ప్రధాన మంత్రి కార్యాలయం

పశ్చిమ బెంగాల్ ‌లోని కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, దేశానికి అంకితం చేసిన - ప్రధానమంత్రి

గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి ప్రస్తుతం ఎంతైనా అవసరం: ప్రధానమంత్రి

పశ్చిమ బెంగాల్ ‌ను ఒక ప్రధాన వాణిజ్య మరియు పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము: ప్రధానమంత్రి

Posted On: 07 FEB 2021 7:55PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు పశ్చిమ బెంగాల్ లోని హల్దియాను సందర్శించి, ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్టులో భాగమైన, 348 కిలోమీటర్ల దోభి - దుర్గాపూర్ సహజ వాయువు పైప్-‌లైన్ విభాగానికి చెందిన, ఎల్.పి.జి. దిగుమతి టెర్మినల్ ను, దేశానికి అంకితం చేశారు.   హల్దియా రిఫైనరీకి చెందిన రెండవ ఉత్ప్రేరక-ఐసోడ్ వాక్సింగ్ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.  ఎన్.హెచ్-41 మార్గంలో హల్దియాలోని రాణిచాక్ వద్ద 4 లైన్ల ఆర్.ఓ.బి-కమ్-ఫ్లై ఓవర్ ను ఆయన దేశానికి అంకితం చేశారు.  ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ తో పాటు, కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అనుసంధానత, స్వచ్ఛమైన ఇంధనం లభ్యత విషయంలో స్వావలంబన పరంగా పశ్చిమ బెంగాల్ మరియు మొత్తం తూర్పు భారతదేశానికి ఈ రోజు చాలా మంచి రోజు.  ఈ నాలుగు ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో జీవన సౌలభ్యం మరియు సులభతర వ్యాపారాలను పెంపొందిస్తాయి.  ఎగుమతి-దిగుమతులకు హల్దియా ప్రధాన కేంద్రంగా ఎదగడానికి ఈ ప్రాజెక్టులు సహాయపడతాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి చాలా అవసరమని, ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  ఈ అవసరాన్ని తీర్చడానికి ఒక దేశం-ఒక గ్యాస్ గ్రిడ్ విధానం ఒక ముఖ్యమైన చర్య.  ఇందుకోసం, సహజ వాయువు ధరను తగ్గించడం, గ్యాస్-పైప్-‌లైన్-నెట్‌వర్క్‌ను విస్తరించడంపై దృష్టి పెట్టడం జరిగింది.  మన ప్రయత్నాలతో, భారతదేశం,  గ్యాస్ అత్యధికంగా వినియోగించే దేశాలలో ఒకటిగా చేరే పరిస్థితికి వచ్చింది.  చౌక మరియు స్వచ్ఛమైన శక్తిని ప్రోత్సహించడానికి బడ్జెట్‌లో హైడ్రోజన్ మిషన్ ప్రకటించబడింది.

తూర్పు భారతదేశంలో జీవన, వ్యాపార నాణ్యతను మెరుగుపరిచేందుకు రైలు, రహదారి, విమానాశ్రయం, ఓడరేవులు, జలమార్గాలలో చేపట్టిన పనుల జాబితాను, ప్రధానమంత్రి వివరించారు.   గ్యాస్ కొరత ఈ ప్రాంతంలో పరిశ్రమలను మూసివేయడానికి దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.  దీనికి పరిష్కారంగా, తూర్పు భారతదేశాన్ని తూర్పు, పశ్చిమ ఓడరేవులతో అనుసంధానించాలని నిర్ణయించడం జరిగింది.  ఈ ప్రాజెక్టు లో పెద్ద భాగమైన, ప్రధాన మంత్రి ఊర్జా గంగా పైప్-‌లైన్ ను, ఈ రోజు దేశానికి అంకితం చేయడం జరిగింది.   350 కిలోమీటర్ల దోబి-దుర్గాపూర్ పైప్‌-లైన్ పశ్చిమ బెంగాల్‌ తో పాటు, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 10 జిల్లాలకు కూడా నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.  నిర్మాణ పనులు, స్థానికులకు 11 లక్షల రోజుల పనిదినాల ఉపాధిని కల్పించాయి.  ఇది వంటశాలలకు పైపుల ద్వారా శుభ్రమైన ఎల్.పి.జి.ని అందించడంతో పాటు వాహనాలకు స్వచ్ఛమైన సి.ఎన్.జి. ని అందిస్తుంది.  సింద్రీ, దుర్గాపూర్ ఎరువుల కర్మాగారాలకు నిరంతర గ్యాస్ సరఫరా లభిస్తుంది.  జగదీష్పూర్-హల్దియా, బొకారో-ధమ్రా పైప్‌లైన్‌లోని దుర్గాపూర్-హల్దియా విభాగాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రధానమంత్రి గెయిల్ సంస్థను, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు.

ఉజ్వల పథకం వల్ల, ఈ ప్రాంతంలో ఎల్.పి.జి. కి ఎక్కువ వినియోగంలోకి వచ్చింది, డిమాండ్ పెరిగింది. అందువల్ల, ఈ ప్రాంతంలో ఎల్.‌పి.జి. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి జరుగుతోంది.  పశ్చిమ బెంగాల్ ‌లో మహిళలకు 90 లక్షల ఉచిత ఎల్.‌పి.జి. కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. వీరిలో 36 లక్షలకు పైగా, ఎస్.సి. / ఎస్.టి.  వర్గానికి చెందిన మహిళలు ఉన్నారు.  గత ఆరేళ్లలో పశ్చిమ బెంగాల్ ‌లో ఎల్.‌పి.జి.  కవరేజ్ 41 శాతం నుంచి 99 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్టులో, ఉజ్వలా  పథకం కింద ఒక కోటి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేయాలని ప్రతిపాదించారు.   పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్ మరియు ఈశాన్య ప్రాంతాల్లోని కోట్లాది కుటుంబాలకు సేవలు అందించనున్నందున హల్దియాకు చెందిన ఎల్.‌పి.జి. దిగుమతి టెర్మినల్ అధిక డిమాండ్‌ను తీర్చడంలో పెద్ద పాత్ర పోషిస్తోంది.  2 కోట్ల మందికి పైగా ప్రజలకు ఇక్కడి నుండే గ్యాస్ సరఫరా అవుతుంది.  వీరిలో ఒక కోటి మంది ఉజ్వలా పధకం లబ్ధిదారులు ఉన్నారు.

స్వచ్ఛమైన ఇంధనం కోసం నిబద్ధతలో భాగంగా, బి.ఎస్-6 ఇంధన కర్మాగారం సామర్థ్యాన్ని పెంచే పనులను ఈ రోజు ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.  ల్యూబ్-ఆధారిత నూనెలకు సంబంధించి దిగుమతిపై ఆధారపడటాన్ని, ఈ రెండవ ఉత్ప్రేరక డీవాక్సింగ్ యూనిట్ తగ్గిస్తుంది.  "మనం ఎగుమతి సామర్థ్యాన్ని సృష్టించగలిగే పరిస్థితి వైపు పయనిస్తున్నాము" అని ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్ ‌ను ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.  ఇది సాధించడానికి, ఈ విధమైన నౌకాశ్రయాలతో అనుసంధానమైన అభివృద్ధి మంచి నమూనా. కోల్‌కతా లోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు ట్రస్టు ‌ను ఆధునీకరించడానికి చాలా చర్యలు తీసుకోవడం జరిగింది.  హల్దియా నౌకాశ్రయ సముదాయం సామర్ధ్యాన్నీ, పొరుగు దేశాలతో అనుసంధానతనూ పటిష్టపరచాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.  కొత్త ఫ్లైఓవర్ మరియు దేశీయ జల మార్గాల సాధికార సంస్థకు చెందిన ప్రతిపాదిత మల్టీ-మోడల్ టెర్మినల్ ఈ అనుసంధానతను మెరుగుపరుస్తుంది.  "స్వావలంబన భారతదేశానికి అపారమైన శక్తి కేంద్రంగా హల్దియా ఆవిర్భావానికి, ఇది,  దారి తీస్తుంది" అని పేర్కొంటూ, ప్రధానమంత్రి  తమ ప్రసంగాన్ని ముగించారు.

 

*****



(Release ID: 1696101) Visitor Counter : 171