మంత్రిమండలి
వైట్ గూడ్స్ (ఎయిర్ కండీషనర్లు మరియు ఎల్ఈడి లైట్స్) రంగానికి ఉత్పాదకతతో కూడిన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఈ ఉత్పత్తుల తయారీకి ఐదేళ్లలో రూ. 6,238 కోట్ల ప్రోత్సాహకాలు
ఐదేళ్లలో రూ. 1.68 లక్షల కోట్ల విలువ చేసే ఉత్పత్తులు రూ. 64,400 కోట్ల ఎగుమతులు జరుగుతాయని అంచనా
ఐదేళ్లలో 7,920 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడులు వస్తాయని , ప్రత్యక్ష మరియు పరోక్ష ఆదాయాలుగా రూ. 49,300 కోట్లు సమకూరుతాయని నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా
Posted On:
07 APR 2021 3:55PM by PIB Hyderabad
'ఆత్మనిర్భర్ భారత్' సాధనలో మరో ముఖ్యమైన అడుగుగా ఈ రోజుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం వైట్ గూడ్స్ (ఎయిర్ కండీషనర్లు మరియు ఎల్ఈడి లైట్స్)రంగానికి రూ. 6,238 కోట్ల రూపాయల విలువ చేసే ఉత్పాదకతతో కూడిన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకానికి ఆమోదం తెలిపింది.
అంతర్జాతీయ పోటీని తట్టుకొని అభివృద్ధి సాధించే విధంగా భారతదేశ తయారీ రంగాన్ని తీర్చిదిద్దడానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించి అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని నెలకొల్పాలన్న లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన జరిగింది. ఉత్పత్తి రంగంలో భారతదేశం ప్రపంచంలో కీలక పాత్ర పోషించడానికి ఉపకరించే వ్యవస్థను రూపొందించడానికి ఈ పథకం దోహదపడుతుంది. ఈ పథకం ద్వారా భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఎగుమతులు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నారు.
మంత్రివర్గం ఆమోదించిన పిఎల్ఐ పథకం ఎయిర్ కండిషనర్లు మరియు ఎల్ఇడి లైట్ల తయారీ సంస్థలకు ఐదేళ్ల కాలానికి భారతదేశంలో తయారయ్యే వస్తువుల అమ్మకాలపై 4% నుండి 6% వరకు ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది. గుర్తించిన ప్రాంతాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ రకాల వస్తువుల తయారీకి విభాగాలను గుర్తించడం జరిగింది. భారతదేశం అవసరమైన సామర్ధ్యం లేకపోవడంతో ప్రస్తుతం ఉత్పత్తి కాకుండా వున్న వస్తువులు, ఉప భాగాల తయారీలో ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది. పూర్తయిన వస్తువులను బిగించడానికి ఈ ప్రోత్సాహకాలు వర్తించవు.
అర్హత ప్రమాణాలు కలిగి వున్న సంస్థలు పథకం ప్రయోజనాలను పొందుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టె సంస్థలకు ఈ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. సంబంధిత సంవత్సరంలో ప్రోత్సాహకాలను పొందడానికి ఆ సంవత్సరంలో మొత్తం పెట్టిన పెట్టుబడులను మరియు వస్తువుల విలువకి నిర్దేశించిన కొలమానాలను అమలు చేయవలసి ఉంటుంది.
ఇదే వస్తువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర ఉత్పాదకతతో కూడిన ప్రోత్సాహక పథకాల ద్వారా లభ్ది పొందుతున్న సంస్థలు నూతన పథక పరిధిలోకి రావు. అయితే, ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా తమకు వర్తించే ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకాన్ని ఏ ఒక్క ప్రాంతం లేదా కొంతమందికి మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో అమలు చేయడం జరుగుతుంది. అనేక ఎంఎస్‌ఎంఇలతో సహా పలు ప్రపంచ, దేశీయ కంపెనీలు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ఎసి మరియు ఎల్‌ఇడి పరిశ్రమల్లో ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటు కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించడానికి, ఈ రంగంలో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చి దిద్దే సౌకర్యాలను అందించి దీనిని అవసరమైన వాతావరణాన్ని కల్పించడంలో ఈ పథకం కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. స్వదేశీ విదేశీ మార్కెట్లలో అమ్మకాలను సాగించడానికి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాల మేరకు వస్తువులను తప్పనిసరిగా ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దీనివల్ల పరిశోధన ఆవిష్కరణల రంగాలలో పెట్టుబడులు వస్తాయి.
రానున్న ఐదేళ్ల కాలంలో పిఎల్‌ఐ పథకం వల్ల రూ. 7,920 కోట్ల పెట్టుబడులు వస్తాయని , ఉత్పత్తి రూ. 1,68,000 కోట్లకు చేరుకుంటుందని , రూ .64,400 కోట్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతాయని, ప్రత్యక్ష మరియు పరోక్ష మార్గాల్లో రూ.49,300 కోట్ల ఆదాయం సమకూరడమే కాకుండా నాలుగు లక్షలఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
(Release ID: 1710171)
Visitor Counter : 321
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam