ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వివిధ రవాణా సంఘాలకు, మాస్కులు, సబ్బులు పంపిణీ చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన - డాక్టర్ హర్ష్ వర్ధన్
“టీకా అందుబాటులోకి వచినంత మాత్రాన, మనం నిశ్చింతగా ఉండకూడదు; వాస్తవానికి, ఇప్పుడు మరియు సమీప భవిష్యత్తులో కూడా మనందరం అన్ని నివారణ చర్యలను అనుసరించాలి”
Posted On:
08 FEB 2021 4:38PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, భారత రెడ్-క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు వివిధ రవాణా సంఘాలకు, మాస్కులు, సబ్బులు పంపిణీ చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, డాక్టర్ హర్ష్ వర్ధన్, ముందుగా, తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "కోవిడ్-19 ప్రతిస్పందన కార్యకలాపాల్లో భాగంగా, మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాల పరంపరలో ఇది ఒక భాగం. ఢిల్లీ లో, వ్యాధి వ్యాపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉండే, రైల్వే స్టేషన్లు, కూరగాయల మార్కెట్లు తదితర ప్రదేశాలలో మాస్కులు పంపిణీ చేసాము." అని వివరించారు.
భారత రెడ్‌క్రాస్ సొసైటీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించిన డాక్టర్ హర్ష వర్ధన్, టీకా అభివృద్ధి తర్వాత కూడా కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ, "కోవిడ్ నివారణ కోసం మన స్వంత దేశంలో అభివృద్ధి చేసిన టీకా ఆమోదం పొందిందనీ, అదేవిధంగా, భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిందనీ గట్టిగా చెప్పడానికి, నేను చాలా సంతోష పడుతున్నాను. టీకా అందుబాటులోకి వచినంత మాత్రాన, మనం నిశ్చింతగా ఉండకూడదు. వాస్తవానికి, ఇప్పుడు మరియు సమీప భవిష్యత్తులో కూడా మనందరం అన్ని నివారణ చర్యలను తప్పనిసరిగా పాటించాలి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఐ.ఆర్.సి.ఎస్. మాస్కుల పంపిణీని కొనసాగించడం ప్రశంసనీయం.” అని పేర్కొన్నారు.
ఇటువంటి పంపిణీ యొక్క ప్రాముఖ్యత గురించి, కేంద్ర మంత్రి, నొక్కి చెబుతూ, మాస్కు మరియు చేతి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఒక గుర్తుగా ఈ "మాస్కుల పంపిణీ" కార్యక్రమం చేపట్టడం జరిగింది. రహదారి సరుకు రవాణా వాహనాల డ్రైవర్లు మరియు సహాయకులు దేశవ్యాప్తంగా ప్రయాణిస్తూ ఉంటారు, అందువల్ల, ఐ.ఆర్.సి.ఎస్. చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమం, కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలకు గొప్ప సహాయకారిగా ఉంటుంది." అని వివరించారు.
భారతదేశంలోని కోవిడ్ పరిస్థితి గురించి, కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టిన చర్యల గురించి, డాక్టర్ హర్ష వర్ధన్ ప్రత్యేకంగా వివరిస్తూ, "భారతదేశం మొత్తం ప్రపంచంలో అత్యధిక రికవరీ రేటు నమోదుచేసిన దేశాల్లో ఒకటిగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ, ఈ రోజున ఇది 1.48 లక్షలుగా ఉంది. 2020 జనవరి లో కేవలం ఒక ప్రయోగశాల ఉండగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనకి 2,373 ప్రయోగశాలలున్నాయి. ప్రస్తుతం, రోజుకు ఒక మిలియన్ కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం మనకు ఉంది. మనం, ఇంతవరకు, మొత్తం 20 కోట్ల మేర పరీక్షలను పూర్తి చేశాము. ఇది ‘మొత్తం ప్రభుత్వం’ మరియు ‘మొత్తం సమాజం’ అనే విధానం యొక్క ఫలితం.” అని పేర్కొన్నారు.
ఆయన, ఈ సందర్భంగా, మరిన్ని విషయాలు చెబుతూ, "మాస్కులు, పి.పి.ఈ. కిట్లు, వెంటిలేటర్లు మొదలైన వస్తువుల ఉత్పత్తిలో భారతదేశం స్వావలంబన సాధించడంతో పాటు, వీటిని ఎగుమతి చేసే స్థితిలో కూడా ఉంది. ఇప్పటివరకు 58 లక్షలకు పైగా లబ్ధిదారులకు టీకాలు వేయడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి, టీకా వేయించుకోవలసిందిగా ఆరోగ్య కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశారు. మేము ఫిబ్రవరి నెల నుండి ఫ్రంట్‌లైన్ కార్మికులకు కూడా టీకాలు వేయడం ప్రారంభించాము.” అని తెలియజేశారు.
వ్యాక్సిన్ చుట్టూ ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారం మరియు పుకార్లను డాక్టర్ హర్ష వర్ధన్ తిరస్కరిస్తూ, "చాలా మంది టీకాకు సంబంధించి, తప్పుడు సమాచారం మరియు పుకార్లను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.”
ఈ కార్యక్రమంలో, ఐ.ఆర్.సి.ఎస్. సెక్రటరీ జనరల్, శ్రీ ఆర్.కె. జైన్ తో పాటు, వివిధ రవాణా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1696408)
Visitor Counter : 146