ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఎదుగుతున్న కెవాడియా : ప‌్రధాని శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
17 JAN 2021 2:13PM by PIB Hyderabad
గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా అనేది ఇప్పుడు ఒక మారుమూల ప్రాంతం కాదని, ఇది ఇప్పుడు ప్రపంచంలోని ప్రధానమైన పర్యాటక కేంద్రంగా అవతరించిందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. కెవాడియానుంచి దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ వేసిన కొత్త రైళ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కెవాడియా అభివృద్ధి గాధను వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏకతా విగ్రహం అనేది ప్రపంచవ్యాప్తంగా వున్న పర్యాటకులను ఆకట్టుకుంటున్నదని అన్నారు. ఇది లిబర్టీ స్టాచ్యూకంటే ఎక్కువ పేరు సంపాదించుకుంటున్నదని ఆయన స్పష్టం చేశారు. ఏకతా విగ్రహాన్ని ప్రారంభించిన తర్వాత 50 లక్షల మంది పర్యాటకులు సందర్శించారని కరోనా సమయంలో మాత్రం సందర్శన ఆపేయడం జరిగిందని ఆయన అన్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో తిరిగి తెరిచిన తర్వాత సందర్శకులు పుంజుకుంటున్నారని ఆయన అన్నారు. కనెక్టివిటీ పెరిగిన తర్వాత రోజుకు ఒక లక్ష మంది సందర్శకులు వచ్చే అవకాశముందని ప్రధాని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే ప్రణాళిక ప్రకారం కెవాడియాను అభివృద్ధి చేయడం జరుగుతోందని ప్రధాని అన్నారు.
కెవాడియాను ప్రధాన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు అది అందరికీ ఒక కలగా అనిపించిందనే విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. అయితే పాత పద్దతుల్లో పని చేసి వుంటే అది కలగానే మిగిలిపోయేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధానాలు మార్చేసి రవాణా పెంచామని, సదుపాయాలను కల్పించామని ప్రధాని వివరించారు. ఇప్పుడు కెవాడియా పర్యాటక ప్రాంతంగా పేరొందిందని, కుటుంబ సమేతంగా వచ్చి చూస్తున్నారని ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఆకట్టుకుంటున్నాయని అన్నారు. ఏకతా విగ్రహం, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, సర్దార్ పటేల్ జూ పార్కు, ఆరోగ్య వనం, జంగిల్ సఫారీ, పోషణ్ పార్కు..ఇవన్నీ పర్యాటకులను అలరిస్తున్నాయని ప్రధాని అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందడం కారణంగా ఆదివాసీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, స్థానికులకు ఆధునిక సౌకర్యాలు లభిస్తున్నాయని తెలిపారు. స్థానిక హస్తకళలకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. ఆదివాసీ గ్రామాల్లో బస చేయడానికిగాను 200 గదులను నిర్మిస్తున్నామని ఆయన అన్నారు.
పెరుగుతున్న పర్యాటక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కెవాడియా స్టేషన్ ను అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఇక్కడ గిరిజన కళల గ్యాలరీ ఏర్పాటు చేశారని అక్కడనుంచి ఏకతా విగ్రహాన్ని చూడవచ్చని ఆయన అన్నారు.
లక్ష్యాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలను అభివృద్ధి చేస్తూ మార్పుసాధిస్తున్నామని ప్రధాని అన్నారు. సంప్రదాయంగా చేపట్టే ప్రయాణికుల రవాణా, వస్తు రవాణా సేవలే కాకుండా పర్యాటక, మత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల సందర్శన సేవలను ఏర్పాటు చేయడంద్వారా రైల్వేలు అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. అహమ్మదాబాద్ - కెవాడియా జన్ శతాబ్దితోపాటు పలు మార్గాల్లో ఆకర్షణీయమైన విస్టా డోమ్ కోచులను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
******
(Release ID: 1689614)
Visitor Counter : 257
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam