Posted On:
28 JAN 2021 1:04PM by PIB Hyderabad
విచ్చిన్న కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం సాధ్యం కాదని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ముఖ్తర్ అబ్బాస్ నక్వి స్పష్టం చేశారు. కెరటంలో దూసుకువస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు చేతులు అడ్డుపెట్టి ఆపడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ఎటువంటి వివక్ష లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రతి ఒక్కరూ అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయని దీనితో ప్రతి ఒక్కరూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని ఆయన అన్నారు.
న్యూఢిల్లీలో రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల అధికారుల కోసం కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఈ రోజు ఏర్పాటు చేసిన పునశ్చరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు, స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత తొలిసారిగా ప్రభుత్వం విద్య, సామాజిక, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పడానికి దేశంలోని అన్ని ప్రాంతాలలో వున్న వక్ఫ్ ఆస్తులలో మౌలిక సదుపాయాలను కల్పించిందని మంత్రి చెప్పారు. వక్ఫ్ ఆస్తులను డిజిటైసెషన్ చేయడంవల్ల వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలు స్వార్థపరుల నుంచి విముక్తి పొందాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం (పీఎంజేవీకె) కింద గడచిన ఆరు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అవసమైన ప్రాంతాలలో వక్ఫ్ ఆస్తులలో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, ఐటిఐలు, పాలిటెక్నిక్స్, బాలికల హాస్టళ్ళు, ఆసుపత్రులు, బహుళ ప్రయోజన కమ్యూనిటీ హాల్ “సద్భవ్ మండపం”, “హునార్ హబ్”, సాధారణ సేవా కేంద్రాలు, ఉపాధి ఆధారిత నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, ఇతర సౌకర్యాలను కల్పించిందని ఆయన వివరించారు. ఈ సౌకర్యాల కల్పన వల్ల అవసమైన వారికి ముఖ్యంగా బాలికలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని విద్యతో ఉపాధి అవకాశాలు ఎక్కువ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలిసారిగా పాఠశాలలు, కళాశాలలు, ఐటిఐలు, పాలిటెక్నిక్లు, బాలికల హాస్టళ్లు, ఆసుపత్రులు, బహుళ ప్రయోజన కమ్యూనిటీ హాల్ “సద్భవ్ మండపం”, “హునార్ హబ్”ల అభివృద్ధికి ప్రభుత్వం 100 శాతం నిధులు సమకూర్చిందని అన్నారు. ఇంతకాలం ఈ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడి ఉన్నాయని అన్నారు.
ఇదివరకు మైనారిటీల కోసం రూపొందిన అభివృద్ధి కార్యక్రమాలు కేవలం 90 జిల్లాల్లో మాత్రమే అమలు జరిగేవని తాము అధికారంలోకి వచ్చిన తరువాత 308 జిల్లాలు,870 బ్లాకులు, 331 నగరాలతో పాటు వేలాది గ్రామాల్లో వీటిని అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
మైనారిటీలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ప్రాంతాలలో గత 6 సంవత్సరాలలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక-విద్యా మరియు ఉపాధి ఆధారిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులలో 1527 కొత్త పాఠశాల భవనాలు, 22877 అదనపు తరగతి గదులు, 646 హాస్టళ్లు, 163 నివాస పాఠశాలలు, 9217 స్మార్ట్ క్లాస్ రూములు (కేంద్రీయ విద్యాలయాలతో సహా), 32 కళాశాలలు, 95 ఐటీఐలు, 13 పాలిటెక్నిక్స్, 6 నవోదయ విద్యాలయాలు. 404 బహుళ ప్రయోజన కమ్యూనిటీ సెంటర్ “సద్భావ్ మండపం”, 574 మార్కెట్ షెడ్లు, 5330 మరుగుదొడ్డి మరియు నీటి సౌకర్యాలు, 143 సాధారణ సేవా కేంద్రాలు, 22 వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, 1926 ఆరోగ్య ప్రాజెక్టులు, 5 ఆస్పత్రులు, 8 హునార్ హబ్, 14 వివిధ క్రీడా సౌకర్యాలు, 6014 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 6 లక్షల 64,000 రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని మంత్రి చెప్పారు. అన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డుల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపిన శ్రీ నక్వి జియో టాగింగ్ / జిపిఎస్ వక్ఫ్ ఆస్తుల మ్యాపింగ్ దేశంలోని ప్రముఖ సంస్థలు చేపట్టాయని అన్నారు. అన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు కల్పించామన్నారు
జమ్మూ-కాశ్మీర్, లే-కార్గిల్‌లలో వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. జమ్మూ-కాశ్మీర్ మరియు లే-కార్గిల్‌లోని వక్ఫ్ ఆస్తులను సమాజ శ్రేయస్సు కోసం సక్రమంగా ఉపయోగించుకునేలా వక్ఫ్ బోర్డులు చర్యలు తీసుకుంటాయని మంత్రి తెలిపారు. జమ్మూ-కాశ్మీర్ మరియు లేహ్-కార్గిల్‌లోని వక్ఫ్ ఆస్తులపై సామాజిక-ఆర్థిక మరియు విద్యా కార్యకలాపాలకు మౌలిక సదుపాయాలను “ప్రధానమంత్రి జన వికాస కార్యక్రమం ” (పిఎంజెవికె) కింద కేంద్ర ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేస్తుందని మంత్రి వెల్లడించారు . జమ్మూ-కాశ్మీర్ మరియు లే-కార్గిల్‌లలో ఉన్న వేలాది వక్ఫ్ ఆస్తుల నమోదు చేసే ప్రక్రియ ప్రారంభం అయ్యిందని తెలిపిన మంత్రి వీటి డిజిటలైజేషన్, జియో టాగింగ్ / జిపిఎస్ మ్యాపింగ్ కూడా త్వరలో పూర్తవుతుందని తెలిపారు.
వివిధ రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని చెప్పిన మంత్రి వీటిని ఆక్రమించుకున్న వారిని గుర్తించి కఠిన చర్యలను తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించామని శ్రీ నక్వి తెలిపారు. త్వరలో రాష్ట్రాలలో కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ పర్యటిస్తుందని అన్నారు. కార్యక్రమంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పి కె దాస్, అదనపు కార్యదర్శి శ్రీ ఎస్ కె దేవ్ వర్మన్, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎ.ఎస్ నఖ్వీ, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. "వౌమి వక్ఫ్ బోర్డు తారఖియాటి పథకం" కింద రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారుల కోసం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఒకరోజు పునశ్చరణ కార్యక్రమాన్ని నిర్వహించింది.
***