రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

పర్యాటక వాహనాల నిర్వాహకులకు నూతన పథకం

ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించిన 30 రోజులలోగా పర్మిట్ల జారీ

3 నెలలు లేదా దాని గుణిజాలకు 3 సంవత్సరాల వరకు పర్మిట్లకు అనుమతి

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన నిబంధనలు

ఇబ్బందులు లేకుండా పర్యాటక రంగ అభివృద్ధి, రాష్ట్రాల ఆదాయాల పెంపుకు దోహదం

Posted On: 14 MAR 2021 9:00AM by PIB Hyderabad

ఆన్ లైన్ పద్దతిలో '' జాతీయ పర్యాటక గుర్తింపు / పర్మిట్ '' కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు పర్యాటక వాహనాల నిర్వాహకులకు సౌలభ్యం కల్పిస్తూ రోడ్డు రవాణాజాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నూతన పథకాన్ని ప్రకటించింది. సంబంధిత పత్రాలతో  నిర్ణీత రుసుమును చెల్లించిన వారికి దరఖాస్తు సమర్పించిన 30 రోజులలోగా పర్మిట్లను జారీచేస్తారు. దీనికోసం 2021 మార్చ్ 10వ తేదీన  '' జాతీయ పర్యాటక గుర్తింపు / పర్మిట్ ఉత్తర్వులు  నిబంధనలు 2021 '' పేరిట నూతన నిబంధనలతో జిఎస్ఆర్ 166 (ఇ)ను ప్రకటించారు. 2021 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. ప్రస్తుతం జారీ అయిన పర్మిట్లు వాటి గడువు ముగిసేంతవరకు చెల్లుబాటులో ఉంటాయి. 

రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా వాటి ఆదాయాన్ని పెంచడానికి వీలు కల్పించే విధంగా నూతన నిబంధనలను రూపొందించడం జరిగింది. పథకాన్ని రవాణా అభివృద్ధి మండళ్ల 39,40 సమావేశాల్లో రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. సరకు రవాణా వాహనాలకు  జారీ చేస్తున్నజాతీయ పర్మిట్ విధానం విజయవంతం కావడంతో పర్యాటక వాహనాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పర్మిట్లను జారీ చేయడానికి మంత్రిత్వశాఖ పథకానికి రూపకల్పన చేసింది. 

అంతేకాకుండా, ఈ పథకం కింద మూడు నెలల కాలానికి లేదా దాని గుణిజాలకు ఒకేసారి మూడు సంవత్సరాలకు మించకుండా  జారీ అయ్యే అధికారం / అనుమతి పర్మిట్లు సౌలభ్యంగా కూడా ఉంటాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో  పర్యాటక కాలం పరిమిత సీజన్ లో ఉండడం మరియు వాహన నిర్వాహకుల ఆర్థిక సామర్థ్యం అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనను పథకంలో చేర్చారు. పర్యాటక సమాచారాన్నికేంద్రీకృతం చేయడం ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి, పర్యాటకుల కదలికలను తెలుసుకోవడానికి ఈ నిబంధనలు అవకాశం కల్పిస్తాయి. 

గత 15 సంవత్సరాలుగా దేశంలో రవాణా పర్యాటక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. జాతీయ అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈ రంగాలు మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో నూతన నిబంధనలను రూపొందించడం జరిగింది. 

***



(Release ID: 1704721) Visitor Counter : 207