ఉప రాష్ట్రపతి సచివాలయం
ఇంజనీరింగ్ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యంతోపాటు భావోద్వేగ , సామాజిక నైపుణ్యాలు కూడా అవసరం: ఉపరాష్ట్రపతి
విద్యార్థులు తమ జ్ఞానాన్ని సామాజిక ఔచిత్యంతో అనుసంధానం చేయాలి
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే శాస్త్ర, సాంకేతికతల ప్రాథమిక లక్ష్యం కావాలి
తిరుపతి ఐఐటీ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
నవభారత ఆకాంక్షలను ఐఐటీలు ప్రతిబింబించాలని సూచన
ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మరింతగా పెంచాలి
విద్యార్థుల్లో ఎక్కువమంది యువతులే ఉండటంపై ఐఐటీ తిరుపతిపై ప్రశంసలు
Posted On:
04 MAR 2021 3:50PM by PIB Hyderabad
మార్చి 4, 2021, తిరుపతి
సాంకేతిక నైపుణ్యంతోపాటు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలను కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మారేందుకు ఈ నైపుణ్యాలు ఎంతగానో ఉపయుక్తమవుతాయని ఆయన పేర్కొన్నారు.
తిరుపతి ఐఐటీ ఆరవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. సంస్థ ఆవరణలో ఐఐటీ విద్యార్థులతో గురువారం ఉపరాష్ట్రపతి ముచ్చటించారు. విద్యార్థులు తమ జ్ఞానాన్ని సామాజిక అవసరాలతో అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. ‘మీ భవిష్యత్తును మీ ఆలోచనలకు తగ్గట్లుగా మీరు నిర్మించుకుంటూ.. భారతదేశ పరివర్తనలో మీ వంతు భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తూ, మీ జ్ఞానాన్ని, నేర్చుకున్న నైపుణ్యాలను దేశం కోసం వినియోగిస్తారనే విశ్వాసం నాకు ఉంది’ అని ఉపరాష్ట్రపతి అన్నారు.
భారతదేశ నిర్మాణరంగ అభివృద్ధిలో సాంకేతికత అత్యంత కీలకమన్న ఉపరాష్ట్రపతి.. ఈ దిశగా మన నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే శాస్త్ర, సాంకేతికతల ప్రాథమిక లక్ష్యం కావాలన్నారు. సాంకేతికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణ, మారుతున్న వాతావరణ పరిస్థితులపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధితోపాటు ఆరోగ్యాభివృద్ధి కూడా కీలకమైన అంశమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
మారుతున్న భారతదేశ ఆకాంక్షలను ఐఐటీలు ప్రతిబింబించాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశం మరోసారి విశ్వగురుగా అభివృద్ధి చెందుతున్న పరిణామక్రమంలో మన దేశ విద్యాలయాలు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. ‘మన విద్యావ్యవస్థ ప్రమాణాలు పెంచినపుడే మనం అనుకున్న లక్ష్యాల దిశగా దూసుకుపోగలం’ అని ఆయన పేర్కొన్నారు.
నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రస్తావిస్తూ.. సృజనాత్మకత, నైతికత, సామాజిక బాధ్యత, ప్రయోగాత్మకత తదితర అంశాలను ప్రోత్సహించేలా నూతన జాతీయ విద్యావిధానానికి రూపకల్పన జరిగిందన్నారు. దీన్ని వీలైనంత త్వరగా, సమర్థవంతంగా అమలుచేయడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు వీలుంటుందన్నారు.
ప్రతి ఏడాది 15లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణత పొంది బయటకు వస్తున్నారని.. ఇందులో కేవలం 7శాతం మంది మాత్రమే కీలకమైన ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అర్హత సాధిస్తున్నారని ఉపరాష్ట్రపతి అన్నారు. ‘ప్రపంచ మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరచాల్సిన తక్షణావసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. విద్యాలయాలు, పరిశ్రమలు పరస్పర సమన్వయంతో కృషిచేయడం ద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుందన్నారు.
భారతదేశ జనాభా సగటు వయసు 30 ఏళ్ల కంటే తక్కువగా ఉందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. యువతలో ఉన్న శక్తిసామర్థ్యాలను గుర్తించి వాటికి సరైన నైపుణ్యాన్ని జోడించడం ద్వారా, సరైన మనోధైర్యాన్ని కల్పించడం ద్వారా ఈ యువశక్తిని ఆత్మనిర్భర భారత నిర్మాణంలో క్రియాశీలకంగా భాగస్వామ్యం చేసేందుకు వీలుంటుందన్నారు. భారతీయ విద్యార్థులకు వారి మాతృభాషలో విద్యాబోధన జరగాలనేది తన ఆకాంక్షని ఉపరాష్ట్రపతి అన్నారు. మాతృభాషలో విద్యాబోధన ద్వారా విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయినుంచే విషయాసక్తి, సృజనాత్మకత పెరుగుతాయన్నారు. విద్యార్థులు కూడా వ్యాయామంపై దృష్టి సారించాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసిక సంతులనంతో ఉన్నతమైన ఆలోచనలను చేయవచ్చన్నారు.
విద్యార్థులు ఆధునిక సాంకేతికతతోపాటు.. ప్రాచీన భారత సంస్కృతిని కూడా ఒంటబట్టించుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. కొత్త ఐఐటీలు, ఐఐఎంల స్థాపనపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. ఈ సంస్థలను ప్రపంచస్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు అధ్యాపకులు మరింత కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతోపాటు ప్రయోగాత్మక విధానంపై ఆసక్తి కలిగేలా మరిన్ని మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు.
విజ్ఞానకేంద్రాలుగా ఐఐటీలు మంచి పేరు తెచ్చుకుంటున్నాయని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి.. ఈ ఘనతను కొనసాగించేందుకు మరింతగా శ్రమించాల్సి ఉంటుందన్నారు.
మూడోవిడత ఐఐటీల వేగవంతమైన అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి.. గృహ, హడ్కో వంటి సంస్థల అవార్డులు పొందడంతోపాటు పర్యావరణానుకూల ప్రాంగణ నిర్మాణం, సుస్థిర నిర్మాణ సాంకేతికత వినియోగంపై తిరుపతి ఐఐటీని ప్రశంసించారు. దీంతోపాటుగా తిరుపతి ఐఐటీలో బీ.టెక్‌లో గరిష్టంగా 18శాతం మంది యువతులు ఉండటం విషయంలోనూ ఐఐటీ డైరెక్టర్, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది చేస్తున్న కృషిని కూడా ప్రశంసించారు. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ఇదే చిత్తశుద్ధితో కృషిచేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
కరోనా మహమ్మారిపై పోరాటంలోనూ తిరుపతి ఐఐటీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘థర్మల్ ఎయిర్ స్టెరిలైజర్’ ఎన్95 పునర్వినియోగ మాస్క్‌లు, ఛాతీ ఎక్స్‌రే ద్వారా సాధారణ న్యుమోనియా, కరోనా బాధితులను వేర్వేరుగా గుర్తించడం తదితర పరికరాలను రూపొందించడం అభినందనీయమన్నారు. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్.. రెండు సంస్థలున్న ఏకైక నగరంగా తిరుపతి ప్రత్యేకతను సంతరించుకుందున్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి, తిరుపతి ఐఐటి డైరక్టర్ ప్రొ. సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
****
(Release ID: 1702573)
Visitor Counter : 188