ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి
Posted On:
26 MAR 2021 9:50PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవనీయులైన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాలతోపాటు షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రెహనా సహా ‘ముజిబ్ బోర్షో’ వేడుకల జాతీయ నిర్వహణ కమిటీ ప్రధాన సమన్వయకర్త డాక్టర్ కమల్ అబ్దుల్ నాజర్ చౌదరి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజ్‌గావ్‌లోని జాతీయ కవాతు ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా బంగ్లాదేశ్ జాతిపిత జన్మ శతాబ్ది ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు.
ఖురాన్, భగవద్గీత, త్రిపిటకం, బైబిల్సహా పవిత్ర గ్రంథ ప్రవచన పఠనంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా లోగో ఆవిష్కరణతోపాటు ‘‘ది ఎటర్నల్ ముజిబ్’’ పేరిట రూపొందించిన వీడియోను విడుదల చేశారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒక ‘ఇతివృత్త గీతం’ కూడా ఆలపించడమేగాక ‘‘ది ఎటర్నల్ ముజిబ్’’ యానిమేషన్ వీడియోను కూడా ప్రదర్శించారు. బంగ్లాదేశ్ జాతి నిర్మాణంలో సాయుధ దళాలు పోషించిన ప్రధాన పాత్రను వివరిస్తూ సాయుధ బలగాల సిబ్బంది ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు.
డాక్టర్ కమల్ అబ్దుల్ నాజర్ చౌదరి అతిథులకు ఆహ్వానం పలుకుతూ ప్రసంగించారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, 1971నాటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న భారత సాయుధ దళాల పూర్వ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల నేపథ్యంలో వివిధ దేశాల, ప్రభుత్వాల అధినేతలు సహా విశిష్ట వ్యక్తులు పంపిన అభినందన సందేశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు మరణానంతరం ప్రకటించిన ‘గాంధీ శాంతి బహుమతి-2020’ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదానం చేశారు. ముజిబుర్ రెహ్మాన్ చిన్న కుమార్తె షేక్ రెహనా, ఆమె సోదరి-ప్రధాని షేక్ హసీనాతో కలసి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. గాంధేయవాద విధానాలతోపాటు అహింసాత్మక పద్ధతులలో సామాజిక-ఆర్థిక-రాజకీయ పరివర్తన తేవడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ- వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భానికిగల ప్రాముఖ్యాన్ని ప్రత్యేకంగా వివరించడంతోపాటు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లోని వివిధ కోణాలను స్పృశించారు. అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ‘ఎటర్నల్ ముజిబ్’ జ్ఞాపికను రెహనా అందజేశారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ ప్రసంగిస్తూ- భారత ప్రధానమంత్రితోపాటు భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 1971నాటి బంగ్లా విముక్తి యుద్ధంలో భారత్ పాత్రను, కృషిని ఆయన ప్రశంసించారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రసంగిస్తూ- కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నడుమన ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌కు ఎల్లవేళలా భారత ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఆమె ఎంతగానో ప్రశంసించారు.
అ అధికారిక కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ హిందూస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ అజోయ్ చక్రవర్తి తాను స్వరపరచి బంగబంధుకు అంకితమిచ్చిన గీతాన్ని ఆలపించి కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మృదుమధుర సంగీత విభావరితో అందరి హృదయాలనూ రంజింపజేశారు. ఇదే తరహాలో పలు సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలతో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి.
***
(Release ID: 1708073)
Visitor Counter : 188
Read this release in:
Punjabi
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam