పర్యటక మంత్రిత్వ శాఖ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమక్షంలో, భారత్ పర్వ్-2021 ని రేపు ప్రారంభించనున్న - లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

ఈ ఏడాది, జనవరి, 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరిగే భారత్ పర్వ్-2021 లో దృశ్య మాధ్యమం ద్వారా భారతీయ సంస్కృతిని ప్రదర్శించనున్నారు.

प्रविष्टि तिथि: 25 JAN 2021 1:57PM by PIB Hyderabad

భారతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా జరుపుకునే, వార్షిక ఉత్సవం, "భారత్ పర్వ్" ను ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు దృశ్య మాధ్యమం www.bharatparv2021.com " అనే వెబ్-సైట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసే మంటపాలలో, ఆయా ప్రాంతాలకు చెందిన  పర్యాటక ప్రదేశాలు, వంటకాలు, హస్తకళా నైపుణ్యాలు వంటి అనేక ప్రత్యేకతలను ప్రదర్శిస్తారు.  ఈ ఏడాది, దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న, "భారత్-పర్వ్-2021" ఉత్సవాన్ని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా,  2021 జనవరి 26వ తేదీన, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమక్షంలో ప్రారంభిస్తారు. 

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ, "భారత్ పర్వ్" ఉత్సవాన్ని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఎర్ర కోట బురుజుల ఎదురుగా,  2016 నుండి, ప్రతీ సంవత్సరం, జనవరి 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తోంది.  దేశభక్తి పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా, ఈ భారీ ఉత్సవం, దేశంలోని ఘనమైన, విభిన్నమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.  భారత్ పర్వ్ ఉత్సవం  "భారతదేశ సుగంధాన్ని" పరిమళింప జేస్తుంది. 

ఈ ఉత్సవంలో భాగంగా -  సాంస్కృతిక, ఆయుష్, వినియోగదారుల వ్యవహారాలు, రైల్వే, పౌర విమానయాన మొదలైన మంత్రిత్వ శాఖలతో పాటు; చేనేత వస్త్రాల అభివృద్ధి కమిషనర్; హస్తకళల అభివృద్ధి కమిషనర్; లలిత కళా అకాడమీ; భారత పురావస్తు సర్వే; జాతీయ వస్తు ప్రదర్శన శాలలు; ఆధునిక కళల జాతీయ ప్రదర్శన శాల; సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా సంస్థలు;  ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) వంటి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర సంస్థలు, భారతదేశం నలుమూలల నుండి హస్తకళలు, చేనేత వస్త్రాలు, సంగీతం, నృత్యం, చిత్ర లేఖనం, సాహిత్యం తో పాటు అనేక ఇతర అంశాలను ప్రదర్శిస్తాయి.

గణతంత్ర దినోత్సవ కవాతు విన్యాసాలు, సాయుధ దళాల సంగీత బృందాల ప్రదర్శనల రికార్డింగులు మొదలైన ప్రదర్శనలు కూడా ఈ వెబ్-సైట్ ద్వారా వీక్షించడానికి అందుబాటులో ఉంటాయి.   కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ హోటల్ యాజమాన్య శిక్షణా సంస్థలతో పాటు, భారతీయ వంటల శిక్షణా సంస్థ రూపొందించిన వంటకాల వీడియోల ద్వారా భారతదేశానికి చెందిన అనేక ఆహార పదార్ధాల వివరాలను కూడా ఈ వెబ్-సైట్ ద్వారా వీక్షించవచ్చు.

ఈ ఏడాది దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేకమైన "భారత్ పర్వ్-2021" ఉత్సవంలో అనేక వీడియోలు / చలన చిత్రాలు, ఫోటోలు, బ్రోచర్లతో పాటు వివిధ సంస్థల సమగ్ర సమాచారాన్ని కూడా వీక్షించడానికి వీలుగా అందుబాటులో ఉంచారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు, ఇతర పరికరాల్లో వారి సౌలభ్యం మేరకు, www.bharatparv2021.com " వెబ్-సైట్ కు లాగిన్ అవ్వడం ద్వారా, ఈ "భరత్ పర్వ్-2021" ఉత్సవాన్ని తిలకించి, ఆనందించి, నిజమైన భారతదేశ స్ఫూర్తిని అనుభవించవచ్చు.

*****


(रिलीज़ आईडी: 1692388) आगंतुक पटल : 169
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Malayalam