రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

జన్‌ ఔషధి దివస్‌ వారోత్సవాల రెండోరోజున (మంగళవారం) 'జన్‌ ఔషధి పరిచర్చ' నిర్వహణ

Posted On: 02 MAR 2021 5:20PM by PIB Hyderabad

జన్‌ ఔషధి దివస్‌ వారోత్సవాల్లో రెండోరోజైన ఇవాళ (మంగళవారం), వైద్యులు, ఆసుపత్రులు, ఇతర సంబంధిత వర్గాలతో కలిసి బీపీపీఐ, జన్‌ ఔషధి మిత్రలు, జన్‌ ఔషధి కేంద్రాల యజమానులు చర్చలో పాల్గొన్నారు. పీఎంబీజేపీ లక్ష్యాలు, విశిష్ట లక్షణాల గురించి వైద్యులు, ఇతర వర్గాలకు ఈ చర్చలో వివరించారు. ఉత్పత్తుల నాణ్యత కోసం, "వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌-గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రాక్టీసెస్‌" ధృవీకరించిన పంపిణీదారుల నుంచి మాత్రమే బీపీపీఐ ఔషధాలను తీసుకుంటుందని కూడా తెలియజేశారు. "నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లాబొరేటరీస్‌" గుర్తింపు ఉన్న పరీక్ష కేంద్రాల్లో ప్రతి బ్యాచ్‌ ఔషధాలను పరీక్షిస్తారు. ఈ పరీక్షల్లో నెగ్గితేనే వాటిని పీఎంబీజేపీ కేంద్రాలకు పంపుతారు. 

    'ప్రధానమంత్రి భారతీయ జన్‌ ఔషధి పరియోజన' (పీఎంబీజేపీ) నిర్వహణ బాధ్యతలు చూసే 'భారత ఫార్మా పీఎస్‌యూల బ్యూరో' (బీపీపీఐ), మూడో జన్‌ ఔషధి దివస్‌ను ఈనెల 7వ తేదీన నిర్వహిస్తోంది. ఈ ఏడాది అంశం "సేవ భీ - రోజ్‌గార్‌ భీ". మార్చి 1వ తేదీ నుంచి జన్‌ ఔషధి వారోత్సవాలను బీపీపీఐ ప్రారంభించింది. వారోత్సవాల్లో భాగంగా ఆరోగ్య శిబిరాలు, జన్‌ ఔషధి పరిచర్చ, టీచ్‌ దెమ్‌ యంగ్‌, సువిధ సే సమ్మాన్‌ వంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది.

    రక్తపోటు, మధుమేహం, వైద్యులతో ఉచిత సంప్రదింపులు, ఉచిత ఔషధాలు వంటి అంశాలతో కూడిన ఆరోగ్య శిబిరాలను జన్‌ ఔషధి కేంద్రాల యజమానులు మార్చి 1వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా ఆరోగ్య శిబిరాలను నిర్వహించారు.

    దేశవ్యాప్తంగా 7480 జన్‌ ఔషధి కేంద్రాలు పని చేస్తున్నాయి. దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. పీఎంబీజేపీ కింద లభించే ఔషధాల ధరలను, 'తొలి మూడు ప్రముఖ ఔషధాల సగటు ధరలో గరిష్టంగా 50 శాతం' సూత్రం ఆధారంగా నిర్ణయిస్తారు. దీనివల్ల, మార్కెట్‌ సగటు ధరలో 50-90 శాతం తక్కువకే జన్‌ ఔషధి ఔషధాలు లభిస్తున్నాయి. దేశప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండేలా ఔషధాల ధరలను పీఎంబీజేపీ గణనీయంగా తగ్గించింది.

***


(Release ID: 1702005) Visitor Counter : 134