్ధతిలోనే భారత ప్రభుత్వం కూడా వయస్సు ప్రాతిపదికన ఆయా గ్రూపులకు ప్రాధాన్యత వారీగా టీకా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకున్న చర్యలు, ప్రస్తుతం ప్రయోగాత్మక దశల్లో ఉన్న వ్యాక్సీన్ల సామర్థ్యం, వాటి గడువును గురించి కూడా ఆయన వివరించారు. 

 

https://ci3.googleusercontent.com/proxy/ldCPHDZMmYLOyvV2wEdcPbLW3_3XKxwlh_O56FtNV1AAnEGwn5xMujIbkUf2IFxml6-7DCHT2GeSZKrH6Lx9pBSEKH3jU3QfUb0WO22SgFUd9yDqAaiKlsGnpw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CAWA.png

  కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ ఖరే, పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోరా, పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డి.పి.ఐ.ఐ.టి.) కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర, ఔషధ విభాగం కార్యదర్శి ఎస్. అపర్ణ, జవుళి పరిశ్రమ శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్, ఆరోగ్య పరిశోధనా శాఖ కార్యదర్శి, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం బార్గవ, విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి,  హోమ్ శాఖ అదనపు కార్యదర్శి గోవింద్ మోహన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ డాక్టర్ సునీల్ కుమార్, విదేశీ వాణిజ్య విభాగం డైరెక్టర్ జనరల్ అమిత్ యాదవ్, ఎన్.సి.డి.సి డైరెక్టర్ డాక్టర్ సుజిత్ కుమార్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశంలో పాలు పంచుకున్నారు. ప్రముఖ ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ ఆర్. గంగా ఖేడ్కర్ కూడా సమావేశానికి హాజరయ్యారు.

 

********



(Release ID: 1710752) Visitor Counter : 225