ప్రధాన మంత్రి కార్యాలయం

జనవరి 12నాటి 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

Posted On: 10 JAN 2021 12:13PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకల ముగింపు సభ ను ఉద్దేశించి ఈ నెల జనవరి 12న మంగళవారం ఉదయం 10:30 గంటలకు దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు.  ఈ వేడుకలలో జాతీయ స్థాయి విజేతలు ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.  ఈ కార్యక్రమం లో లోక్‌స‌భ స్పీకర్, కేంద్ర విద్య శాఖ మంత్రి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కూడా పాల్గొంటారు.


జాతీయ యువజన పార్లమెంటు వేడుకలు

18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన యువజనుల అభిప్రాయాలను సేకరించడం ‘జాతీయ యువజన
పార్లమెంటు వేడుక’ (ఎన్ వైపిఎఫ్) లక్ష్యంగా ఉంది.  ఈ యువజనులు వోటు హక్కు ను సంపాదించుకోవడంతో పాటు రాబోయే కాలంలో సార్వజనిక సేవలు సహా వివిధ సేవలలో చేరే అవకాశం ఉన్న వారు కావడం గమనించదగ్గది.  ప్రధాన మంత్రి 2017 డిసెంబరు 31న తన ‘‘మన్ కీ బాత్’’ (‘మనసు లో మాట’) కార్యక్రమంలో వెల్లడించిన మనోభావాల స్ఫూర్తి తో ఈ జాతీయ యువజన పార్లమెంటు వేడుకలకు
నాంది పలికారు.  ఇందులో భాగంగా ‘‘నవభారత గళంగా నిలవండి... పరిష్కారాన్వేషణతో విధాన నిర్ణయాలకు తోడ్పడండి’’ అనే ఇతివృత్తం తో 2019 జనవరి 12 నుంచి ఫిబ్రవరి 27 దాకా తొలి యువజన పార్లమెంటు సమావేశాలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 88,000 మంది పాలుపంచుకున్నారు.

ఈ నేపథ్యంలో 2వ జాతీయ యువజన పార్లమెంటు వేడుకలకు 2020 డిసెంబరు 23 నుంచి వాస్తవిక సాదృశ విధానంలో శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల తొలిదశ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రదేశాలనుంచి 2.34 లక్షల మంది యువత పాల్గొన్నారు. అటుపైన 2021 జనవరి 1 నుంచి 5వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి యువజన పార్లమెంటు కార్యక్రమాలను నిర్వహించడమైంది. ప్రస్తుతం ఈ 2వ జాతీయ యువజన పార్లమెంటు తుది సమావేశాలు పార్లమెంటు సెంట్రల్ హాలులో 2021 జనవరి 11న నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 29 మంది జాతీయ స్థాయి విజేతలకు జాతీయ న్యాయ నిర్ణయ సంఘం సమక్షంలో మాట్లాడే అవకాశం లభిస్తుంది. ఈ న్యాయ నిర్ణయ సంఘం లో రాజ్యసభ సభ్యురాలు రూపా గంగూలీ, లోక్‌స‌భ సభ్యులు శ్రీ పర్ వేశ్ సాహిబ్ సింహ్, ప్రముఖ పాత్రికేయుడు శ్రీ ప్రఫుల్ల్ కేత్ కర్ లు సభ్యులుగా ఉన్నారు. కాగా, అగ్రస్థానంలో నిలిచిన ముగ్గురు విజేతలకు 12వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి సమక్షాన ప్రసంగించే అవకాశం లభిస్తుంది.


జాతీయ యువజనోత్సవాలు

జాతీయ యువజన ఉత్సవాలు ప్రతి సంవత్సరం జనవరి 12 నుంచి 16వ తేదీవరకూ సాగుతాయి.  స్వామి వివేకానంద జయంతి కావడంతో ఏటా జనవరి 12ను జాతీయ యువజన
దినోత్సవంగా నిర్వహిస్తారు.  కాగా, ఈ సంవత్సరం జాతీయ యువజనోత్సవాలతో పాటు జాతీయ యువజన పార్లమెంటు వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు.

దేశ యువతరం ప్రతిభాపాటవాలను వెలుగులోకి తెచ్చేదిశగా వారికి ఒక వేదికను సమకూర్చడం జాతీయ యువజనోత్సవాల లక్ష్యం.  ఇందులో భాగంగా ఒక సూక్ష్మభారతదేశాన్ని సృష్టించి యువజనుల మధ్య అధికార, అనధికార స్థాయిలో పరస్పర సంభాషణలు, సంప్రదింపులకు వీలు కల్పిస్తారు.  తదనుగుణంగా వారు తమ సామాజిక, సాంస్కృతిక విశిష్టతలను పరస్పరం మార్పిడి చేసుకుంటారు.  తద్వారా ఈ కార్యక్రమం జాతీయ సమగ్రత ను ప్రోత్సహించడంతో పాటు సామాజిక సామరస్యం, సౌభ్రాత్రాల స్ఫూర్తి నింపడమేగాక ధైర్యంతో సాహసాలవైపు నడిపేలా చేస్తుంది.  మొత్తంమీద ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి, సారాంశం, భావనలకు ప్రాచుర్యం తేవడమే ఈ యువజనోత్సవాల ప్రాథమిక ధ్యేయం.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా 24వ జాతీయ యువజనోత్సవాలను వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నారు. ఈసారి ఉత్సవాలకు ‘‘నవభారతానికి యువజనోత్సాహం’’ ఇతివృత్తంగా ఉంది.  న్యూ ఇండియా  స్వప్నాన్ని యువజనులే సాకారం చేయగలరన్నది ఈ నినాదానికి అర్థం.  ఈ నేపథ్యంలో 24 వ జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవంతో పాటు 2వ జాతీయ
యువజన పార్లమెంట్ వేడుకల ముగింపు కార్యక్రమం రెండూ 2021 జనవరి 12న పార్లమెంటు సెంట్రల్ హాల్‌ లో జరుగుతాయి.  అటుపైన 24వ జాతీయ యువజనోత్సవాల ముగింపు కార్యక్రమం 2021 జనవరి 16న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్ కర్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహిస్తారు. 

***(Release ID: 1687542) Visitor Counter : 160