మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
"నారీశక్తి పురస్కారాలు-2020" కోసం నామినేషన్లు పంపడానికి ఈనెల 6 వరకు గడువు పెంపు
Posted On:
02 FEB 2021 11:45AM by PIB Hyderabad
కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ, "నారీశక్తి పురస్కారాలు-2020" కోసం నామినేషన్లు పంపడానికి తుది గడువును ఈనెల 6వ తేదీ వరకు పెంచింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా, ఈ విశిష్ఠ అవార్డులను మంత్రిత్వ శాఖ ఏటా అందజేస్తోంది. మహిళా సాధికారత అంశంలో గొప్ప కృషి చేసినవారికి గుర్తింపుగా వీటిని అందజేస్తోంది.
నిర్ణయాధికారంలో పాల్గొనేలా మహిళలను ప్రోత్సహించినందుకు; సంప్రదాయ, సంప్రదాయేతర రంగాల్లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషి చేసినందుకు; గ్రామీణ మహిళలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించినందుకు; శాస్త్ర, సాంకేతికతలు, క్రీడలు, కళలు, సంస్కృతి వంటి సాంప్రదాయేతర రంగాల్లో మహిళలను ప్రోత్సహించినందుకు; మహిళల భద్రత, ఆరోగ్యం, విద్య, జీవన నైపుణ్యాలు, గౌరవం వంటి అంశాల్లో కృషి చేసినందుకు వ్యక్తులు, బృందాలు, ఎన్‌జీవోలు, సంస్థలకు నారీశక్తి పురస్కారాలు అందజేస్తారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రంతోపాటు రెండు లక్షల నగదును అందజేస్తారు.
25 ఏళ్లు నిండిన వ్యక్తులు, సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న సంస్థలు నామినేషన్లకు అర్హులు.
కలలను సాకారం చేసుకోవడానికి వయస్సు, భౌగోళిక అడ్డంకులు, నిధుల సమస్యలను లెక్కచేయనివారు ఈ పురస్కారాల ద్వారా దేశవ్యాప్త గుర్తింపు పొందుతారు. వారి మొక్కవోని దీక్ష సమాజాన్ని, యువతరాన్ని భారీగా ప్రభావితం చేస్తుంది. లింగ వివక్షను బద్దలు కొట్టేలా ప్రోత్సహిస్తుంది. సమాజాభివృద్ధిలో మహిళలకు సమానభాగం ఉందని తెలియజెప్పే ప్రయత్నమే ఈ పురస్కారాల ప్రదానం.
మరిన్ని వివరాలకు http://narishaktipuraskar.wcd.gov.in/పై క్లిక్ చేయండి.
***
(Release ID: 1694382)
Visitor Counter : 206