ప్రధాన మంత్రి కార్యాలయం

‘సెరావీక్‌’ కార్యక్రమంలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం

Posted On: 05 MAR 2021 8:55PM by PIB Hyderabad

   డాక్టర్‌ డాన్‌ యెర్గిన్‌! నా గురించి ఆత్మీయ పరిచయ వాక్యాలు పలికిన మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు విశిష్ట అతిథులందరికీ అభివందనాలు.

నమస్కారం!

   ‘సెరావీక్‌ గ్లోబల్‌ ఎనర్జీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ లీడర్‌షిప్‌ అవార్డు’ను సవినయంగా స్వీకరిస్తున్నాను. నా ఘన మాతృభూమి అయిన భారతదేశ ప్రజలకు, పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన మా పుణ్యభూమిలోని ఉజ్వల సంప్రదాయాలకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నాను.

మిత్రులారా!

   పర్యావరణ రక్షణలో సమర్థ నాయకత్వానికి గుర్తింపు ఈ పురస్కారం. నాయకత్వమంటే సాధారణంగా కార్యాచరణద్వారా నిరూపితమయ్యే లక్షణం. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారతీయులు అగ్రభాగాన ఉంటారనడంలో సందేహం లేదు. శతాబ్దాలుగా రుజువైన వాస్తవమిది. దైవత్వం, ప్రకృతి మా సంస్కృతిలో పరస్పర సంధానితాలు. మా దేవుళ్లు, దేవతలు ఏదో ఒక వృక్షం లేదా ప్రాణితో ముడిపడి ఉంటారు. ఆయా వృక్షాలు, ప్రాణులు ఎంతో పవిత్రమైనవిగానూ ఉంటాయి. మా దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన సాహిత్యాన్నయినా, భాషనైనా పరిశీలించండి... మానవులకు/ప్రకృతికి మధ్య సన్నిహిత బంధానికి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి.

మిత్రులారా!

   మానవ చరిత్రలో పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన గొప్ప వ్యక్తిని మీరు మహాత్మా గాంధీలో చూడవచ్చు. మానవాళి ఆయన చూపిన బాటలో నడిచి ఉంటే మనం నేడు ఇన్ని సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని తీర నగరం పోర్బందర్‌లోగల మహాత్మా గాంధీ నివాసాన్ని సందర్శించాల్సిందిగా మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జల సంరక్షణపై అత్యంత ఆచరణాత్మక పాఠాలను ఆ నివాసానికి పక్కనే మీరు నేర్చుకోగలరు. అక్కడ 200 ఏళ్లకు పూర్వమే భూగర్భ ట్యాంకులు నిర్మించబడ్డాయి. వీటన్నటినీ నిర్మించింది వాననీటిని ఒడిసిపట్టడం కోసమే.

మిత్రులారా!

   వాతావరణ మార్పులు, విపత్తులు నేడు మనకు ప్రధాన సవాళ్లు. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. వీటిలో పోరాడాలంటే రెండు మార్గాలున్నాయి... ఒకటి- విధానాలు, చట్టాలు, నిబంధనలు, ఆదేశాలు. వీటిలో దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. ఈ సందర్భంగా కొన్ని ఉదాహరణలను ఉటంకిస్తాను: భారత విద్యుదుత్పాదన సామర్థ్యంలో శిలాజేతర వనరుల వాటా నేడు 38 శాతానికిపైగా పెరిగింది. అలాగే 2020 ఏప్రిల్‌ నుంచే మేము ‘భారత్‌-6’ ఉద్గార ప్రమాణాలకు చేరుకున్నాం. ఇది యూరో-6 ఇంధనానికి సమానం. ఇక ప్రస్తుత సహజవాయు వినియోగాన్ని ప్రస్తుత 6 శాతం నుంచి 2030కల్లా 15 శాతానికి పెంచడం కోసం భారత్‌ కృషి చేస్తోంది. ద్రవీకృత సహజ వాయువును ఇంధనంగా వాడటాన్ని ప్రోత్సహిస్తున్నాం. దీంతోపాటు ఉదజనిని ఇంధనంగా వాడటంపై ‘జాతీయ ఉదజని కార్యక్రమం’ (NHM) గత నెలలోనే ప్రారంభించాం. ఇటీవలే ‘పీఎం-కుసుమ్‌’ (PM KUSUM) పథకానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది సౌరశక్తి ఉత్పాదనలో సమాన, వికేంద్రీకృత నమూనాకు దోహదం చేస్తుంది. అయితే- విధానాలు, చట్టాలు, ఆదేశాల చట్రానికి మించిందొకటి ఉంది. వాతావరణ మార్పుతో పోరాడే అత్యంత శక్తిమంతమైన మార్గం ప్రవర్తనాపరమైన మార్పు. ఈ సందర్భంగా బహుశా మీరందరూ ఇప్పటికే విన్న ఓ ప్రసిద్ధ కథను వివరిస్తాను. ఒక బిడ్డకు చిరిగిపోయిన ప్రపంచ పటాన్నిచ్చి దాన్ని యథాతథంగా అతికించడం ఎన్నటికీ సాధ్యం కాదని భావించి ఒక ప్రయత్నం చేయాల్సిందిగా సూచించబడింది. అయితే, ఆ బిడ్డ తన ప్రయత్నంలో విజయం సాధించగా, అదెలా సాధ్యమైందని ప్రశ్నిస్తే- ఆ పటం వెనుక భాగంలో ఒక మనిషి బొమ్మ ఉన్నదని, దాని ఆధారంగా తిరిగి యథాతథంగా అతికించానని జవాబివ్వడం గమనార్హం. ఇక్కడ ఆ బిడ్డ చేసింది కేవలం మనిషి బొమ్మను అతికించడం మాత్రమే. దీనివల్ల ప్రపంచ పటం దానంతట అదే మళ్లీ పూర్వస్థితికి వచ్చేసింది. దీన్నిబట్టి “మనను మనం సరిచేసుకుందాం... ప్రపంచం దానంతట అదే సవ్యంగా మారిపోతుంది” అన్న సందేశాన్ని ఈ కథ తేటతెల్లం చేస్తోంది.

మిత్రులారా!

   మన సంప్రదాయ అలవాట్లలో ప్రవర్తనా మార్పు స్ఫూర్తి కీలకమైనది. సహానుభూతి సహిత వినియోగం గురించి ఇది మనకు బోధిస్తుంది. ఆలోచనారహితంగా ఆవల పారేసే సంస్కృతి మా నైతిక విలువలలో భాగం కాదు. మా వ్యవసాయ పద్ధతులు లేదా ఆహారాల విషయాన్నే చూడండి... మా రవాణా-ప్రయాణ పద్ధతులను లేదా వినియోగ ధోరణులను గమనించండి. నిరంతరం ఆధునిక సాగు పద్ధతులను అనుసరించే మా రైతులను చూసి నేనెంతో గర్విస్తాను. భూసారం మెరుగుతోపాటు పురుగుమందుల వినియోగం తగ్గింపుపై నానాటికీ వారిలో అవగాహన పెరుగుతోంది. ఇక ప్రపంచమంతా నేడు శారీరక దృఢత్వం, ఆరోగ్యంవైపు దృష్టి సారిస్తోంది. ఆరోగ్యకరమైన, సేంద్రియ ఆహారం కోసం డిమాండ్‌ పెరుగుతోంది. ఈ పయనానికి తన సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద ఉత్పత్తులుసహా మరెన్నో అంశాల తోడ్పాటుతో భారత్‌ చోదక పాత్ర పోషించగలదు. అదేవిధంగా పర్యావరణహిత రవాణా కూడా మరొక అంశం. భారతదేశంలోని 27 పట్టణాలు, నగరాల్లో మెట్రో నెట్‌వర్కుల నిర్మాణానికి కృషి కొనసాగటం గురించి తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు.

మిత్రులారా!

   భారీ స్థాయిలో ప్రవర్తనా మార్పుకోసం మనం ప్రతిపాదించే పరిష్కారాలు ఆవిష్కరణాత్మకంగా ఉండాలి. అలాగే ప్రజా భాగస్వామ్యంతో అందరికీ అందుబాటులోనూ ఉండాలి. ఈ సందర్భంగా నేనొక ఉదాహరణ చెబుతాను... భారతదేశంలో ప్రజలు మునుపెన్నడూ లేనిరీతిలో ‘ఎల్‌ఈడీ’ బల్బుల వినియోగానికి నడుం బిగించారు. ఆ మేరకు 2021 మార్చి 1నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 37 మిలియన్‌ ఎల్‌ఈడీ బల్బులు వినియోగిస్తున్నారు. దీనివల్ల విద్యుత్‌ వినియోగం, ఖర్చు కూడా ఆదా అయింది. ఫలితంగా ఏడాదికి 38 మిలియన్‌ టన్నులకుపైగా బొగ్గుపులుసు వాయువు (కార్బన్‌ డైఆక్సైడ్‌) సృష్టి ఆగిపోయింది. అలాగే భారత్‌ అనుసరించిన ‘పరిత్యజించు’ సూత్రం కూడా మరో ఉదాహరణ. వంటగ్యాస్‌తో మరింత అవసరమున్న పేదల కోసం దానిపై పొందుతున్న రాయితీని వదులుకోవాల్సిందిగా ప్రభుత్వం సరళంగా విజ్ఞప్తి చేసింది. దీంతో దేశవ్యాప్తంగా భారతీయులు అనేకమంది స్వచ్ఛందంగా రాయితీని వదులుకున్నారు. ఫలితంగా భారతదేశంలోని లక్షలాది ఇళ్లలో పొగరహిత వంటగదులు అవతరించడంలో ఇదెంతో కీలకపాత్ర పోషించింది. ఇక దేశంలో వంటగ్యాస్‌ లభ్యత 2014లో 55 శాతం కాగా, నేడు అసాధారణ స్థాయిలో 99.6 శాతానికి పెరిగింది. దీనివల్ల ప్రధానంగా లబ్ధి పొందినవారు మహిళలే. ఇప్పుడు నేను మరొక సానుకూల మార్పును కూడా గమనిస్తున్నాను. ఆ మేరకు వ్యర్థాల నుంచి సంపద అన్నది మా దేశంలో సరికొత్త నినాదంగా ఆవిర్భవిస్తోంది. వివిధ రంగాల్లో మా పౌరులు విశిష్ట పునరుపయోగ నమూనాలను అనుసరిస్తున్నారు. వర్తుల ఆర్థిక వ్యవస్థకు ఇదెంతో ఉత్తేజమిస్తుంది. చౌకరవాణా సదుపాయాల దిశగా సుస్థిర ప్రత్యామ్నాయం కింద మా దేశం నేడు వ్యర్థాల నుంచి సంపదవైపు స్ఫూర్తిదాయకంగా పురోగమిస్తోంది. ఆ మేరకు 2024నాటికి దేశంలో 15 మిలియన్‌ టన్నుల ఇంధన వాయువు ఉత్పత్తి లక్ష్యంగా 5,000 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లను భారత్‌ ఏర్పాటు చేయనుంది. ఇది పర్యావరణానికే కాకుండా మానవ సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుంది. మిత్రులారా! భారత దేశమంతటా ఇథనాల్‌ వినియోగానికి ఆమోదం పెరుగుతోంది. ఈ ప్రజా ప్రతిస్పందన నేపథ్యంలో 2030 తొలినాళ్లకల్లా పెట్రోలులో 20 శాతం ఇథనాల్‌ కలిపే ఆలోచనను అంతకన్నా ముందుగా 2025 నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

మిత్రులారా!

   భారత్‌లో గడచిన ఏడేళ్లుగా అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్న వార్త మీకెంతో సంతోషం కలిగించేదే. సింహాలు, పులులు, చిరుతలు, నీటి పక్షుల సంఖ్య బాగా పెరిగింది. సానుకూల ప్రవర్తనా మార్పులకు ఇవన్నీ సూచికలే. ఆ మేరకు పారిస్‌ ఒప్పందం కింద 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను భారత్‌ అంతకన్నా ముందే సాధించగలదని ఇవన్నీ స్పష్టం చేస్తున్నాయి.

మిత్రులారా!

   పర్యావరణ మార్పులపై ఇదే ధోరణితోగల దేశాలతో సంయుక్తంగా కృషి చేయడం భారత్‌ దృక్పథంలో ఒక భాగంగా ఉంటుంది. మెరుగైన భూగోళం దిశగా కృషిలో భారత్‌ ఎంత చిత్తశుద్ధితో ఉన్నదో అంతర్జాతీయ సౌర కూటమి ప్రాథమిక విజయంతోనే సుస్పష్టమైంది. భవిష్యత్తులోనూ ఈ దిశగా మా కృషి కొనసాగుతూనే ఉంటుంది. మహాత్మా గాంధీ ప్రబోధిత ‘ధర్మకర్తృత్వం’పైనే ఆధారపడి ఇది సాగుతుంది. సమష్టితత్వం, సహానుభూతి, బాధ్యతలే ఈ ధర్మకర్తృత్వంలో కీలక భాగాలు. వనరులను బాధ్యతాయుతంగా వినియోగించడం కూడా ధర్మకర్తృత్వంలో భాగమే. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ చెప్పిన సముచిత అంశాన్ని నేను ఉటంకిస్తాను... “ప్రకృతి మాత బహూకరించిన సంపదను మనం ఇష్టానుసారం వాడుకోవచ్చు.. కానీ, భూమాత పుస్తకాల్లో మాత్రం ఆమెకు ఇవ్వాల్సింది మనం తీసుకున్నదానికి సమానంగా ఉంటుంది.” మామూలుగా చెబితే ప్రకృతి ఒక సాధారణ సమతూకపు పట్టీని నిర్వహిస్తుంది... మనం ఏది ఇస్తామో దాన్ని అదే మోతాదులో వాడుకోవచ్చు లేదా తీసుకోవచ్చు. అయితే, అదంతా సముచిత రీతిలో పంచుకోవాలి... వనరులను మనం అతిగా వాడేసుకోవడమంటే మరొకరి నుంచి వాటిని లాగేసుకోవడమే అవుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై పోరాటంలో తోడ్పాటు గురించి భారత్‌ ఈ సూత్రానికి అనుగుణంగానే పిలుపునిస్తోంది. కాబట్టి...

మిత్రులారా!

   మనమిప్పుడు పర్యావరణపరంగా, హేతుబద్ధంగా ఆలోచించాల్సి ఉంది. ఇది కేవలం మీరు లేదా నా గురించి కాదు... ఇది మన భూమాత భవిష్యత్తు గురించి... రాబోయే తరాలకు ఈ సంపదను సంక్రమింపజేసే బాధ్యత మనందరిపైనా ఉంది. చివరగా- ఈ పురస్కారానికి నన్ను ఎంపిక చేసినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నమస్తే...

 

***


(Release ID: 1703030) Visitor Counter : 152