రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డీఆర్‌డీవో రూపొందించిన యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లు హెలినా, ధృవాస్త్ర పరీక్షలు విజయవంతం

Posted On: 19 FEB 2021 3:29PM by PIB Hyderabad

యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ మిస్సైళ్లయిన హెలినా (సైన్యం కోసం), ధృవాస్త్ర (వాయుసేన కోసం)కు అత్యాధునిక తేలికపాటి హెలికాఫ్టర్‌ (ఏఎల్‌హెచ్‌) నుంచి ఎడారిలో సంయుక్త వినియోగ పరీక్షలు నిర్వహించారు. ఈ క్షిపణులను స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.

    ఈ క్షిపణుల కనిష్ట, గరిష్ట స్థాయుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఐదుసార్లు పరీక్షలు జరిపారు. వాస్తవమైన, కదిలే లక్ష్యాలపైకి ఆకాశంలో ఎగురుతున్న విమానాల నుంచి క్షిపణులను ప్రయోగించారు. అస్థిరంగా కదిలే ట్యాంకులపైకి వార్‌హెడ్లతో కూడిన క్షిపణులను కూడా కొన్నిసార్లు ప్రయోగించారు. ఎగురుతున్న హెలికాఫ్టర్‌ నుంచి కూడా కదులుతున్న లక్ష్యంపైకి ఒక ప్రయోగం చేపట్టారు.

    హెలినా, ధృవాస్త్ర క్షిపణులు మూడో తరానికి చెందినవి. లాక్‌ ఆన్‌ బిఫోర్‌ లాంచ్‌ (ఎల్‌వోబీఎల్‌) వ్యవస్థతో కూడిన వీటితో నేరుగా లేదా గగనతలం నుంచి దాడి చేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా, రాత్రయినా, పగలయినా పని చేస్తాయి. సాంప్రదాయ కవచంతోపాటు, పేలుడు ప్రతిస్పందన కవచంతో కూడిన యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగలవు. ఇవి ప్రపంచంలోనే అత్యంత అత్యాధునిక ట్యాంకు విధ్వంసక క్షిపణులు. సైన్యం అమ్ములపొదిలో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి.

    క్షిపణుల ప్రయోగం విజయవంతంపై డీఆర్‌డీవో, సైన్యం, వాయుసేనను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. ఈ ప్రయోగాల్లో పాల్గొన్న సిబ్బందిని రక్షణ శాఖ ఆర్‌&డీ విభాగం కార్యదర్శి, డీఆర్‌డీవో ఛైర్మన్‌ సతీష్‌ రెడ్డి ప్రశంసించారు.

 

***
 (Release ID: 1699521) Visitor Counter : 227