ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కోవిడ్ – 19 వైరస్ వ్యాప్తి గురించి తెలుసుకునే మురుగు నీరు, వాయు నిఘా వ్యవస్థ గురించి గౌరవ ఉపరాష్ట్రపతికి సాంకేతిక ప్రదర్శన ఇచ్చిన సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్


·       సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు దేశవ్యాప్తంగా చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరణ
·       భారత పార్లమెంట్ లో ఏర్పాటు చేయదలిచిన  వ్యవస్థ గురించి తెలియజేసిన డీజీ
·       లోక్ సభ స్పీకర్ మరియు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ఉపరాష్ట్రపతి

Posted On: 30 MAR 2021 11:46AM by PIB Hyderabad

కోవిడ్ -19 వ్యాప్తిని తెలుసుకునేందుకు భారత పార్లమెంట్ లో సీఎస్ఐఆర్ ఏర్పాటు చేయాలనుకుంటున్న మురుగునీటి మరియు వాయు నిఘా వ్యవస్థకు సంబంధించిన ప్రదర్శనను గౌరవ భారత ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈరోజు హైదరాబాద్ లో తిలకించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) డైరక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి.మాండే ఉపరాష్ట్రపతికి ఈ అంశాలను వివరించారు.

 

డాక్టర్ మాండేతో కలిసి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) డైరక్టర్ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, ఐఐసీటీ నుంచి డాక్టర్ వెంకట మోహన్, నాగపూర్ ఎన్ఈఈఆర్ఐ నుంచి డాక్టర్ ఆత్యా కప్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఇందులో భాగంగా సీఎస్ఐఆర్ ప్రయోగశాలలు చేపట్టిన వివిధ కార్యకలాపాల గురించి డాక్టర్ మాండే ఉపరాష్ట్రపతికి వివరించారు.

 

మురుగు నీటి నిఘా కోవిడ్ సోకిన వారి సంఖ్య యొక్క గుణాత్మక మరియు పరిమాణాత్మక అంచనాను అందిస్తుందని, అలాగే వ్యక్తుల భారీ స్థాయిలో పరీక్షలు సాధ్యం కానప్పటికీ, కోవిడ్ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఉపరాష్ట్రపతికి వివరించారు. సమాజంలో వివిధ ప్రదేశాల్లో వ్యాధి యొక్క ప్రాబల్యాన్ని సరైన సమయంలో సమగ్రంగా పర్యవేక్షించేందుకు ఇది ఓ కొలమానంగా ఉపయోగపడుతుందని వివరించారు. అదే విధంగా రోగ లక్షణాలు ఉన్న వ్యక్తులతో పాటు, రోగ లక్షణాలు లేని వ్యక్తుల విసర్జితాల్లో వైరస్ ఉంటే తెలుసుకునే అవకాశం ఉందని, దీని ద్వారా వైరస్ గురించి సంపూర్ణ అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ మాండే ఉపరాష్ట్రపతికి వివరించారు.

 

హైదరాబాద్, ప్రయాగ్ రాజ్ (అలహాబాద్), ఢిల్లీ, కోల్ కతా, ముంబై, నాగపూర్, పుదుచ్చేరి మరియు చెన్నై లలో వైరస్ సంక్రమణ ధోరణి గురించి తెలుసుకునేందుకు చేపట్టిన మురుగు నీటి నిఘా యొక్క వివరాలను తెలియజేసిన డైరక్టర్ జనరల్, ఇది ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే పూర్తి స్థాయిలో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్యను అంచనా వేస్తుందని, అదే సమయంలో పరీక్షలు చేయించుకునే పద్ధతిలో పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య మీద, వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఆధారపడి ఉంటుందని తెలిపారు.

 

కోవిడ్ -19 మురుగు నీటి నిఘా ద్వారా వ్యాధి యొక్క ప్రస్తుత ఎపిడెమియాలజీని అర్థం చేసుకోవడమే గాక, భవిష్యత్తులో కోవిడ్ -19 వ్యాప్తిని త్వరగా మరియు సులభంగా గుర్తించేందుకు ఒక ఉపయోగకరమైన సాధనంగా పని చేస్తుందని డాక్టర్ మాండే తెలిపారు.

 

వైరల్ కణాలు మరియు వ్యాప్తి ముప్పును పర్యవేక్షించడానికి గాలి నమూనా వ్యవస్థ ఏర్పాటు అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

 

సీఎస్ఐఆర్ దేశంలో వివిధ రంగాల్లో చేస్తున్న శాస్త్రీయ ప్రయోగాలను డా. మండే బృందం సవివరంగా ఉపరాష్ట్రపతికి వివరించారు. సీఎస్ఐఆర్ చేస్తున్న కృషిని, పరిశోధనలను ఉపరాష్ట్రపతి అభినందించారు.  శాస్త్రవేత్తల కృషిని ప్రత్యేకంగా అభినందించిన ఉపరాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మరియు కేంద్ర ప్రభుత్వంతో ఈ విషయం గురించి చర్చించనున్నట్లు ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.

****



(Release ID: 1708475) Visitor Counter : 216