ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య

తగ్గుదల; 197 రోజుల తరువాత 2.14 లక్షలు

నిన్న నమోదైన కొత్త కేసులు 15,968 మంది

Posted On: 13 JAN 2021 11:41AM by PIB Hyderabad

భారత దేశంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 2.14 లక్షల స్థాయికి చేరి ప్రస్తుతం 2,14,507 అయింది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా  2.04% కు చేరింది. ఇది 197 రోజుల తరువాత అత్యల్పం. గత జూన్ 30న చికిత్సలో ఉన్నవారి సంఖ్య 2,15,125 గా నమోదైంది. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 2051 తగ్గింది.

 

రోజువారీ నమోదవుతున్న కొత్త కోవిడ్ కేసులు కూడా గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. రోజుకు 16 వేల లోపు మాత్రమే నమోదవుతూ ఉన్నాయి. నిన్న 15,968 కేసులు వచ్చాయి. మరోవైపు గత 24 గంటలలో 17,817 మమిద్ కోలుకున్నారు. కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటం వలన చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.

 

ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి బైటపడి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 10,129,111 కి చేరింది.  దీనివలన కోలుకున్నవారి శాతం 95.51% కు చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేడా ప్రస్తుతం  99,14,604 కు చేరింది. కొత్తగా కోలుకున్నవారిలో 81.83% మంది పది రాష్ట్రాలకు చెందినవారు కాగా, కేరళలో అత్యధికంగా ఒక రోజులో  4,270 మంది, ఆ తరువాత మహారాష్ట్రలో 3,282 మంది, చత్తీస్ గఢ్ లో 1207 మంది కోలుకున్నారు. 

తాజాగా నిర్థారణ అయిన కోవిడ్ కేసులలో 74.82% కేవలం 7 రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయి. కేరళలో అత్యధికంగా  5,507 కొత్త కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో  2,936 మంది, కర్నాటకలో 751 మంది కోవిడ్ బారిన పడ్డారు.

గడిచిన 24 గంటలలో 202 మంది కోవిడ్ వల్ల మరణించగా అందులో 70.30% మరణాలు ఏడు రాష్ట్రాలలోనే నమోదయ్యాయి.  మహారాష్ట్రలో అత్యధికంగా 50 మరణాలు నమోదు కాగా కేరళలో 25 మంది, పశ్చిమ  బెంగాల్ లో 18 మంది చనిపోయారు.  .

కోవిడ్-19 టీకాల కార్యక్రమం జనవరి 16 న ప్రారంభం కాబోతోంది. ఈ భారీ దేశవ్యాప్త కార్యక్రమంలో ప్రజా భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో జరిగిన ఎన్నికల బూత్ వారీ వ్యూహాన్ని, సార్వత్రిక టీకాల కార్యక్రమం అనుభవాన్నీ వినియోగించుకుంటూ  ఇప్పుడున్న ఆరోగ్య సేవలకు, జాతీయ ప్రాథమిక ఆరోగ్య రక్షణ కార్యక్రమానికీ  ఎలాంటి భంగమూ వాటిల్లకుండా దీన్ని చేపడతారు. శాస్త్రీయ, నిబంధనాపరమైన నియంత్రణలకు విఘాతం కలగకుండా, ఇతర ప్రామాణిక నిర్వహణావిధానాలకు భంగం కలగకుండా సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ మొత్తం కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించటం మీద దృష్టి పెడతారు.  

కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో ప్రధానంగా ఆరోగ్య రంగ కార్యకర్తలకు, కోవిడ్ యోధులకు తొలిప్రాధాన్యం ఇస్తారు. వీరి కనీసం 3 కోట్లు ఉంటారని అంచనా వేశారు. ఆ తరువాత 50 ఏళ్ళు పైబడ్డవారు,  50 ఏళ్లలోపు ఉండి కూడా , ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలిస్తారు. వీరి సంఖ్య దాదాపు 27 కోట్లు ఉంటుందని అంచనావేశారు. ఈ మొత్తం టీకాల కార్యక్రమం సాఫీగా సాగటానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ, ఇప్పటికే నమూనా టీకాల కార్యక్రమం నిర్వహించటం తెలిసిందే.

ఇలా ఉండగా కొత్త రకం యు కె వైరస్ సోకిన వారి సంఖ్య ఈ రోజుకు 102 కు చేరింది.

***(Release ID: 1688205) Visitor Counter : 194