ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ కేసులు పెరుగుతున్న ఏడు రాష్ట్రాలు/యూటీ లకు ప్రత్యేక బృందాలను పంపిన కేంద్రం
కోవిడ్-19 కేసులు పెరగడంపై ఏడు రాష్ట్రాలు/యూటీ లకు లేఖ రాసిన ఆరోగ్య కార్యదర్శి
అమలు చేయవలసిన చర్యలపై సూచనలు జారీ
Posted On:
24 FEB 2021 11:58AM by PIB Hyderabad
కోవిడ్ వ్యాప్తిని నివారించడానికి తగిన చర్యలను అమలుచేసే అంశంలో మహారాష్ట్ర,కేరళ, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్,గుజరాత్,పంజాబ్,కర్ణాటక,తమిళనాడు,పశ్చిమబెంగాల్ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లకు సహకరించడానికి కేంద్రం ప్రత్యేక బృందాలను పంపింది. వివిధ విభాగాలకు చెందిన ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన ఈ బృందాలకు ఆరోగ్యశాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న అధికారి నాయకత్వం వహిస్తారు. రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయంతో పనిచేసే ఈ బృందాలు కోవిడ్-19 కేసులు పెరగడానికి వెనుకవున్న కారణాలను గుర్తిస్తాయి. కోవిడ్-19 కేసులు మరింత పెరగకుండా చూడడానికి ఈ బృందాలు ఆయా రాష్ట్రాలు/ యూటీ ల సహకారంతో తగిన చర్యలను అమలుచేస్తాయి. జిల్లాల అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు లోతుగా సమీక్షిస్తూ కొవిడ్ ను ఇంతవరకు అమలు చేసిన చర్యల వల్ల కలిగిన ప్రయోజనాలు వృధాగా పోకుండా చూడడానికి చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలు/యూటీలకు సూచనలు జారీఅయ్యాయి.
రోజువారీ కోవిడ్ కేసుల నమోదులో పెరుగుదల కనిపించడం, ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గడం, కొన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల పెరుగుదల అంశాలపై మహారాష్ట్ర,కేరళ, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్,గుజరాత్,పంజాబ్ కేంద్రపాలితప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లకు కేంద్రం లేఖలు రాసింది.
కేసుల వ్యాప్తిని అరికట్టి, బయటపడకుండా వున్నవ్యాధిని నిర్ధారించడానికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను ఎక్కువ చేయాలని సూచిస్తూ మహారాష్ట్ర,కేరళ, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్,గుజరాత్,పంజాబ్ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సూచించారు. ప్రభావిత జిల్లాల్లో ఆర్టీ-పీసీఆర్ మరియు రాపిడ్ యాంటిజెన్ పరీక్షలను విడివిడిగా నిర్వహించాలని, యాంటిజెన్ పరీక్షలో నెగటివ్ వచ్చిన కేసులను తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ద్వారా తప్పనిసరిగా పరీక్షించాలని అన్నారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్ కి పంపి వారితో సన్నిహితంగా తిరిగిన వారిని ఎలాంటి జాప్యం లేకుండా గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు.
వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలను అమలు చేసే అంశంలో అలసత్వం పనికిరాదని రాష్ట్రాలు/యూటీ లను కేంద్రం హెచ్చరించింది. కొన్ని దేశాలలో బయటపడిన నూతన స్టెయిన్ వైరస్ వల్ల పరిస్థితి జటిలంగా మారే ప్రమాదం ఉందని గుర్తించాలని కేంద్రం సూచించింది. ఉన్నత స్థాయి బృందాలకు పూర్తిగా సహకరించి, పరిస్థితిని బృందాలకు వివరించాలని, పర్యటన తరువాత తిరిగి బృందాలతో సమీక్షించాలని 10 రాష్ట్రాలు/ యూటీ ల ప్రధాన కార్యదర్శులకు విడిగా రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కోరారు.
కొవిడ్ ను అరికట్టడానికి దేశవ్యాపితంగా కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా ఈ చర్యలను అమలు చేయడం జరుగుతుంది. కోవిడ్ కేసులలో ఒక్కసారిగా పెరుగుదల కనిపించిన రాష్ట్రాలు, కేసులసంఖ్య ఎక్కువగా వున్న రాష్ట్రాలు, మరణాల సంఖ్య ఎక్కువగా వున్న రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నది. కేంద్రం పంపిన బృందాలు క్షేత్రస్థాయిలో అధికారులతో చర్చించి తాజా పరిస్థితిని తెలుసుకొని వారు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను తెలుసుకుంటుంది.
***
(Release ID: 1700430)
Visitor Counter : 217