కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వలస కార్మికులపై అఖిల భారత సర్వే, ఏక్యూఈఈఎస్ లను ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి

Posted On: 31 MAR 2021 2:42PM by PIB Hyderabad

వలస కార్మికులపై అఖిల భారత సర్వే, అఖిల భారత త్రైమాసిక స్థాపన ఆధారిత ఉపాధి సర్వే (ఏక్యూఈఈఎస్)లను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ ఈ రోజు ప్రారంభించారు. కార్మికశాఖకు అనుబంధంగా పనిచేస్తున్న లేబర్ బ్యూరో ఈ ఏడాది అఖిల భారత స్థాయిలో నిర్వహించనున్న అయిదు సర్వేలలో ఈ రెండు సర్వేలు వున్నాయి. క్షేత్ర స్థాయిలో సర్వేలను నిర్వహించడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్ ను మంత్రి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో చండీఘర్ లో ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో సర్వేలను ప్రారంభించడానికి ముందు లేబర్ బ్యూరో వీటిలో పాల్గొనే ప్రధాన శిక్షకులు, సూపర్‌వైజర్ల కు సమగ్ర శిక్షణా తరగతులను నిర్వహించింది. 

సర్వే కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి ఈ సర్వేల ద్వారా సేకరించే సమాచారం కార్మిక, ఉపాధి రంగాలకు సంబంధించిన విధానాల రూపకల్పనలో కీలకంగా ఉంటుందని అన్నారు. నిర్ణీత సమయంలో సర్వేలను ప్రారంభించిన లేబర్ బ్యూరో అధికారులను అభినందించిన మంత్రి మిగిలిన మూడు సర్వేలు త్వరలో ప్రారంభం అవుతాయని అన్నారు. గృహాలలో పనిచేస్తున్న కార్మికులు, నిపుణులు కల్పిస్తున్న ఉపాధి, రవాణా రంగం కల్పిస్తున్న ఉపాధిపై జాతీయస్థాయిలో ఈ మూడు సర్వేలను నిర్వహిస్తారు. 

కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక,ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ సర్వేలో క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించడానికి  సిబ్బందికి అత్యాధునిక సాఫ్ట్‌వేర్ కలిగిన టాబ్లెట్ పీసీలను అందిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రతి ఇంటినుంచి సమాచారాన్ని సేకరించడంలో ఐటీ సాంకేతికతను జోడించడం ఇదే తొలిసారని ఆయన వివరించారు. ఏడాది కాలంలో అయిదు సర్వే కార్యక్రమాలను చేపట్టనున్న లేబర్ బ్యూరోను అభినందించిన మంత్రి దీనికి అవసరమైన ఐటీ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వ మినీ నవరత్న సంస్థ అయిన బీసిల్ అందిస్తున్నదని తెలిపారు. 

వలస కార్మికులకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించడానికి రానున్న కొన్ని నెలల్లో బ్యూరో సిబ్బంది లక్షలాది గృహాలను సందర్శించనున్నారు. ఉపాధి అవకాశాలు, ఉపాధి రంగంలో వస్తున్న మార్పులను అంచనా వేయడానికి ఏక్యూఈఈఎస్ లో వివిధ సంస్థల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. సర్వేల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా కార్మిక, ఉపాధి రంగాలకు సంభంధించిన విధానాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. ఏక్యూఈఈఎస్ సమాచారాన్ని పది లేక అంతకు మించి సిబ్బంది పనిచేస్తున్న సంస్థలు మరియు తొమ్మిది లేదా అంతకంటే తక్కువ సంఖ్యలో సిబ్బంది పనిచేస్తున్న సంస్థల నుంచి సేకరిస్తారు. దీని ద్వారా భారత కార్మిక రంగంలో ప్రధానమైన రంగంలో సమాచార లేమిని అధిగమించడానికి అవకాశం కలుగుతుంది. 

వలస కార్మికుల సామాజిక ఆర్ధిక స్థితిగతులను, వారు పని వాతావరణ వివరాలను సేకరించే అంశంపై వలస కార్మికులపై చేపట్టనున్న సర్వే దృష్ఠి సారిస్తుంది. 

గడువు మేరకు సర్వేల నిర్వహణకు రంగం సిద్ధం చేశామని, లక్ష్యాల మేరకు నిర్ణీతకాలంలో వీటిని పూర్తి చేస్తామని లేబర్ బ్యూరో అఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ. డిపిఎస్ నేగి తెలిపారు. భారీ స్థాయిలో సాంకేతికత సహకారంతో సర్వేలను నిర్వహించడం ఇదే తొలిసారని ఆయన వివరించారు. వలస కార్మికులు, ఏక్యూఈఈఎస్,  గృహాలలో పనిచేస్తున్న కార్మికులు, నిపుణులు కల్పిస్తున్న ఉపాధి, రవాణా రంగం కల్పిస్తున్న ఉపాధిపై బ్యూరో జాతీయ స్థాయిలో సర్వేలను నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఉపాధి, కార్మిక సంక్షేమ విధానాల రూపకల్పనకు సర్వేల సమాచారం దోహదపడుతుందని అన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వలస కార్మికులపై ఈ సర్వే కేంద్రప్రభుత్వానికి కీలక సమాచారాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. సర్వేల నిర్వహణకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రెండు సర్వేలు 2021లోనే పూర్తవుతాయని ఆయన తెలిపారు. 

 

***



(Release ID: 1708812) Visitor Counter : 270