నీతి ఆయోగ్

ఇస్రో దత్తతలోకి వంద అటల్ టింకరింగ్ ల్యాబ్.లు

వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, అంతరిక్ష పరిశోధనపై

విద్యార్థుల్లో అధ్యయనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం

Posted On: 11 JAN 2021 3:58PM by PIB Hyderabad

పాఠశాల విద్యార్థుల్లో వైజ్ఞానిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై అవగాహన కల్పించేందుకు కీలకమైన ప్రభుత్వ సంస్థలు ఏకమయ్యాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత శాస్త్ర (స్టెమ్-ఎస్.టి.ఇ.ఎం.) రంగంతోపాటుగా, అంతరిక్షం, సంబంధిత సాంకేతిక పరిజ్ఞాన రంగపు సృజనాత్మక అంశాల్లో అధ్యయనాన్ని పాఠశాలల స్థాయి బాలల్లో ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా వంద అటల్ టింకరింగ్ ల్యాబ్.లను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దత్తత తీసుకొనబోతోంది. కీలక సంస్థలైన అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతీ ఆయోగ్, ఇస్రో కలసి ఒక ఉమ్మడి ఆన్ లైన్ కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన చేశాయి. భారతీయ విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహను, సృజనాత్మక ఆలోచలను అలవర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్.లను ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది.

 వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా జరిగిన కార్యక్రమంలో నీతీ ఆయోగ్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఒక సందేశమిస్తూ, ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదం స్ఫూర్తితో స్వావలంబనతో కూడిన భారతదేశ నిర్మాణానికి విభిన్నమైన మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు కలసికట్టుగా సమన్వయంతో ముందుకు రావడం సంతోషం కలిగిస్తోందన్నారు. నీతీ ఆయోగ్, ఇస్రో మధ్య సహకారం ఇలాంటి సమన్వయకృషికి తార్కారణమన్నారు. ఎదుగుతున్న అంతరిక్ష పరిశోధకులు, వ్యోమగాములు మనదేశంలోని అత్యుత్తమ నిపుణులనుంచి శిక్షణ పొందడానికి ఇది గొప్ప అవకాశమని,..తమ పాఠశాలకు, కుటుంబానికి, స్థానిక ప్రజలకు వారు స్ఫూర్తిగా మిగిలిపోతారని ఆయన అన్నారు.

   ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ మాట్లాడుతూ, పాఠశాలల బాలల్లో సృజనాత్మకతను, ప్రయోగాత్మక అధ్యయనాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్య దోహదపడుతుందని, సంప్రదాయ బద్ధమైన విద్యార్జనతో పోలిస్తే ఇది ఎంతో విభిన్నమైనదని అన్నారు. ఈ పథకంతో విద్యార్థులకు పాఠశాల స్థాయినుంచే పరిశోధనాత్మక అధ్యయన వైఖరి పెంపొందుతుందన్నారు. దేశవ్యాప్తంగా భౌగోళికంగా ఇస్రో కార్యాలయాలకు అనుసంధానంగా ఉన్న వంద అటల్ టింకరింగ్ ల్యాబ్.లను ఇస్రో ఈరోజున దత్తత తీసుకుందని, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికి అనుగుణంగా, అంతరిక్షంపై బాలల చదువుల కలను సాగారం చేసే దిశగా ఇస్రో చిన్న ప్రయత్నం చేస్తోందని శివన్ అన్నారు. అంతరిక్ష పరిశోధనా కార్యకలాపాలపై మేధోమధనంతో కూడిన ఆలోచనలను, అవగాహనను పొందించేందుకు  ఇస్రో కేంద్రాల శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కృషి చేస్తారని, ఈ విషయంలో ఎంపికచేసిన టింకరింగ్ ల్యాబుల ఉపాధ్యాయులతో వారు ఎప్పటికప్పుడు సంప్రదింపులు సాగిస్తారని శివన్ తెలిపారు. ఇస్రో కేంద్ర కార్యాలయానికి చెందిన సామర్థ్యాల నిర్మాణ కార్యక్రమ విభాగం సమన్వయంతో ఈ కార్యకలాపాలను నిర్వహిస్తారన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్.లతో అనుసంధానించిన విద్యార్థులు శ్రీహరికోటలో జరిగే ఏదైనా అంతరిక్ష ప్రయోగానికి అతిథులుగా హాజరుకావచ్చని డాక్టర్ శివన్ ఆహ్వానించారు.

   బాల్యదశలోనే విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహ, సృజనాత్మక ఆలోచనను అలవర్చే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్.లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా టింకరింగ్ ల్యాబ్.లను అటల్ ఇన్నొవేషన్ మిషన్, నీతీ ఆయోగ్ గతంలో ఏర్పాటు చేశాయి. ఆరునుంచి 8వ తరగతి వరకూ విద్యార్థుల్లో సృజనాత్మక భావనలను, వైజ్ఞానిక సాంకేతిక పరిజ్ఞాన స్పృహను కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్.ల ద్వారా ఇప్పటివరకూ 30లక్షల మందికిపైగా ఆ ప్రయోజనం లభించింది. తాజా అవగాహన కింద అంతరిక్షంతోపాటుగా, వివిధ సృజనాత్మక అంశాలపై విద్యార్థులకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో  ఇస్రో  స్వయంగా శిక్షణ అందిస్తుంది. విద్యార్థులు కేవలం పుస్తక పఠనా జ్ఞానాన్నే కాక, ఆచరణ పూర్వకమైన, క్రియాశీలకమైన అనుభవాన్ని కూడా గడించేందుకు ఇది దోహదపడుతుంది. ఎలెక్ట్రానిక్స్, భౌతిక శాస్త్రం, ఆప్టిక్స్, ఆంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, మెటీరియల్ సైన్స్, తదితర అంశాలపై వారికి అవగాహన కలుగుతుంది.

  నీతీ ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( సి.ఇ.ఒ.) అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, భావితరపు అంతరిక్ష శాస్త్రవేత్తలను తయారు చేసుకునేందుకు ఇస్రో, తమ ప్రాంతీయ పరిశోధనా  కేంద్రాల ద్వారా వంద దాకా అటల్ టింకరింగ్ ల్యాబ్.లను దత్తత తీసుకోవడం సంతోష దాయకమన్నారు. బాల విద్యార్థులను, చిన్నారి పరిశోధకులకు ఇస్రో శాస్త్రవేత్తలు స్వయంగా మార్గదర్శకత్వం వహించడం హర్షదాయకమన్నారు. భారతదేశం గర్వించదగిన ఎన్నో విజయాలను ఇటీవలే సాధించిన ఇస్రో,.. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ అగ్రశ్రేణి సంస్థగా పేరు గాంచిందన్నారు.  ఇస్రో ఇటీవలే స్టార్టప్ సంస్థలకు ఆహ్వానం పలికిందని, అంతరిక్ష పరిశోధనా రంగం భవిష్యత్తులో ఎంతో కీలకపాత్ర పోషించబోతోందని ఆయన అన్నారు. విద్యార్థులు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకునేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్.లు అందిస్తున్న అవకాశాలు ఇస్రో సహకారంతో మరింత మెరుగుపడతాయని అటల్ ఇన్నోవేషన్ కార్యక్రమం మిషన్ డైరెక్టర్ రామనాథన్ రమణన్ అన్నారు. విద్యార్థులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేయడం జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ఉందని, ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు.

 

*****



(Release ID: 1687762) Visitor Counter : 351