పార్లమెంటరీ వ్యవహారాలు

పార్లమెంట్ బడ్జెటు సమావేశాల అంశంపై ఏర్పాటైన అఖిలపక్ష సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

సాగు చట్టాల పై ప్రభుత్వ వైఖరి జనవరి 22 న ఉన్న విధంగానే ఉంది; వ్యవసాయ మంత్రి చేసిన ప్రతిపాదన ఇప్పటికీ స్థిరంగానే ఉంది:  ప్ర‌ధాన మంత్రి


పార్లమెంట్ సాఫీ గా పనిచేయడం ముఖ్యమంటూ పునరుద్ఘాటించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 30 JAN 2021 3:35PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శనివారం నాడు పార్లమెంట్ బడ్జెటు సమావేశాల అంశంపై ఏర్పాటైన అఖిలపక్ష సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించారు.

మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలిని ఘటించారు.  మహాత్ముని కలలను పండించేందుకు మనం పాటుపడాలి అని ప్రధాన మంత్రి అన్నారు.  యుఎస్ఎ లో ఈ రోజు న ఉదయం మహాత్మ గాంధీ విగ్రహాన్ని అపవిత్రం చేయడాన్ని ప్రధాన మంత్రి ఖండిస్తూ, ద్వేషం తో కూడిన అలాంటి వాతావరణానికి మన ప్రపంచం లో చోటు లేదు  అన్నారు.

వ్యవసాయ చట్టాల అంశం లో ప్రభుత్వం దాపరికం లేనటువంటి మనస్సు తో వ్యవహరిస్తోంది అని చెప్తూ ప్రధాన మంత్రి భరోసా ను కల్పించారు.  ఈ అంశం లో ప్రభుత్వం వైఖరి జనవరి 22 న ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది  అని ఆయన అన్నారు.  వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ప్రతిపాదన ఇప్పటికీ ఇంకా స్థిరంగానే ఉందని ప్రధాన మంత్రి తెలిపారు.  చర్చలను ముందుకు తీసుకు పోవడానికి వ్యవసాయ శాఖ మంత్రి కి ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ నెల 26న జరిగిన దురదృష్టకర సంఘటన గురించి నేతలు ప్రస్తావించగా,  చట్టం తన పని ని తాను చేసుకు పోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

సమావేశం లో నేతలు ప్రస్తావించిన అంశాలపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని ప్రధాన మంత్రి చెప్పారు.  పార్లమెంట్ సాఫీ గా నడవడం, సభావేదిక మీద విస్తృతమైన చర్చలు జరగడం ముఖ్యం అని ఆయన పునరుద్ఘాటించారు.  పదేపదే అంతరాయాలు జరుగుతూ ఉంటే చిన్న రాజకీయపక్షాలు నష్టపోతాయి, అవి వాటి అభిప్రాయాలను తగిన స్థాయి లో వ్యక్తం చేయలేకపోతాయి అని ప్రధాన మంత్రి వివరించారు.  పార్లమెంట్ సక్రమంగా పనిచేసే విధంగాను, ఎలాంటి అంతరాయాలు ఎదురవకుండాను చూడవలసింది పెద్ద రాజకీయ పక్షాలే, అలా చూస్తే అప్పుడు చిన్న రాజకీయపక్షాలు వాటి అభిప్రాయాలను పార్లమెంటు లో వినిపించగలుగుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రపంచ క్షేమం కోసం అనేక రంగాల లో భారతదేశం మహత్వపూర్ణమైనటువంటి పాత్ర ను పోషించగలుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  మన  దేశ ప్రజల నైపుణ్యాన్ని, సాహసాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అవి ప్రపంచ సమృద్ధి ని గుణాత్మకమైన రీతి న ఇంతలంతలు చేయడం లో ఓ శక్తి గా మారగలుగుతాయి అన్నారు.  



 

***


(Release ID: 1693607) Visitor Counter : 259