గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
“ట్రైబ్స్.ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ కండి”
‘ట్రైబ్స్.ఇండియాకు మిత్రుడుగా మారండి’
గిరిజనుల ఉత్పాదనలు, సంస్కృతిపై
ప్రోత్సాహక పోటీలకు ట్రైఫెడ్ శ్రీకారం.
మైగవ్ డాట్ ఇన్ పోర్టల్.తో కలసి నిర్వహణ
Posted On:
03 APR 2021 11:19AM by PIB Hyderabad
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని గిరిజ సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) రెండు ఆసక్తికరమైన, సృజనాత్మక పోటీలను ప్రారంభించింది. ట్రైబ్స్ ఇండియాకోసం బ్రాండ్ అంబాసిడర్ కండి, ట్రైబ్స్ ఇండియా సంస్థకు మిత్రుడుగా మారండి అన్న శీర్షికలతో ఈ రెండు పోటీలను ప్రారంభించారు. మై గవన్ డాట్ ఇన్ (MyGov.in) పోర్టల్ తో కలసి ఈ పోటీలకు శ్రీకారం చుట్టారు.
గిరిజనుల ఉత్పాదనలను, గిరిజన సంస్కృతిని, జీవన విధానాలను ప్రోత్సహించడమే ఏకైక లక్ష్యంగా ఈ పోటీలకు రూపకల్పన చేశారు. సృజనాత్మకమైన ఈ పోటీల ద్వారా సుసంపన్నమైన గిరిజనుల వారసత్వ సంపద, కళలు, హస్తకళా ఖండాలు తదితర ఉత్పాదనలపై సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. గిరిజనుల ఉత్పాదనలు, సంస్కృతి, జీవనశైలిపై ప్రజల్లో మరింత అవగాహన ఏర్పడిన పక్షంలో గిరిజనుల సంపూర్ణ సాధికారతకు, అభ్యున్నతికి సామాన్య పౌరులు కూడా తమ వంతు సేవలందించగలరని భావిస్తున్నారు. గిరిజనుల ఉత్పాదనలను ఎక్కువ స్థాయిలో కొనుగోలు చేయడం ద్వారా వారు గిరిజనుల సాధికారతకు దోహదపడగలరన్న ఆశాభావంతోనే ఈ పోటీలను రూపొందించారు.
“ట్రైబ్స్ ఇండియా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కండి”- ఈ పోటీ ద్వారా గిరిజనుల ఉత్పాదనలను గురించి వర్ణించే కథనాలను దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులనుంచి ఆహ్వానిస్తారు. గిరిజనుల ఉత్పాదనలను వినియోగించడంలో తమ అనుభవాలను, ఆ ఉత్పాదన దొరికే ప్రాంతాన్ని, ఏ దుకాణంలో కొనుగోలు చేశారన్న వివరాలను ఈ కథనాల్లో ప్రధానంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ కథనాలు స్వల్ప వ్యవధి వీడియో రికార్డింగుల రూపంలో, 30సెకన్లనుంచి ఐదు నిమిషాల నిడవితో ఉండాలి. స్త్రీలు, పురుషుల దుస్తులు, ఆభరణాలు, వర్ణచిత్రాలు, లోహ ఉత్పాదనలు, టెర్రకోట, మృణ్మయ కళాఖండాలు, అలంకరణ వస్తువులు, ఆహార పదార్ధాలు, సేంద్రియ సాగు ఉత్పత్తులు, వెదురు ఉత్పాదనలు, కాగితం, ఫర్నిచర్, ఇంటి సామగ్రి, వంటలు తదితర అంశాలపై ఈ కథనాలు తయారు చేయవచ్చు. వీడియో లింక్ రూపంలో ఈ కథనాలను పోటీదారులు యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేయవచ్చు. ఈ సంవత్సరం మే నెల 14వ తేదీన ఈ పోటీ నిర్వహిస్తారు. పోటీకోసం 50 ఎంట్రీలను ఎంపిక చేస్తారు. ఎంపికైన ఎంట్రీలకు సంబంధించిన వారికి గిఫ్ట్ వోచర్ ఇస్తారు. దేశంలో ట్రైబ్స్ ఇండియా షోరూమ్.లలోను, ట్రైబ్స్ ఇండియా డాట్ కామ్ (Tribesindia.com) పోర్టల్ లోనూ ఈ గిఫ్ట్ వోచర్ చెల్లుబాటవుతుంది. ఈ పోటీకి సంబంధించిన ఇతర వివరాలను https://www.mygov.in/task/be-brand-ambassador-tribes-india/ అన్న లింకులో వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
భారతీయ సంసృతీ సంప్రదాయాలపై గత ఫిబ్రవరి నెలలో మైగవ్ పోర్టల్ తో కలసి నిర్వహించిన తొలి క్విజ్ పోటీ విజయవంతం కావడంతో క్విజ్ రెండవ దశను ట్రైఫెడ్ ప్రారంభించిది. “ట్రైబ్స్ ఇండియా మిత్రుడుగా మారండి”, అన్న శీర్షికతో ఈ క్విజ్ పోటీ,.. మైగవ్ పోర్టల్ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ప్రత్యక్షంగా ప్రసారమైంది. ఈ క్విజ్ పోటీలో విజేతలుగా తేలిన 50మందికి ట్రైబ్స్ ఇండియా గిఫ్ట్ వోచర్ ను ఇస్తారు. ట్రైబ్స్ ఇండియా నిర్వహించే అన్ని షాపుల్లో, ట్రైబ్స్ ఇండియా డాట్ కామ్ (Tribesindia.com) పోర్టల్ లో ఈ గిఫ్ట్ వోచర్లు చెల్లుబాటవుతాయి. ఈ క్విజ్ పోటీని https://quiz.mygov.in/quiz/be-a-friend-of-tribes-india-2021/ లింక్ ద్వారా వీక్షించవచ్చు.
మన జనాభాలో 8శాతం మంది గిరిజనులే ఉన్నారు. సమాజంలో సరైన అవకాశాలకు నోచుకోని వర్గాల్లో గిరిజనులు ఉన్నారు. గిరిజనులకు ఎంతో నేర్పించాల్సింది ఉందని, వారికి ఎంతో సహాయం అందించాల్సి ఉందని ప్రధాన జనజీవన స్రవంతిలోని ప్రజలు పొరపాటుగా అభిప్రాయపడుతూ ఉంటారు. నిజానికి పట్టణ ప్రాంత ప్రజలకు అనేక విషయాలు బోధించే సత్తా గిరిజనులకే పుష్కలంగా ఉంది. వారిలో అనాదిగా సహజసిద్ధంగా నిరాడంబరత, సృజనాత్మకత నిండి ఉన్నాయి. చేనేత నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఉన్ని, లోహ ఉత్పాదనలు, టెర్రకోట కళాఖండాలు, పూసల అల్లికలు ఇలాంటి గిరిజన ఉత్పత్తులను కళలను పరిరక్షించి, తగిన ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది.
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ అజమాయిషీలో పనిచేసే ట్రైఫెడ్ సంస్థ,.. ఇలాంటి కార్యకలాపాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఎంతగానో కృషిచేస్తూ వస్తోంది. వారి జీవన విధానాలను, సంప్రదాయాలను పరిరక్షిస్తూ వస్తోంది. గిరిజనుల చేతుల్లో రూపుదిద్దుకున్న విభిన్నమైన హస్త కళాఖండాలను, సంస్కృతిని దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేసేందుకు అనేక కార్యక్రమాలను ట్రైబ్స్ ఇండియా నిర్వహిస్తోంది. సుసంపన్నమైన గిరిజనుల ఉత్పాదనలకు మార్కెటింగ్ సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. మైగవ్ పోర్టల్ తో కలసి ట్రైబ్స్ ఇండియా ప్రారంభించిన ఈ కార్యక్రమాలన్నీ ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మనిర్భర భారత్ అభియాన్ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి. స్థానిక ఉత్పాదనలకు విశేష ప్రాధాన్యం ఇచ్చి, స్థానికంగానే వాటి వాణిజ్యానికి దోహదపడాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు.
****
(Release ID: 1709350)
Visitor Counter : 262