ఆర్థిక మంత్రిత్వ శాఖ

వాణిజ్య కార్యక్రమాలను సులభతరం చేసే సంస్కరణను అమలులోకి తెచ్చిన మరో నాలుగు రాష్ట్రాలు

5,034 కోట్ల ర్రూపాయల అదనపు రుణ సేకరణకు అర్హత

వాణిజ్య కార్యక్రమాలను సులభతరం చేసే సంస్కరణను అమలులోకి తెచ్చి 28,183 కోట్ల రూపాయల మేరకు అదనపు రుణ సేకరణకు అర్హత సాధించిన 12 రాష్ట్రాలు

Posted On: 06 FEB 2021 11:59AM by PIB Hyderabad

కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన ఖర్చుల విభాగం నిర్దేశించిన విధంగా  వాణిజ్య కార్యక్రమాలను సులభతరం చేసే సంస్కరణను మరో నాలుగు రాష్ట్రాలు- అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలు అమలులోకి తీసుకొనివచ్చాయి. వాణిజ్య కార్యక్రమాలను సులభతరం చేసే సంస్కరణను అమలు చేయడంతో అదనపు రుణాలను సేకరించడానికి ఈ నాలుగు రాష్ట్రాలు అర్హత సాధించాయి. బహిరంగ మార్కెట్ లో ఈ 5,034 కోట్ల రూపాయలను రుణాలుగా సమీకరించుకోవడానికి ఈ రాష్ట్రాలకు అనుమతులు జారీ అయ్యాయి. 

  వాణిజ్య కార్యక్రమాలను సులభతరం చేసే సంస్కరణను అస్సాం,హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు అమలు చేయడంతో ఈ సంస్కరణను అమలులోకి తెచ్చిన రాష్ట్రాల సంఖ్య 12కి చేరింది. అంతకుముందు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాలు ఈ సంస్కరణను అమలులోకి తెచ్చినట్టు సమర్పించిన నివేదికలను పరిశ్రమలు, అంతర్గత వ్యాపార ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటి) ఆమోదించింది. 

 

వాణిజ్య కార్యక్రమాలను సులభతరం చేసే సంస్కరణను అమలు చేసిన ఈ 12 రాష్ట్రాలకు అదనంగా 28,183 కోట్ల రూపాయలను రుణంగా సమకూర్చుకోవడానికి అనుమతులు జారీఅయ్యాయి. రాష్ట్రాల వారీగా అదనపు రుణ సేకరణకు అనుమతుల వివరాలు:

 

 

క్ర.

రాష్ట్రం

మొత్తం (కోటి రూ.)

1.

ఆంధ్రప్రదేశ్

2,525

2.

అస్సాం

934

3.

హర్యానా

2,146

4.

హిమాచల్ ప్రదేశ్

438

5.

కర్ణాటక

4,509

6.

కేరళ

2,261

7.

మధ్యప్రదేశ్

2,373

8.

ఒడిశా

1,429

9.

పంజాబ్

1,516

10.

రాజస్థాన్

2,731

11.

తమిళనాడు

4,813

12.

తెలంగాణ

2,508

           

 

దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం ఉందని తెలిజేయడానికి సులభతరం వాణిజ్య విధానం ఒక ప్రధాన సూచికగా ఉంటుంది. రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలు మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనిని గుర్తించిన కేంద్రం అదనపు రుణాలను సమీకరించుకోవడానికి ఈ సంస్కరణను అమలు చేసే రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని 2020 మేలో నిర్ణయించింది. ఈ తరగతిలో అర్హత సాధించడానికి రాష్ట్రాలు ఈ కింది సంస్కరణలను అమలు చేయవలసి ఉంటుందని నిర్దేశించారు. 

(i) 'జిల్లా స్థాయి వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక' మొదటి అంచనాలను పూర్తి చేయడం 

 

                    (ii)రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు / ఆమోదాలు / లైసెన్సుల పునరుద్ధరణ కోసం వివిధ చట్టాల క్రింద అనుమతులను పొందాలన్న నిబంధనను తొలగించడం

(iii) కేంద్రీకృత కంప్యూటకరించబడిన ఇన్స్పెక్షన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇన్స్పెక్టర్ల కేటాయింపు కేంద్రీకృతం జరగడానికి అవకాశం కల్పించడం.  తరువాత సంవత్సరాల్లో అదే ఇన్స్పెక్టర్ అదే యూనిట్ కు  కేటాయించబడరు.  వ్యాపార యజమానికి ముందస్తు తనిఖీ నోటీసు ఇవ్వబడుతుంది మరియు తనిఖీ నివేదిక తనిఖీ చేసిన 48 గంటల్లో అప్లోడ్ చేయబడుతుంది.          

కోవిడ్-19 సవాళ్ళను ఎదుర్కోవడానికి నిధులు అవసరముంటాయని గుర్తించిన కేంద్రప్రభుత్వం 2020 మే 17వ తేదీన రాష్ట్రాల అదనపు రుణ సేకరణ పరిమితిని వాటి జిఎస్ డీపీ లో రెండు శాతానికి పెంచింది. దీనిలో సగం శాతాన్ని ప్రజల సౌలభ్యం కోసం రూపొందించిన నాలుగు సంస్కరణల అమలుతో అనుసంధానం చేయడం జరిగింది. i ) ఒక దేశం ఒక రేషన్ కార్డు ii) సులభతర వాణిజ్య కార్యక్రమాలు iii) స్థానిక పట్టణ / వినియోగ సంస్కరణలు iv) విద్యుత్ రంగంలో సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. 

ఇంతవరకు, 17 రాష్ట్రాలు నిర్దేశించిన నాలుగు సంస్కరణల్లో ఒకదానిని అమలులోకి తెచ్చాయి. ఈ 17 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలు ఒక దేశం ఒక రేషన్ కార్డు సంస్కరణను, 12 రాష్ట్రాలు సులభతర వాణిజ్య సంస్కరణను, అయిదు రాష్ట్రాలు స్థానిక సంస్థల సంస్కరణను, రెండు రాష్ట్రాలు విద్యుత్ సంస్కరణలను అమలులోకి తెచ్చాయి. ఈ రాష్ట్రాలకు ఇంతవరకు 74,773 కోట్ల రూపాయలను అదనపు రుణాలుగా సమీకరించడానికి అనుమతులు జారీఅయ్యాయి. 

***



(Release ID: 1695872) Visitor Counter : 169